ఆరోగ్య బీమా... ఎంచుకునే వ్యూహాలు!

అనుకోకుండా ఏర్ప‌డే అస్వ‌స్థ‌త‌కు అయ్యే ఖ‌ర్చుల‌కు ఆరోగ్య బీమా హామీ ఇవ్వ‌గ‌ల‌దు. అయితే అన్ని వైద్య బిల్లుల‌ను పాల‌సీ చెల్లించ‌దు. అద‌నంగా ఏర్ప‌డే ఖ‌ర్చుల కోసం ఎలాంటి వ్యూహాన్ని ర‌చించుకోవాలి.

ఆరోగ్య బీమా... ఎంచుకునే వ్యూహాలు!

దీర్ఘ‌కాలంలో మ‌దుపు చేసేట‌ప్పుడు… ద్ర‌వ్యోల్బ‌ణాన్ని దృష్టిలో ఉంచుకొని రాబ‌డులు వ‌చ్చేలా జాగ్ర‌త్త తీసుకోవాలి. ఆరోగ్య బీమా కొనుగోలు ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావానికి అతీత‌మేమీ కాదు. గ‌త కొంత‌కాలంగా రెండంకెల్లో వైద్య ఖ‌ర్చులు పెరుగుతూ ఉండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. అందుకు త‌గ్గ‌ట్టే ఆరోగ్య బీమా క‌వ‌రేజీ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. వైద్య ఖ‌ర్చుల ద్ర‌వ్యోల్బ‌ణం ఏటా 15-17శాతం మ‌ధ్య‌లో ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌భుత్వ‌మే చొర‌వ తీసుకొని వైద్యప‌ర‌మైన మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌నిదే సామాన్యుల‌కు వైద్యం భార‌మే అవుతుంది.

ఆరోగ్య సంర‌క్ష‌ణ ఖ‌రీదు

ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం ఎంత ఖ‌రీదుగా ఉంది…? మెట్రో న‌గ‌రంలోని ఏదైనా కార్పొరేట్ ఆసుప‌త్రిలో కార్డియో ఆప‌రేష‌న్ కు అయ్యే ఖ‌ర్చు రూ.3ల‌క్ష‌ల పైమాటే. డెంగ్యూ వ‌చ్చినా అదే పూర్తిగా న‌య‌మయ్యైందుకు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర రూ.90వేలు వ‌దిలించుకోవాల్సిందే. భ‌విష్య‌త్‌లో ఈ ఖ‌ర్చులు మ‌రింత పెర‌గినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

సంస్థలు త‌మ ఉద్యోగుల‌కు ఆరోగ్య బీమా క‌ల్పించినా… ప్ర‌త్యేకంగా ఓ ఆరోగ్య పాల‌సీ తీసుకోమ‌ని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తుంటారు. ఆరోగ్య బీమా ఉన్నంత మాత్రాన వైద్యప‌ర‌మైన అన్ని ఖ‌ర్చులు దీంతో తీర్చుకోగ‌ల‌మా? అంటే కాద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు వ్యూహాలేమైనా ఉన్నాయోమో ఇప్పుడు తెలుసుకుందాం…

ఆరోగ్య బీమా ఆవ‌శ్య‌క‌త‌

మ‌న చేతిలోంచి ఆసుప‌త్రి బిల్లు చెల్లించ‌న‌వ‌స‌రం లేకుండా ఉండేందుకే క‌దా ఆరోగ్య బీమా తీసుకునేది. అయితే ఆరోగ్య పాల‌సీలో ఆసుప‌త్రి సంబంధిత ఖ‌ర్చులు… గ‌ది అద్దె, స‌ర్జ‌రీకి, న‌ర్సింగ్ ఖ‌ర్చులు, డాక్ట‌ర్ ఫీజు, మందుల ఖ‌ర్చులు, డ‌య‌గ్నోస్టిక్ టెస్టులు లాంటివి క‌వ‌ర్ అవుతాయి. ఆరోగ్య పాల‌సీని జీవితాంతం వ‌ర‌కూ పున‌రుద్ధ‌రించుకుంటూ ఉండ‌వ‌చ్చు. ఏటా ప్రీమియం చెల్లిస్తే చాలు, ఆ ఏడాదికి బీమా ప‌రిధిలో ఉన్న‌ట్టే. వ‌య‌సు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన ప్రీమియం కూడా పెరుగుతూ వ‌స్తుంది. కొంద‌రు జీవితాంతం ప్రీమియం చెల్లించినా… ఒక్క‌సారి కూడా ఆరోగ్య బీమా క్లెయిం చేసుకొని ఉండ‌రు. మ‌రి కొంద‌రు చెల్లించిన ప్రీమియం కంటే… క్లెయిం చేసుకున్న ప‌రిహారం త‌క్కువ‌గా ఉంద‌ని గుర్తిస్తారు. అలా అని… ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోకుండా ఉండ‌లేం క‌దా! ఆరోగ్య ప‌రంగా ఎప్పుడు ఏ ఆప‌ద వ‌స్తుందో ఊహించ‌డం క‌ష్టం కాబ‌ట్టి మ‌న‌కంటూ ఓ పాల‌సీ ఉండ‌డం మేలు.

మెడిక్లెయింలో క‌వ‌ర్ కానిదేది?

  • ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు అయ్యే ప్ర‌తి రూపాయి ఖ‌ర్చునీ బీమా పాల‌సీతో తీర్చుకోగ‌ల‌మా… అంటే కాద‌నే చెప్ప‌వ‌చ్చు. అవుట్ పేషెంట్ సేవ‌ల‌కు, సౌంద‌ర్య సంర‌క్ష‌ణకు, దంత వైద్యానికి ఆరోగ్య బీమా వ‌ర్తించ‌దు. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితేనే ఇలాంటి వాటికి బీమా వ‌ర్తింప‌జేసేలా ఆరోగ్య పాల‌సీల్లో నిబంధ‌న‌లున్నాయి.
    ఆసుప‌త్రిలో చేరిన వారికి కూడా అన్నీ క‌వ‌రేజీలోకి రావు.

  • దాదాపు 200 వ‌స్తువులు బీమా క‌వ‌రేజీ కిందికి రాకుండా దాదాపు అన్ని పాల‌సీల్లో నిబంధ‌న‌ల పోట్లు పొడిచారు. టాయిలెట్‌రీలు, కాస్మొటిక్స్‌, క‌ళ్ల‌ద్దాలు, కాంటాక్ట్ లెన్సులు, విజిట‌ర్ పాస్‌లు, డిశ్ఛార్జి ఖ‌ర్చులు… లాంటివేవీ ఆరోగ్య పాల‌సీ కిందికి రావు. ఇవ‌న్నీ క‌లిపి ఆరోగ్య ఖ‌ర్చు మొత్తంలో 10శాతంగా అవుతాయి. ఇంకా ఎక్కువే అవ్వొచ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

  • ఆరోగ్య పాల‌సీ జేబుకు చిల్లు ప‌డ‌కుండా కాపాడ‌గ‌ల‌దు. అయితే ప‌ర్సులోంచి న‌యా పైసా తీయ‌కుండా మాత్రం వైద్యం పూర్తి కాదు అని ఆర్థిక నిపుణులు చ‌మ‌త్క‌రిస్తుంటారు.*

  • క్యాన్స‌ర్ విష‌యాన్నే తీసుకుంటే… రోగిని డిశ్ఛార్జి చేశాక కూడా నెల‌ల త‌ర‌బ‌డి మందులు తీసుకుంటూ ఉండాలి. ఈ ఖ‌ర్చులను కొంత మేర పాల‌సీ భ‌రించినా… కో-పేలు, మిన‌హాయింపుల‌తో కొంత ఖ‌ర్చుల భారాన్ని పాల‌సీదారే మోయ‌క త‌ప్ప‌దు.

ఆరోగ్య పాల‌సీ నిర్వ‌హ‌ణ‌

అస‌లు ఆరోగ్య బీమా తీసుకోవాలా?.. ఒక వేళ తీసుకుంటే ఎంత మొత్తానికి తీసుకోవాలి.? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలంటే… అనుకోకుండా ఏర్ప‌డే అనారోగ్యాల‌కు …ఆర్థికంగా కాపాడేందుకు ఆరోగ్య బీమా కొండంత ర‌క్ష‌ణ‌గా ఉంటుంది. అయితే కేవ‌లం ఆరోగ్య బీమా పైనే ఆధార‌ప‌డ‌కుండా కొంత మొత్తాన్ని వైద్య‌ప‌ర‌మైన అత్య‌వ‌స‌ర నిధిగా ఏర్పాటు చేసుకోవ‌డం మంచిది.

స‌రాస‌రిగా చూస్తే… క్లెయిం చేసుకునే దానికన్నా చెల్లించే ప్రీమియంలే అధికంగా ఉంటాయి. అయితే, కొంద‌రికి మాత్రం ఆసుప‌త్రి ఖ‌ర్చులు విప‌రీతంగా ఉండి, పూర్తి బీమా ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు. ఈ విష‌యంతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు అనుకూల‌మైన ధ‌ర‌లో ఓ పాల‌సీ అంటూ కొనుగోలు చేయడం మంచిది.

ఫ్లోట‌ర్‌, టాప్ అప్‌లు జ‌త‌చేసుకోండి

  • ధ‌ర‌కు త‌గ్గ ఫ‌లితం అందుకునేలా ఆరోగ్య పాల‌సీని కొనుగోలు చేయాలంటే మాత్రం … వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమాను ఫ్లోట‌ర్ పాల‌సీతో, టాప్ అప్ ప్లాన్‌ల‌తో క‌లిపి కొనుగోలు చేయ‌డం మంచిది. ఫ్లోట‌ర్ పాల‌సీతో కుటుంబమంత‌టికీ త‌క్కువ ధ‌ర‌లోనే ర‌క్ష‌ణ క‌ల్పించ‌వ‌చ్చు. ఇక టాప్ ప్లాన్స్ ప్ర‌స్తుతం పనిచేస్తున్న పాల‌సీలు అందించే ప‌రిహారంపైన అద‌నంగా చెల్లిస్తాయి.

  • సాధార‌ణ ఆరోగ్య పాల‌సీతో పాటు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని ప‌రిశీలించ‌వ‌చ్చు. తీవ్ర అనారోగ్యం ఏర్ప‌డిన‌ప్పుడు ఇది అధిక ఖ‌ర్చుల నుంచి కాపాడుతుంది.
    కొన్ని బీమా సంస్థ‌లు హై బీపీ ఉన్న‌వారికి పాల‌సీ కొనుగోలుకు నిరాక‌రిస్తున్నాయి. అందుకే చిన్న వ‌య‌సులోనే ఆరోగ్య బీమా కొనుగోలు చేయ‌డం శ్రేయ‌స్క‌రం.

ఆరోగ్య బీమా అవ‌స‌రం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీంతోపాటు అద‌నంగా కొంత అత్య‌వ‌స‌ర నిధిగా ఏర్పాటు చేసుకుంటే… అద‌న‌పు ఖ‌ర్చుల భారాన్ని చాక‌చ‌క్యంగా త‌గ్గించుకోగ‌లం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly