రికార్డు స్థాయిలో వ‌సూలైన జీఎస్‌టీ ప‌న్ను

2018 మార్చితో పోలిస్తే, 2019 మార్చిలో 15.6 శాతం జీఎస్‌టీ ప‌న్ను వ‌సూళ్ళు పెరిగిన‌ట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది

రికార్డు స్థాయిలో వ‌సూలైన జీఎస్‌టీ ప‌న్ను

గ‌త సంవ‌త్స‌రం మార్చి నెల‌తో పోలిస్తే, ఈ సంవ‌త్స‌రం మార్చి నెల‌లో రూ.1.06 లక్ష‌ల‌ కోట్ల వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) వ‌సూలైంది. 2017లో జీఎస్‌టీ ప్రారంభ‌మైన నాటి నుంచి ఈ మేర రెవెన్యూ రావ‌డం ఇదే ప్ర‌థ‌మం. మార్చి 2018 లో రూ. 91,167 కోట్లుగా ఉన్న జీఎస్‌టీ రెవెన్యూ 2019 మార్చిలో 15.6 శాతం పెరిగింది. మార్చిలో స‌మీక‌రించిన రూ.1,06,577 కోట్ల‌లో సీజీఎస్‌టీ(కేంద్ర వ‌స్తు సేవ‌ల ప‌న్ను) రూ. 20,533 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ (రాష్ట్ర వ‌స్తు సేవ‌ల ప‌న్ను) రూ. 27,520 కోట్లు, ఐజీఎస్‌టీ(ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ) రూ. 50,148 కోట్లు(దిగుమ‌తుల‌పై వ‌సూలు చేసిన రూ. 23,521 కోట్ల‌తో స‌హా) సెస్ రూ.8,286 కోట్లు(దిగుమ‌తుల‌పై స‌మీక‌రించిన రూ.891 కోట్ల‌తో స‌హా) ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రిత్వ శాఖ తెలిపింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రం ఆగ‌ష్టు-మార్చి నెల‌ల‌ స‌గ‌టు నెల‌వారీ జీఎస్‌టీ రూ.89,885 కోట్లు కాగా 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్‌-మార్చి నెల‌ల స‌గ‌టు నెల‌వారీ జీఎస్‌టీ రూ.98,114 కోట్ల‌కు పెరిగింది. జీఎస్‌టీ మండ‌లి ప‌న్ను త‌గ్గించిన‌ప్ప‌టికీ గ‌త కొద్ది నెల‌లుగా రెవెన్యూ వృద్ధి చెందుతూ వ‌స్తుంద‌ని ఆర్థిక మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి నెల‌వారీ స‌గ‌టు జీఎస్‌టీ ఆదాయం రూ. 98,114 కోట్లు అయితే ఇది 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రానికంటే 9.2 శాతం ఎక్కువ‌. దీని ప్ర‌కారం చూస్తే ఇటీవ‌లి కాలంలో రెవెన్యూ వృద్ధి రేటు గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని తెలుస్తుంది. 2018-19 సంవ‌త్స‌రానికి స‌మీక‌రించిన మొత్తం జీఎస్‌టీ ప‌న్ను రూ.11.77 ల‌క్ష‌ల కోట్లు.

2019 సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి నుంచి మార్చి 31 వ‌ర‌కు ఫైలైన జీఎస్‌టీఆర్ 3బీ రిట‌ర్నులు మొత్తం 75.95 ల‌క్ష‌లు. అంత‌కు ముందు నెల‌లో ఫైలైన్ రిట‌ర్నులు 73.48 ల‌క్ష‌లు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly