ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డికి నాలుగు పెట్టుబ‌డి సాధ‌నాలు

నిత్యం ధ‌ర‌లు పెరుగుతుండ‌ట‌మే ద్ర‌వ్యోల్బ‌ణం. మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డులు దీన్ని మించిన రాబ‌డి అందించే చూసుకోవాలి.

ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డికి నాలుగు పెట్టుబ‌డి సాధ‌నాలు

ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగితే సామాన్యుల‌కు వ‌చ్చే స‌మ‌స్య‌లు నిత్యావ‌స‌ర వ‌స్తువుల పెరుగుద‌ల‌. ఏదోక రూపంలో దీని ప్ర‌భావం అంద‌రిమీద ఉంటుంది. మ‌రి ఈ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపు చేసేదెలా అని అనుకుంటున్నారా అది మ‌న చేతుల్లో లేదు రిజర్వు బ్యాంకు ఈ కార్య‌క్ర‌మాన్ని చూసుకుంటుంది. ద్ర‌వ్యోల్బ‌ణం ఎక్కువ లేదా త‌క్కువ కాకుండా 2-6 శాతం మ‌ధ్య‌లో ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతుంది. ఈ వ్య‌వ‌హారం రిజ‌ర్వు బ్యాంకు పాల‌సీ మార్పులు చేసిన కొన్ని రోజుల‌కు గానీ వాటి ఫ‌లాలు మ‌న‌కు చేర‌వు. మ‌న మార్కెట్ ల్యాగ్ లో ఉండటం దీనికి ఒక కార‌ణం. ల్యాగ్ అంటే ఆల‌స్యం కావ‌డం. రిజ‌ర్వు బ్యాంకు వారు ద్ర‌వ్యోల్బ‌ణ నియంత్ర‌ణ దృష్టితో వ‌డ్డీ రేట్లలో మార్పులు చేస్తుంటారు. వాటిని చేసిన‌ త‌రువాత బ్యాంకుల‌కు అక్క‌డి నుంచి మ‌న‌కు అందుతాయి. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ఆప‌లేం కాబ‌ట్టి ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిన మ‌నం ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, దాన్ని మించి రాబ‌డి అందించే పెట్టుబ‌డులు ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం ఉంద‌నుకుందాం. అప్పుడు మీరు సంవ‌త్స‌రం పాటు రూ. 2000 మీ బీరువాలో ఉంచుకుంటే దాని విలువ వ‌చ్చే సంవ‌త్స‌రం అదే తేదీకి రూ. 1880 అవుతుంది. ఈ మ‌ధ్య‌లో నోట్ల ర‌ద్దు లాంటివి లేక‌పోతే మీ రూ.2000 నోటు చెల్లుతుంది.నోటు రూపం మార‌దు కానీ దాని నిజ‌మైన విలువ రూ. 1880 అవుతుంది.

ఏ విధ‌మైన పెట్టుబ‌డి చేయ‌కుండా ఉంచితే కొంత కాలానికి దాని విలువ‌ మ‌రింత త‌గ్గుతుంది . కాబ‌ట్టి మ‌దుప‌ర్లు త‌మ సంప‌ద‌ను పెంచుకోవాలంటే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించిన రాబ‌డి పొందే విధంగా పెట్టుబ‌డులు చేయాలి. ఎందుకంటే ఒక వేళ మీరు ఏదైనా పెట్టుబ‌డి 6 శాతం కంటే త‌క్కువ లేదా అంతే రాబ‌డిని అందించిన దాంట్లో ఉంచితే మీ రెండు వేలు మీకు మిగులుతుంది త‌ప్ప లాభం ఉండ‌దు. కాబ‌ట్టి 6 శాతం కంటే ఎక్కువ రాబ‌డి ఇచ్చే పెట్టుబ‌డుల‌ను ఎంచుకుని మీ న‌ష్ట‌భ‌యానికి త‌గ్గ‌ట్టుగా ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి.

ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డి ఇచ్చేందుకు వీలున్న పెట్టుబ‌డి ప‌థ‌కాలు:

ద్రవ్యోల్బణ సూచిక పొదుపు బాండ్లు-

ఈ ప‌రిస్థితిని అధిగమించేందుకు ద్ర‌వ్యోల్బ‌ణ సూచీఆధారిత బాండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ద్ర‌వ్యోల్బ‌ణంతో నిమిత్తం లేకుండా వినియోగ‌దారు ధ‌ర‌ల సూచీ ఆధారిత ద్ర‌వ్యోల్బణం కంటే 1.5శాతం వ‌డ్డీని ఈ ద్రవ్యోల్బణ సూచిక జాతీయ పొదుపు బాండ్ల ద్వారా పొంద‌వ‌చ్చు.

కనీస పెట్టుబడి పరిమితి రూ.5000 నుంచి మొద‌ల‌వుతుంది. ప్ర‌తీ ద‌ర‌ఖాస్తుదారు గ‌రిష్ఠంగా ఏటా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టేందుకు అనుమ‌తి ఉంది. ఈ బాండ్ల కాల‌వ్య‌వ‌ధి ప‌దేళ్లు.

వార్షిక వడ్డీ రేటు = వాస్త‌వ వడ్డీ రేటు (స్థిర వ‌డ్డీ రేటు) + ద్రవ్యోల్బణ రేటు వాస్త‌వ వడ్డీ రేటు 1.5 శాతం ఉంటుంది. దీన్నే ప్రామాణిక రేటుగా తీసుకుంటారు. ఆరు నెలలకు చక్రవడ్డీ వర్తింపజేస్తారు.

కంపెనీ ఫిక్సిడ్ డిపాజిట్లు-

కార్పొరేట్‌ కంపెనీలు మూలధనాన్నిసమీకరించేందుకు ఫిక్సిడ్ డిపాజిట్లను జారీచేస్తాయి. కనీసం కాలపరిమితి సంవత్సరం మొదలుకొని గరిష్ఠంగా 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన కార్పొరేట్‌ ఫిక్సిడ్ డిపాజిట్లను కంపెనీలు జారీ చేస్తున్నాయి. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్‌ల కంటే వీటిపై వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి కొంత నష్టభయంతో కూడుకున్నవి. మంచి రేటింగ్‌ ఉన్న కంపెనీ ఫిక్సిడ్ డిపాజిట్లను ఎంచుకోవడం ద్వారా న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. వీటిపై రాబ‌డి 10 శాతం నుంచి ఉంటుంది. త‌క్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న‌వి కొంచెం ఎక్కువ రాబ‌డి అందిస్తాయి. వీటిలో న‌ష్ట‌భ‌యం ఎక్క‌వ ఉంటుంది.

ఇవి వివిధ కాల ప‌రిమితుల్లో అందుబాటులో ఉంటాయి. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు త‌మ రాబ‌డి అంచ‌నా న‌ష్ట‌భ‌యం త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌న‌ణ‌లోకి తీసుకుని మ‌దుప‌ర్లు త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌వాటిని ఎంచుకోవ‌చ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్లు-

మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను వివిధ‌ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేస్తారు. వాటి నుంచి ఆర్జించిన‌ లాభాల‌ను మ‌దుప‌ర్ల‌కు వారికున్న యూనిట్ల ప్ర‌కారం పంచుతాయి అయితే వీటిలో ర‌కార‌కాల వ్యూహాలు, విధానాలు, అసెట్ అలోకేష‌న్లు బ‌ట్టి వివిధ ర‌కాల‌ మ్యూచువ‌ల్ ఫండ్లు అందుబాటులో ఉంటాయి. ఈక్విటీ ఫండ్ల‌యితే దీర్ఘ‌కాలంలో 10-15 శాతం , డెట్ ఫండ్ల‌యితే 8-9 శాతం మ‌ధ్య రాబ‌డి ఇస్తుంటాయి. ఎంపిక చేసుకున్న ఫండ్ల ర‌కం బ‌ట్టి వీటిలో కొంత‌ న‌ష్ట‌భ‌యం ఉంటుంది.

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్)-
మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను ఏదైనా సూచీని అనుక‌రిస్తూ పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌ను ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌)లు అంటారు. నిఫ్టీ-50, సెన్సెక్స్-30 లాంటి మార్కెట్ సూచీల‌తో పాటు బ్యాంకింగ్ నిఫ్టీ, ఆటో నిఫ్టీ ప్ర‌త్యేక రంగానికి చెందిన‌ సూచీల‌లో కూడా మ‌దుపు చేస్తుంటాయి.

ఉదాహ‌ర‌ణ‌కు నిఫ్టీ బ్యాంకింగ్ ఈటీఎఫ్, బ్యాంకింగ్ సూచీని అనుక‌రిస్తూ పెట్టుబ‌డి చేస్తుంది . దీన్నిబ్యాంకింగ్ ఈటీఎఫ్ అంటారు. మ్యూచువ‌ల్ ఫండ్లతో పోలిస్తే ఈటీఎఫ్‌లు త‌క్కువ నిర్వ‌హాణ రుసుమును వ‌సూలు చేస్తాయి. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ‌వుతుంటాయి. వీటిలో కూడా న‌ష్ట‌భ‌యం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly