ఐటీఆర్ ఫైలింగ్ గ‌డువు పెరుగుతుందా?

ఫారం 16 గ‌డువు పెంచ‌డంతో ఐటీఆర్ దాఖ‌లు చేసేందుకు కొంత స‌మ‌యం మాత్ర‌మే ఉంది

ఐటీఆర్ ఫైలింగ్ గ‌డువు పెరుగుతుందా?

గత ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించి ఫారం-16ను ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగులకు జులై 10 వరకు ఇచ్చేందుకు గడువు తేదీని 25 రోజులు పొడిగిస్తూ ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది. ఇదివ‌ర‌కు చివ‌రి తేది జూన్ 15 గా ఉండ‌గా ఇప్పుడు జులై 10 వ‌ర‌కు పెంచింది. అయితే గడువు పొడిగింపు తేదీ నుంచి చూస్తే వేతనజీవులు రిటర్న్‌లు దాఖలు చేసేందుకు కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు 2019 జులై 31లోగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే సీబీడీటీ వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుల‌కు అనుగుణంగా ఆగ‌స్ట్ రెండో వారం వ‌ర‌కు ఐటీఆర్ ఫైలింగ్ తేదీని పొడ‌గించ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఫారం 24క్యూ దాఖలు చేసేందుకు కూడా ఉద్యోగ సంస్థలకు అదనంగా నెల రోజుల సమయం ఇచ్చింది. జూన్‌ 30వ తేదీ వరకు గడువు తేదీని పొడిగించింది. ఫార్మాట్‌లో మార్పులు, ఆన్‌లైన్‌ విధానం నవీకరణ దృష్ట్యా నిర్ణీత సమయంలోగా ఉద్యోగ సంస్థలు టీడీఎస్‌ను సమర్పించేందుకు గడువు తేదీని పొడిగించినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఫారం 24క్యూలో టీడీఎస్‌ వివరాల దాఖలుకు గడువు తేదీని మే 31 నుంచి జూన్‌ 30వ తేదీకి పొడగించింది.

ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే సమయంలో టీడీఎస్‌ను మినహాయించుకుంటాయి. ఈ టీడీఎస్‌ వివరాలను ఫారం 24క్యూలో మూడు నెలలకోసారి ఆదాయపు పన్ను విభాగానికి సమర్పించాలి. ఉద్యోగులకు ఇచ్చిన వేతనాలతో పాటు మినహాయించుకున్న టీడీఎస్‌ వివరాలు ఫారం 24క్యూలో కనిపిస్తాయి.

ఈ ఏడాది ఆదాయ ప‌న్ను శాఖ ఫారం 16 లో ప‌లు మార్పుల‌ను తీసుకొచ్చింది. ప‌న్ను చెల్లింపుదారుడికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను అందించే విధంగా రూపొందించారు. ఈ సవ‌రించిన విధానం ఇప్ప‌టికే ఆదాయ‌ప‌న్ను శాఖ‌ నోటిఫై చేసింది. మే 12, 2019 నుంచి ఇది అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఫారం 16 లో వ‌చ్చిన మార్పుల‌తో ఐటీఆర్ ఫైలింగ్ మ‌రింత‌ సుల‌భ‌మైంద‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly