హోట‌ల్ అద్దె, లాట‌రీ, రిట‌ర్నులు.. స‌మావేశంలో చ‌ర్చ‌నీయాంశాలు

జీఎస్‌టీ మండ‌లి దిల్లీలో 17వ స‌మావేశం నిర్వ‌హించి, ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేసింది.

హోట‌ల్ అద్దె, లాట‌రీ, రిట‌ర్నులు.. స‌మావేశంలో చ‌ర్చ‌నీయాంశాలు

జీఎస్‌టీ మండ‌లి ఆదివారం నిర్వ‌హించిన 17వ స‌మావేశంలో మిగిలి ఉన్న కొన్ని స‌మ‌స్య‌ల‌ను కొల‌క్కి తెచ్చింది. జీఎస్‌టీని కొంతకాలం వాయిదా వేయాలని విజ్ఞాపనలు వచ్చినా దాన్ని లెక్క‌చేయ‌కుండా జూన్ 30 అర్ధ‌రాత్రి నుంచే అమ‌లు తెచ్చేలా మండ‌లి మ‌రోసారి బ‌ల‌మైన సంకేతాన్నిచ్చింది.

అనుచిత లాభాపేక్ష (యాంటీ ప్రాఫిటీరింగ్‌) నిర్మూలించేందుకు అధీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకుగాను మండ‌లి ఆమోదముద్ర వేసింది. ఈ అధీకృత యంత్రాంగం రెండేళ్ల దాకా కొన‌సాగుతుంది. అనుచిత లాభాపేక్ష జ‌రిపిన కంపెనీల‌పై తుది వేటు వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌నుంది అధీకృత యంత్రాంగం. వినియోగ‌దారుల‌కు తిరిగి సొమ్ము చెల్లించ‌డ‌మో, లేక వినియోగ‌దారు సంక్షేమ నిధికి చేరేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ఈ అధీకృత సంస్థ ముఖ్య‌భూమిక పోషించ‌నుంది.

రిట‌ర్నుల దాఖ‌లులో స‌డ‌లింపులు

జీఎస్‌టీ మండ‌లి స‌మావేశంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం రిట‌ర్నుల ఫైలింగ్‌పై తీసుకున్నారు. జులై, ఆగ‌స్టుల‌కు సంబంధించి రిట‌ర్నుల ఫైలింగ్‌లో గ‌డువును పొడిగించారు. ప్ర‌స్తుతానికి అసెస్‌మెంట్ నెల త‌ర్వాత వ‌చ్చే 10వ తేదీ లోపు జీఎస్‌టీఆర్ 1 ఫార‌మ్‌తో ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే జీఎస్‌టీకి సంసిద్ధంగా అంద‌రు వ్యాపారులు లేని కార‌ణంగా రెండు నెల‌ల వ‌ర‌కు రిట‌ర్నుల దాఖ‌లు అంశ‌మై ఊర‌ట‌నిచ్చింది. జులైకి సంబంధించి రిట‌ర్నుల దాఖ‌లును ఆగ‌స్టు 20లోపు, అదే విధంగా ఆగ‌స్టుకు సంబంధించి ఫైలింగ్‌ను సెప్టెంబ‌రు 20లోపు జీఎస్‌టీఆర్ 3బి ఫారంను ఉప‌యోగించి చేసుకోవ‌చ్చున‌ని రెవెన్యూ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ అథియా అన్నారు.

హోట‌ల్ రూమ్‌ల ప‌న్నులు

జీఎస్‌టీ మండ‌లి ల‌గ్జ‌రీ హోట‌ళ్ల ప‌న్ను రేట్లలో స‌వ‌ర‌ణ‌లు తెచ్చింది. ఇదివ‌ర‌కు 28శాతం ప‌న్ను రూ.5000 పైబ‌డిన అద్దెపై విధించేలా ఉండేది. ఇప్పుడు రూ.7,500పై బ‌డిన అద్దెపై మాత్ర‌మే 28శాతం పన్ను వ‌సూలు చేయ‌నున్నారు. ఇక రూ.2,500- రూ.7,500 మ‌ధ్య ఉన్న హోట‌ల్ అద్దె గ‌దుల‌కు 18శాతం ప‌న్ను ప‌డ‌నుంది. గోవా, రాజ‌స్తాన్ లాంటి రాష్ట్రాలు హోట‌ల్ ప‌న్ను రేట్ల‌పై పునరాలోచించాల‌ని చేసిన విజ్ఞాపనలను మండ‌లి స్వీక‌రించి త‌గిన మార్పులు చేసింది.

లాట‌రీలపై ప‌న్ను

రాష్ట్రాలు సొంతంగా నిర్వ‌హించే లాట‌రీల‌పై 12శాతం ప‌న్ను విధించ‌నున్నారు. ఇక ఇత‌ర లాట‌రీల‌కు 28శాతం ప‌న్నే కొన‌సాగ‌నుంది.

ఈ-వే బిల్లు

ఈ-వే బిల్లుపై మండ‌లి ఎటువంటి నిర్ణ‌యానికి రాలేదు. రాష్ట్రాల మ‌ధ్య అభిప్రాయాలు స‌రిగ్గా కుద‌ర‌క దీనిపై నిర్ణ‌యం తీసుకోలేక‌పోయారు. ఈ-వే బిల్లు అమ‌లైతే రూ.50వేల‌కు పైబ‌డిన వ‌స్తువుల‌ను రాష్ట్రాల్లో, రాష్ట్రాల మ‌ధ్య త‌ర‌లించేందుకు ఈ-వే ప‌ర్మిట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిపై వివిధ రాష్ట్రాలు భిన్న అభిప్రాయాలు వ్య‌క్తంచేస్తుండంతో ఈ అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన‌ట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly