ల‌క్ష్మీ దేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే..

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా.. అనుకోకుండా ఎదుర‌య్యే ప్ర‌మాదం వ‌ల‌న క‌లిగే ఆదాయ న‌ష్టాన్ని భ‌ర్తీ చేస్తుంది.

ల‌క్ష్మీ దేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే..

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. అంద‌రు సుఖ శాంతుల‌తో వ‌ర్థిల్లుతారు. ఆరోగ్యంగా లేక‌పోతే చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చుల‌కు ఇంట్లో ఉన్న ల‌క్ష్మి అంటే డ‌బ్బు పూర్తిగా చేజారీపోతుంది. మ‌రి మీ ఇంట్లో ల‌క్ష్మీ దేవి కొలువై ఉండాలంటే ఇంట్లో ఉన్న ల‌క్ష్మిని కాపాడుకోవాలంటే మీకు ఆర్థిక భ‌ద్ర‌త అవ‌స‌రం. దీనికోసం మీకు అవ‌స‌ర‌మైన అయిదు ర‌కాల పాల‌సీల‌ను క‌లిగి ఉంటే ఎటువంటి ప్ర‌మాదం ఎదురైనా ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉండ‌దు. మ‌రి దీనికోసం జీవిత‌, ఆరోగ్య‌, ఇంటి, వ్య‌క్తిగత‌, వాహ‌న బీమా ఉండాలి. వీటితో ఏ ర‌క‌మైన ప్ర‌మాదం అనుకోకుండా వ‌చ్చిన మీకు, కుటుంబానికి ఆర్థిక భరోసా ల‌భిస్తుంది.

జీవిత బీమా:
కుటుంబంలో ఆర్థికంగా మీపై ఆధార‌ప‌డిన వారు ఉంటే మీకు జీవిత బీమా త‌ప్ప‌నిస‌రి. దీనికోసం ట‌ర్మ్ బీమా పాల‌సీని కొనుగోలు చేయాలి. దీనికి ఖ‌ర్చు త‌క్కువ, హామీ ఎక్కువ‌గా ఉంటుంది. ఒక‌వేళ అనుకోకుండా పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే నామినీకి బీమా హామీ ల‌భిస్తుంది. కాల‌ప‌రిమితి ముగిసేంత‌వ‌ర‌కు పాల‌సీదారుడు జీవించి ఉంటే ఎటువంటి హామీ ల‌భించ‌దు. మీ వార్షికాదాయానికి 12-15 రెట్ల ట‌ర్మ్ పాల‌సీ క‌లిగి ఉండాల‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీపై ఆధార‌ప‌డిన‌వారు మీరు ఉన్నప్పుడు, లేన‌ప్పుడు కూడా ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కోకుండా ఉండాలంటే జీవిత బీమా తీసుకొని వారికి భ‌రోసానివ్వాలి.

ఆరోగ్య బీమా:
వైద్య ఖ‌ర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆరోగ్య బీమా త‌ప్ప‌నిస‌రి. మీకు, కుటుంబానికి త‌గిన ఆరోగ్య బీమా ఎంచుకోవాలి. దీంతో వైద్యం కోసం ఆసుపత్రిలో చేరడానికి ముందు, తరువాత చేసిన ఖర్చులకు కూడా కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. వైద్య విధానాల సగటు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని, రూ. 5-6 లక్షల బీమా కలిగి ఉండటం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఆ త‌ర్వాత క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ కూడా తీసుకోవ‌డం మేలు. అనుకోకుండా ఏదైనా తీవ్ర వ్యాదుల భారిన ప‌డితే చికిత్స కోసం అయ్యే ఖ‌ర్చుల‌ను మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు భ‌రించ‌లేరు. ఈ పాల‌సీ ఉంటే తీవ్ర వ్యాదుల‌కు అయ్యే ఖ‌ర్చుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా
అనుకోకుండా ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే ఖ‌ర్చులు భారీగా పెరిగిపోతాయి. దీనికోసం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగి విశ్రాంతి తీసుకోవాల్సి వ‌చ్చిన, గాయాలు ఏర్ప‌డినా ఆదాయం కోల్పోతారు. వైద్య ఖ‌ర్చులు పెరుగుతాయి. అదే ఈ పాల‌సీ ఉంటే హామీ ల‌భిస్తుంది. వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీలో నాలుగు ర‌కాల క‌వ‌రేజ్ ఉంటుంది. మ‌ర‌ణం, శాశ్వ‌త వైక‌ల్యం, పాక్షిక వైక‌ల్యం, పాక్షిక శాశ్వ‌త వైక‌ల్యం. పాల‌సీ డాక్యుమెంట్‌లో ఇచ్చిన విధంగా దేనికి ఎంత శాతం హామీ ల‌భిస్తుందో తెలుసుకోవాలి.

గృహ బీమా:
గృహ బీమా ఇంటితో పాటు, ఇంట్లో ఉన్న విలువైన వ‌స్తువుల‌కు కూడా హామీనిస్తుంది. మీరు అద్దె ఇంట్లో నివ‌సిస్తున్న‌ప్ప‌టికీ ఈ పాల‌సీని క‌లిగి ఉండ‌టం మంచిది. ఎందుకంటే అగ్ని ప్ర‌మాదం వంటి కార‌ణాల వ‌ల‌న జ‌రిగే న‌ష్టానికి హామీ ల‌భిస్తుంది. స‌హ‌జ విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇంటిపై బీమా ఉంటే ఆర్థిక భ‌రోసా ల‌భిస్తుంది. రీఇన్‌స్టేట్‌మెంట్ పాల‌సీని ఎంచుకుంటే ఇల్లు డ్యామేజ్ అయితే తిరిగి పున‌రుద్ధ‌రించేందుకుఉ, వ‌స్తువుల‌ను తిరిగి పొందేందుకు హామి ఉంటుంది. దోపిడీ, విద్యుత్ ప్ర‌మాదాలు, అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు ఇంటి బీమా ఉప‌యోగ‌ప‌డుతుంది.

వాహ‌న బీమా:
కొత్త‌గా స‌వ‌రించిన‌ వాహ‌న చ‌ట్టం కింద థర్డ్ పార్టీ బీమా లేక‌పోతే వాహ‌న‌దారులు భారీగా జ‌రిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పాల‌సీ కేవ‌లం థ‌ర్డ్ పార్టీకి డ్యామేజ్ జ‌రిగితేనే హామీ ఇస్తుంది. కాబ‌ట్టి కాంప్ర‌హెన్సివ్ పాల‌సీ తీసుకుంటే మీతో పాటు వాహ‌నానికి, మీతో పాటు ప్ర‌యాణం చేస్తున్న‌వారికి ప్ర‌మాదం జ‌రిగితే కూడా క‌వ‌రేజ్ ఉంటుంది.
మీ వాహనం భాగాల కోసం అయ్యే ఖర్చును బీమా సంస్థలు చెల్లించ‌వు. కేవ‌లం డ్యామేజ్‌కి మాత్ర‌మే చెల్లిస్తాయి. డిప్రిసియేష‌న్ క‌వ‌ర్ క‌లిగి ఉంటే మిగ‌తా ఖ‌ర్చుల‌ను కూడా భ‌రిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly