నూత‌న గృహ కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌

నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 12శాతం నుంచి 5శాతానికి, అఫర్డబుల్‌ హౌసింగ్ (పీఎమ్ఏవై) పై 8 శాతం నుంచి 1 శాతానికి జీఎస్టీ త‌గ్గింపు

నూత‌న గృహ కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌

గృహ కొనుగోలు దారుల‌కు ఊర‌ట క‌లిగిస్తూ, వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఆదివారం జ‌రిగిన 33వ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం నిర్మాణంలో ఉన్న ఇళ్ల‌పై ప్ర‌స్తుతం విధిస్తున్న 12 శాతం జీఎస్టీ 5 శాతానికి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా రూ.45లక్షల లోపు గృహాల కొనుగోలుపై జీఎస్టీ 1శాతంగా వర్తింపజేశారు. ఇంతకు ముందు ఇది 8%గా ఉండేది. ఈ తగ్గించిన జీఎస్టీ రేట్లు ఏప్రిల్‌1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.ఈ నిర్ణ‌యం రియ‌ల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంద‌ని, మ‌ద్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌మ సొంతంటి క‌ల‌ను నెర‌వేర్ప‌చుకునేందుకు దోహ‌ద ప‌డుతుంద‌ని జైట్లీ అభిప్రాయ‌ప‌డ్డారు.

రూ.45 లక్షల లోపు విలువ ఉన్న ఇళ్లు కానీ, మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు(645 చ‌ద‌ర‌పు అడుగులు), ఇతర నగరాల్లో 90 చదరపు మీటర్లు( 968 చ‌ద‌ర‌పు అడుగులు) వైశాల్యంగానీ ఉన్న సరసమైన గృహాలకు ఇది వర్తిస్తుంది. మెట్రో నగరాల్లో 60చదరపుమీటర్లు లేదా అంతకంటే తక్కువ ప్రాంతంలో నిర్మించిన గృహాలు, మెట్రో నగరాలు కాని నగరాల్లో 90చదరపు మీటర్లు లేదా అంతకంటే తక్కువ స్థలంలో నిర్మించిన గృహాలు సరసమైన గృహాల (అఫర్డబుల్‌ హౌసింగ్‌) కిందకు వస్తాయి.

నిర్మాణంలో ఉన్న గృహాలు, నిర్మాణం పూర్తైన తురువాత కూడా, నిర్మాణ ప‌నుల‌న్ని పూర్తైనట్లు ధ్రువ‌ప్ర‌తం పొంద‌ని ఇళ్ల‌కు ప్ర‌స్తుతం 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. నిర్మాణం పూర్తైనట్లు ధ్రువ‌ప‌త్రం ఉన్న ఇళ్ల‌పై ఎలాంటి జీఎస్టీ లేదు. దీనివల్ల పనులు పూర్తి కావడంపై వినియోగదారుడు వేచి చూసే సమయం తగ్గుతుందని జైట్లీ అన్నారు. బిల్డర్లు త్వరగా పనులు పూర్తి చేసే అవకాశం ఉందని, తద్వారా నిర్మాణ రంగంలోకి నిధుల ప్రవాహం పెరుగుతుందని చెప్పారు.

ప‌న్ను రేట్లు త‌గ్గించ‌డంలో గృహ కొనుగోలు దారుల‌కు వారి కేట‌గిరి ఆధారంగా మొత్తం ఇంటి ధ‌ర‌లో 6 నుంచి 7 శాతం త‌గ్గుతుంద‌ని ప్రాప‌ర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ షిషీర్ బైజల్ అన్నారు. ఈ నిర్ణ‌యంతో చాలా రోజులుగా త‌క్కువ అమ్మ‌కాల‌తో సాగుతున్న నిర్మాణంలో ఉన్న ఇళ్ళు అమ్మ‌కాలు జోరందుకుంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇండ‌స్ట్రీ నిపుణుల ప్ర‌కారం నిర్మాణం రంగంపై జీఎస్‌టీ ఎంతో గానో ప్ర‌భావం చూపించింది. జీఎస్టీ రేటు త‌గ్గింపుతో 2019లో నిర్మాణంలో ఉన్న గృహ అమ్మ‌కాల మ‌ళ్ళీ త‌మ వేగాన్ని కొన‌సాగిస్తాయ‌ని, భార‌త‌దేశంలో ఏడు ప్ర‌ధాన న‌గ‌రాల‌లో దాదాపు 5.88 ల‌క్ష‌ల నిర్మాణంలో ఉన్న గృహాలు అమ్మ‌కానికి ఉన్నాయ‌ని, అందులో 34 శాతం గృహాలు రూ.40 ల‌క్ష‌ల లోపు ధ‌ర క‌లిగిన‌వ‌ని అనరాక్ ప్రాప‌ర్టీ కన్సల్టెంట్ చైర్మెన్ అనుజ్ పూరీ తెలిపారు.

గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా నిర్మాణం పూర్తయినట్టు ఇంకా ధ్రువపత్రాలు రాని ఇళ్లకు 12 శాతం పన్ను విధిస్తున్నారు. చెల్లించిన పన్నులో కొంత మొత్తం ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) రూపంలో బిల్డరుకు వాపసుగా వస్తుంది. తాజాగా బిల్డర్లు ఐటీసీని పొందే సౌకర్యాన్ని రద్దు చేస్తూ జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. పన్ను వాపసుకు ఉద్దేశించిన ఐటీసీని బిల్డర్లు తమకు బదలాయించడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో మార్పులు చేయవలసి వచ్చిందని కేంద్ర మంత్రి జైట్లీ తెలిపారు.

స్థిరాస్తి రంగంలో నగదు లావాదేవీలకు అడ్డుకట్టవేయడానికి, సరఫరాదార్లలో జవాబుదారీతనం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు జైట్లీ తెలిపారు. అందువల్ల బిల్డర్లు పెద్ద మొత్తంలో భవన నిర్మాణ సామగ్రిని రిజిస్టర్డు అయిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మొత్తం 80 శాతం సరకులను రిజిస్టర్డు డీలర్ల వద్దే కొనుగోలు చేసేలా మంత్రుల బృందం ప్రతిపాదించిందని తెలిపారు. దీనిపై చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా అభ్యంతరం తెలిపారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ రంగానికి ఇది మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతుందని చెప్పారు. తనిఖీల పేరుతో అధికారుల వేధింపులు మళ్లీ మొదలవుతాయని, హవాలా మార్గంలో నగదు సరఫరా చేశారంటూ బిల్డర్లను ప్రశ్నించడం ప్రారంభమవుతుందని అన్నారు.

ఈ నిర్ణ‌యంతో గృహ కొనుగోలు పెర‌గ‌డంలో పాటు ఉద్యోగాలు పెరుగుతాయ‌ని లాబీ గ్రూప్ క‌న్‌ఫిడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ, సిటింగ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ చంద్రాజిత్ బెన‌ర్జీ తెలిపారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly