డ్రైవింగ్ లైసెన్స్ మ‌ర్చిపోతే జ‌రిమానా చెల్లించాల్సిందేనా?

డిజీలాక‌ర్, ఎంప‌రివాహ‌న్ యాప్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న సాఫ్ట్ కాపీల‌ను కూడా ఒరిజిన‌ల్ ప‌త్రాలుగానే ప‌రిగ‌ణిస్తారు

డ్రైవింగ్ లైసెన్స్ మ‌ర్చిపోతే జ‌రిమానా చెల్లించాల్సిందేనా?

నూత‌న‌ మోటారు వాహ‌నాల‌(స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం ప్ర‌కారం నిబంధ‌న‌లు అతిక్ర‌మించినా వాహ‌న సంబంధిత ప‌త్రాలు లేక‌పోయినా విధించే జ‌రిమానాల‌ను పెంచతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మ‌రి బ‌య‌ట‌కు వెళ్లే తొంద‌ర‌లో డ్రైవింగ్ లైసెన్స్‌, ఇత‌ర ప‌త్రాల‌ను మ‌ర్చిపోతే వినియోగ‌దారులు భారీ మొత్తంలో జ‌రిమానా చెల్లించాల్సి వ‌స్తుంది. అందువ‌ల్ల వినియోగ‌దారుల సౌక‌ర్యార్థం ర‌హ‌దారి ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ ఈ నియ‌మాల‌ను స‌వ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిబంధ‌న ప్ర‌కారం వాహ‌న సంబంధిత ప‌త్రాల‌ను ఇప్పుడు సాఫ్ట్ కాపీల రూపంలోనూ తీసుకెళ్ల‌చ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఇందుకోసం మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే స‌రిపోతుంది. డిజీలాక‌ర్, ఎంప‌రివాహ‌న్ యాప్‌ల ద్వారా సాప్ట్ కాపీల రూపంలో ప‌త్రాలు అందుబాటులో ఉంటాయి.

ఈ రెండు యాప్‌ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ మొబైల్ ఫోన్‌లో స్టోర్ చేసుకోవ‌చ్చు. ఒకవేళ ప‌త్రాలు మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ కాక‌పోతే ఎంప‌రివాహ‌న్ యాప్ ద్వారా చూపించి జ‌రిమానా నుంచి త‌ప్పించుకోవచ్చు. డిజీలాకర్‌, ఎంపరివాహన్‌ యాప్‌ల్లో నిక్షిప్తం చేసిన ధ్రువపత్రాలను, హార్డ్ కాపీల‌తో స‌మానంగా చూడాల‌ని ట్రాఫిక్ పోలీసుల‌కు ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింది. అయితే డిజిటల్ ఫార్మాట్‌లో అన్నంత మాత్రన ఫోన్‌లో ఫొటో తీసి లేదా స్కాన్ చేసి పెట్టుకుంటే… ఆ ప‌త్రాలు చెల్లుబాటు కావు. ప్రావిజ‌న్స్ ఆప్ ది ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్ 2000 ప్ర‌కారం డిజీలాక‌ర్‌, ఎంప‌రివాహ‌న్ ద్వారా అందుబాటులో ఉన్న ప‌త్రాలు మాత్ర‌మే చ‌ట్ట‌రీత్యా చెల్లుబాటు అవుతాయి. అంటే ఈ యాప్‌ల ద్వారా నిక్షిప్తం చేసుకున్న సాప్ట్ కాపీలను మాత్ర‌మే లీగ‌ల్ డాక్యుమెంట్లు ప‌రిగ‌ణిస్తారు. వేరే విధంగా సాప్ట్ కాపీల రూపంలో ప‌త్రాల‌ను చూపించినా జ‌రిమానా చెల్లించ‌క త‌ప్ప‌దు.

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎంపిరివాహ‌న్‌ మొబైల్ యాప్‌లో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ వ్యాలిడిటీ, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ, పర్మిట్ వ్యాలిడిటీ వివరాలను వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ / రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా రియల్ టైమ్ ప్రాతిపదికన తెలుసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly