ఇక‌పై గూగుల్‌పే లో బంగారం కూడా కొనొచ్చు

గూగుల్‌ పే యాప్‌లో కనిపించే తాజా ధరలకు అనుగుణంగా బంగారాన్ని ఏ సమయంలో అయినా కొనుగోలు లేదా అమ్మకం చేసే వీలుంటుంది

ఇక‌పై గూగుల్‌పే లో బంగారం కూడా కొనొచ్చు

స్మార్ట్‌ఫోన్ ఉన్న‌వారు దాదాపుగా గూగుల్‌పే ఉప‌యోగిస్తున్నారు. ఈ యాప్‌తో క్ష‌ణాల్లో సుల‌భంగా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేందుకు వీలుండ‌టంతో దీనికి అల‌వాటుప‌డ్డారు. అయితే ఇప్పుడు అంతే సుల‌భంగా గూగుల్ పే తో బంగారం కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. విక్ర‌యించ‌వ‌చ్చు. ఇందుకోసం ఎంఎంటీసీ-పాంప్‌ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు గూగుల్ తెలిపింది. పేటీఎం, మొబిక్విక్, ఫోన్‌పే వంటి యాప్స్ ఇప్పటికే ఈ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గూగుల్ పే కూడా ఈ స‌దుపాయాన్ని ప్రారంభించింది.

గూగుల్ పే యూజర్లు 99.99 శాతం 24 క్యారెట్ బంగారాన్ని ఎప్పుడైనా, ఎంతమొత్తంలోనైనా కొనుగోలు చేసి స్టోర్ చేసుకోవ‌చ్చు. బంగారం భారతీయుల సంస్కృతి, సాంప్రదాయంలో ముఖ్యమైందని గూగుల్‌ పే ఇండియా డైరెక్టర్‌ (ప్రొడక్ట్‌ మేనేజర్‌) అంబరీష్‌ కెంఘే తెలిపారు. అందుకే బంగారం వినియోగంలో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. అక్షయ తృతీయ, ధంతేరస్‌ లేదా దీపావళి వంటి పర్వదినాల్లో భారతీయులు అధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారని పేర్కొన్నారు.

అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేకుండా గూగుల్‌ పే ఆర్థిక లావాదేవీలు అమలు చేస్తోందని దిల్లీ హైకోర్టు ఇటీవ‌ల ప్ర‌శ్నించింది. ఈ నేపథ్యంలో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా చెల్లింపులు జరిపేందుకు తమ భాగస్వామ్య బ్యాంకులకు సాంకేతిక సేవలు అందిస్తున్నామని గూగుల్‌ పే ప్రతినిధి వెల్లడించారు. చెల్లింపు ప్రక్రియలో కానీ, పరిష్కారంలో కానీ తమ పాత్ర ఉండబోదన్నారు. వీటికోసం ప్రత్యేకంగా ఆర్‌బీఐ వద్ద అనుమతులు పొందాల్సిన అవసరం లేదని వివరించారు. డేటాను స్థానికంగానే ఉంచాలన్న ప్రభుత్వ ఆదేశాలు పాటించే క్రమంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly