హాల్‌మార్కింగ్ ఆభ‌ర‌ణాల‌నే విక్ర‌యించాలి..

వినియోగ‌దారులు మోస‌పోకుండా ఆభ‌ర‌ణాల స్వ‌చ్ఛ‌త‌ను క్యారెట్ల రూపంలో హాల్‌మార్కింగ్ తెలియ‌జేస్తుంది

హాల్‌మార్కింగ్ ఆభ‌ర‌ణాల‌నే విక్ర‌యించాలి..

బంగారు ఆభ‌ర‌ణాల హాల్‌మార్కింగ్ ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఆభ‌రణాల వ‌ర్త‌కులు, త‌మ‌ను బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్‌(బీఐఎస్‌) వ‌ద్ద రిజిస్ట‌ర్ చేసుకునేందుకు, త‌మ వ‌ద్ద ఉన్న పాత స్టాక్‌ను క్లియ‌ర్ చేసుకునేందుకు ఏడాది పాటు గ‌డువు ఇచ్చింది. జ‌న‌వ‌రి15, 2021 నుంచి ఆభ‌ర‌ణాల‌ హాల్‌మార్కింగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. “న‌గ‌లు కొనుగోలు చేసేప్పుడు వినియోగ‌దారులు మోసపోకుండా, స్వ‌ఛ్చ‌త‌ను గుర్తించేందుకు వీలుగా బంగారు ఆభ‌ర‌ణాలు, క‌ళాఖండాల‌పై హాల్ మార్కింగ్ చిహ్నాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తున్నాము.” అని కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల‌, ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ అన్నారు.

హాల్‌మార్కింగ్ ఆభ‌ర‌ణాల గురించి తెలుసుకోవల్సిన అంశాలు:

  1. మీరు కొనుగోలు చేసే బంగారం స్వ‌చ్ఛ‌త‌ను హాల్‌మార్కింగ్ తెలియ‌జేస్తుంది.
  2. విక్రేత‌లు 14,18,22 కేరెట్ల విభాగాల‌లో మాత్ర‌మే హాల్‌మార్కింగ్ వేయించాలి.
  3. ప్ర‌స్తుతం మార్కెట్లో 10 గ్రేడ్‌ల‌లో బంగారు ఆభ‌ర‌ణాలు అందుబాటులో ఉన్నాయి.
  4. త‌క్కువ స్వ‌చ్చ‌త ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల నుంచి కొనుగోలు దారుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు 3 గ్రేడుల‌లో మాత్ర‌మే హాల్‌మార్కింగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు.
  5. వినియోగ‌దారులు మోస‌పోకుండా ఆభ‌ర‌ణాల క్యారెట్‌ను హాల్‌మార్కింగ్ తెలియ‌జేస్తుంది.
  6. 14, 18 మరియు 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఆభరణాలు లేదా కళాఖండాలు బీఐఎస్ హాల్‌మార్క్ లేకుండా విక్రయిస్తే, జ‌రిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష కూడా ప‌డుతుంది.
  7. హాల్‌మార్కింగ్ బంగారు న‌గ‌లపై నాలుగు గుర్తులుంటాయి. 1.బీఐఎస్‌ చిహ్నం, 2.క్యారెట్లలో బంగారం స్వచ్ఛత, 3.పరీక్ష కేంద్రం పేరు, 4. ఆభరణ వర్తకుడి గుర్తింపు
  8. ఆభ‌ర‌ణాలు విక్రేత‌ల‌కు, వినియోగదారుల‌కు హాల్‌మార్కింగ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దేశ‌వ్యాప్తంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.
  9. 2000 ఏప్రిల్‌ నుంచే బీఐఎస్‌ హాల్‌మార్కింగ్‌ స్కీమ్‌ను అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 40 శాతం మంది నగల వర్తకులు స్వచ్ఛందంగా హాల్‌మార్కింగ్ ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల‌ను విక్రయిస్తున్నారు.
  10. డిసెంబ‌రు 31,2019 నాటికి దేశ‌వ్యాప్తంగా 234 జిల్లాలలో 892 హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. 28,849 బంగారు ఆభ‌ర‌ణాల విక్రేత‌లు బీఐఎస్ వ‌ద్ద రిజిస్ట‌ర్ చేసుకున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly