కారు కొనుగోలు అవసరమా..?

చాలా మంది కొత్త కారుని కొని, కొన్నాళ్ళు వాడిన తరువాత తమకు అంత అవసరం గానీ, స్థోమత గానీ లేదని తెలుసుకుంటారు

కారు కొనుగోలు అవసరమా..?

పెరుగుతున్న ఆదాయం, అవసరాలు, జీవన ప్రమాణాలు మనిషిని నిరంతరం ప‌నిచేసేలా చేస్తున్నాయి. దాని నుంచి విశ్రాంతి కోసం సుఖ, సౌకర్యాలు పొందడానికి అనేక ఇతర వస్తు సాధనాలను కూడా సమకూర్చుకుంటున్నాడు . అందులో ఒకటి కారు . తనకుగాని, కుటుంబ అవసరాలకు , సమాజంలో విలువ పెంచోకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. కంపెనీలు కొత్త కొత్త మోడల్స్, సౌకర్యాలతో, అందమైన డిజైన్ లలో కార్లను ప్రవేశపెడుతున్నాయి.
దానికి తోడు కంపెనీలు, షోరూమ్ వారు అనేక అదనపు సౌకర్యాలు, డిస్కౌంట్స్ , తగ్గింపులు , తక్కువ నెలసరి చెల్లింపులు, ఉచిత వాహన బీమా వంటివి ఇస్తుండడంతో
చాలామంది వీటికి మొగ్గు చూపుతున్నారు.

అయితే, ముఖ్యంగా గమనించాల్సిన విషయం అందరికీ సొంత కారును కలిగిఉండే అవసరం, అవకాశం ఉండదు. అయినా చాలా మంది మొదట్లో తెలియక కొత్త కారుని కొని, కొన్నాళ్ళు వాడిన తరువాత తెలుసుకునేది ఏమిటంటే , తమకు అంత అవసరం గానీ, స్థోమత గానీ లేదని. దీంతో ఆ కారుని తిరిగి ఇవ్వడం వలన చాలా నష్టపోతారు.

అందువలన కారు కొనుగోలు చేసే ముందు, దానికి బదులు రవాణా కోసం ఎటువంటి ఇతర సదుపాయాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదా : మెట్రో, ఓలా , ఊబర్ వంటి నెట్వర్క్ లను, అలాగే మనకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు నడిపే రవాణా సౌకర్యాలను పరిశీలించవచ్చు.

అదీగాక, సొంత కార్లు ఎక్కువ సమయం వాడకంలేక నిరుపయోగంగా ఉంటాయి. దానికితోడు ఇంట, బయట పార్కింగ్ ఒక సమస్య. నగర ట్రాఫిక్ లో గంటల కొద్దీ రద్దీ వలన పెట్రోల్/ డీజిల్ ఖర్చుతోపాటు , విసుగు కలిగిస్తుంది. ఇది మన పని మీద తప్పక ప్రభావం చూపుతుంది.

ఉదా : రాఘవ ఒక రూ 5 లక్షల విలువ చేసే కారును కొనాలనుకున్నాడు . ఐదు ఏళ్ళు నెలకు రూ 8 వేలు ఈ ఎం ఐ చెల్లించాలి. ఐదు ఏళ్ల తరువాత దీని విలువ రూ 1 లక్ష ఉంటుందని అంచనా. అతని వాడకానికి ఇంధనం, మరమ్మతులు, పార్కింగ్, మొదలు ఖర్చులకు నెలకు రూ 5 వేల వరకు అవుతుందని అంచనా. అంటే నెలకు రూ 13 వేలు. ( రూ 8 వేలు ఈ ఎం ఐ + రూ 5 వేలు నెలవారీ ఖర్చులు ).
CAR-EXPENSE.png

పైన తెలిపిన ఇతర రవాణా సౌకర్యాలను వినియోగించుకోవడం ద్వారా సగటున నెలకు రూ. 6 వేలు ఖర్చుచేసినా , మిగిలిన రూ. 7 వేలను బ్యాంకు రికరింగ్ డిపాజిట్ చేయడం ద్వారా 7 శాతం వార్షిక వడ్డీతో ఐదు ఏళ్ల తరువాత రూ. 5 లక్షలను పొందొచ్చు.

ముగింపు :
చాలా మంది యువత అధిక ఆదాయం చూసుకుని, అవగాహన లేకుండా ఖర్చు చేస్తుంటారు. అందులో కారు కొనుగోలు ఒకటి. భవిష్యత్ లో ఆదాయం, ఖర్చులు, అవసరాలు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు. కాబట్టి అనవసరపు ఖర్చులను నియంత్రణలో ఉంచుకుని , యుక్త వయసులో అధిక మొత్తంలో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి జీవన ప్రమాణాలను పాటించవచ్చు. భవిష్యత్తులో ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అందువలన పొదుపు శాతం తగ్గుతుంది. పిల్లల చదువులు, పదవీవిరమణ అనంతర జీవితానికి తగిన ఆదాయం, ఆరోగ్య పరిరక్షణ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని అధిక మొత్తంలో మదుపు చేయడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly