గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గురించి పూర్తిగా తెలుసుకోండి!

ఉద్యోగుల కోసం రూపొందించింన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ గురించి తెలుసుకుందాం

గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గురించి పూర్తిగా తెలుసుకోండి!

కొంత మంది వ్యక్తులకు కలిపి ఒకే పాలసీ కింద ఆరోగ్య బీమా కల్పించడమే దీని ముఖ్యోద్దేశం. ఇవి సాధారణంగా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కోసం లేదా కొన్ని సంస్థలు, క్లబ్బులు, అసోసియేషన్లలోని సభ్యుల కోసం రూపొందించింది.

గ్రూప్ ఆరోగ్య పాలసీలోని ప్రత్యేకతలు:

 • ఎక్కువ మందికి కలిపి పాలసీ తీసుకుంటారు కాబట్టి వ్యక్తిగతంగా తీసుకునే పాలసీల కంటే గ్రూప్‌ పాలసీలో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.

 • ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ పరీక్షల్లో ఆరోగ్య సమస్యలున్నట్టు తేలితే జటిలమైన వ్యవహారంగా భావించి బీమా కంపెనీలు పాలసీ నిరాకరించే అవకాశం ఉంది. అదే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌లో అయితే తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు నిబంధనలు ఉండవు.

 • ముందే ఉన్న అనారోగ్య సమస్యలకు (ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీసెస్‌) సాధారణంగా వెయిటింగ్‌ పీరియడ్‌ రెండేళ్లు ఉంటుంది. అదే గ్రూప్‌ పాలసీల్లో వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండదు.

 • గ్రూప్‌ పాలసీ తీసుకున్న వెంటనే ప్రసూతికి బీమా వర్తిస్తుంది. ఇది మహిళలకు ఎంతో ఉపయోగకర అంశం. అదే సాధారణ ఆరోగ్య పాలసీలకు కనీసం ఏడాది నుంచి రెండేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది.

 • ఈ గ్రూప్‌ పాలసీలోని ప్రత్యేక సదుపాయాలు గ్రూప్‌ అధినేత లేదా సంస్థ యాజమాని, ఎంచుకున్న పాలసీని బట్టి మారుతుంటాయి.

పాలసీలో వర్తించే అంశాలు:

 • గ్రూప్‌ హెల్త్‌ పాలసీలో ఆసుపత్రిలో చేరిన తర్వాత అయ్యే వైద్యఖర్చులకు, డాక్టర్‌ ఫీజుకు, అంబులెన్స్‌కు, డయాగ్నోస్టిక్‌, నర్సింగ్‌ ఛార్జీలకు, ఆసుపత్రి గది అద్దె, మందులకు, అనస్థీషియా, శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చులను చెల్లిస్తారు.
 • తీవ్ర అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత ప్రమాదాల వంటివాటికి కాస్త అధిక ప్రీమియం చెల్లించి బీమా తీసుకోవచ్చు.
 • ఈ పాలసీల ద్వారా సంస్థల్లోని ఉద్యోగులకు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులకు కలిపి యాజమాన్యాలు బీమా కల్పిస్తాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

 • సాధారణంగా ఉద్యోగులు గ్రూప్‌ హెల్త్‌ పాలసీ ఉందని భరోసాగా ఉంటారు. కానీ ఈ పాలసీ ఎంత మొత్తానికి ఉంది, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అది సరిపోతుందా అనే విషయాన్ని చూసుకోవాలి. కుటుంబం మొత్తానికి కలిపి పాలసీ తీసుకున్నట్టయితే కుటుంబమంతటికీ అవసరమైన ఆరోగ్య సమస్యల ఖర్చులకు సరిపోతుందా అనే విషయాన్ని గమనించాలి.

 • ఈ పాలసీ తీసుకున్నప్పుడు ముఖ్యమైన మినహాయింపులు ఏమున్నాయి, ఏయే అనారోగ్యాలకు బీమా కల్పిస్తారు అనే విషయాన్ని తెలుసుకొని ఉండడం మంచిది.

 • ఉద్యోగులకు వర్తింపజేసే పాలసీలు ఆ ఉద్యోగంలో కొనసాగేంత వరకే బీమా వర్తిస్తుంది. ఒక వేళ ఆ సంస్థ నుంచి వైదొలిగితే ఉద్యోగికి, అతడి కుటుంసభ్యులకు వర్తించకపోవచ్చు. సంస్థలో చేరినప్పటి కంటే వైదొలిగేటప్పుడు ఉద్యోగి వయసు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విడిగా తనకు, కుటుంబానికి కలిపి ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారవచ్చు.

 • సాధారణంగా ఈ గ్రూప్‌ పాలసీలు కాస్త తక్కువ పరిమితికే ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు లేదా అనారోగ్యంతో బాధపడే పెద్దవాళ్లు ఎవరైనా ఉన్నట్టయితే పాలసీ పరిమితి సరిపోకపోవచ్చు.

 • పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నప్పటికీ కుటుంబమంతటికీ ఆరోగ్య బీమా కల్పించే విధంగా ఒక సమగ్ర ఆరోగ్య బీమా పొంది ఉండడం ఎంతో అవసరం.

 • పాలసీకి కట్టిన ప్రీమియం సెక్షన్‌ 80డి పరిమితులకు పన్ను మినహాయింపు ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly