పాస్‌వ‌ర్డ్‌ చెప్పేస్తున్నారా?

ఆర్థిక విష‌యాల‌లో కుటుంబ స‌భ్యుల‌కు కూడా చెప్ప‌కూడ‌ని అంశాలు కొన్ని ఉంటాయి.

పాస్‌వ‌ర్డ్‌ చెప్పేస్తున్నారా?

సాధార‌ణంగా ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’, ‘న‌లుగురికి పంచుకోవ‌డం మంచి విష‌యం’ అని చెప్తుంటారు. కానీ, ఇది అన్ని విష‌యాల్లో ప‌నికిరాదు, ముఖ్యంగా ఆర్థిక విష‌యాల్లో. ఆర్థికంగా న‌ష్ట‌పోకూడ‌దంటే పిల్ల‌లు, భార్య లేదా భ‌ర్త‌కు కూడా చెప్ప‌కూడ‌ని విష‌యాలు కొన్ని ఉంటాయి. అవి …

కార్డు వివ‌రాలు:

క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నంబ‌ర్‌, కార్డుపై ఉన్న పూర్తి పేరు, సీవీవీ నంబ‌ర్ వంటివి ఎవ‌రికీ చెప్ప‌కూడ‌దు. ఆన్‌లైన్ లావాదేవీలు చేసేందుకు ఇవి అస‌వ‌ర‌ముంటాయి.ఈ వివ‌రాలు మీ కార్డుకు ప్రాథ‌మిక భ‌ద్ర‌త‌. ఇవి లేకుండా కార్డు ద్వారా లావాదేవీలు చేసే వీలుండ‌దు. అందుకే ఈ వివ‌రాల‌ను సుర‌క్షితంగా ఉంచుకోవాలి. ఎవ‌రికి చెప్ప‌కూడ‌దు.

సీవీవీ:

ప్ర‌తీ క్రెడిట్, డెబిట్ కార్డుకు (కార్డ్ వెరిఫికేష‌న్ వ్యాల్యూ) సీవీవీ నంబ‌ర్ కార్డు వెనుక‌వైపు ఉంటుంది. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ పూర్తిచేసేందుకు ఈ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి. అందుకే ఎవ‌రికీ ఈ నంబ‌ర్ వెల్ల‌డించ‌కూడ‌దు.

పాస్‌వ‌ర్డ్:

నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తే క‌స్ట‌మ‌ర్ ఐడీ, కార్డ్ వివ‌రాలు, పాస్‌వ‌ర్డ్ వంటివి ఇత‌రుల‌కు చెప్ప‌కూడ‌దు. తెలిసీ తెలియ‌కుండా ఎవ‌రికి కార్డు ఉన్న స‌మాచారం వెల్ల‌డించ‌కూడ‌దు. అదేవిధంగా ఎప్ప‌టిక‌ప్పుడు పాస్‌వ‌ర్డ్‌ల‌ను కూడా మారుస్తుండాలి.

పిన్ నంబ‌ర్:

క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ ప‌ర్స‌న‌ల్ ఐడెంటిఫికేష‌న్ నంబ‌ర్ (పిన్‌) ఏటీఎంల వ‌ద్ద‌, ఇత‌ర చెల్లింపుల వ‌ద్ద అవ‌స‌ర‌మ‌వుతాయి. ఇది సీక్రెట్ నంబ‌ర్ ఏటీఎంలు, పీఓఎస్ మిష‌న్ల వ‌ద్ద మీరు పిన్ టైప్ చేసేట‌ప్పుడు ఎవ‌రు చూడ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.

ఓటీపీ:

వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ (ఓటీపీ) అనేది ఆన్‌లైన్ లావాదేవీలు చేసేట‌ప్పుడు అథెంటికేష‌న్ కోసం మొబైల్ నంబ‌ర్‌కి వ‌స్తుంది. లావాదేవీ పూర్త‌య్యేందుకు చివ‌రి ద‌శ‌. ఓటీపీని ఇత‌రుల‌తో షేర్ చేసుకుంటే డ‌బ్బు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది.

ఇలాంటి వివ‌రాల‌ను బ్యాంకు లేదా ఆర్థిక సేవా సంస్థ‌లు ఎప్పుడు వినియోగ‌దారుల‌ను అడ‌గ‌వు. ఎవ‌రైనా ఫోన్ చేసి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని అడిగితే అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly