పదవీ విరమణ నిధి ఎలా?

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంతరం అవ‌స‌ర‌మ‌య్యే ఖ‌ర్చుల‌కు ప్ర‌ణాళిక వేసుకోవ‌డం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవ‌చ్చు

పదవీ విరమణ నిధి ఎలా?

పదవీ విరమణ నిధిని సమకూర్చుకునేందుకు వివిధ మార్గాలను అనుసరించవచ్చు.

  1. పీ ఎఫ్ / వి పీ ఎఫ్
  2. పీ పీ ఎఫ్ ఖాతా
  3. నేషనల్ పెన్షన్ సిస్టమ్
  4. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
  5. పెన్షన్ పధకాలు

సుధ, సుధాకర్ భార్య‌భ‌ర్త‌లు. సుధాకర్ వ‌య‌సు 30 ఏళ్ళు . వారికి రెండేళ్ల బాబు ఉన్నాడు. సుధాకర్ నెల జీతం రూ 35 వేలు. ప్రస్తుత నెల ఖర్చులు రూ 15 వేలు. సుధాకర్ తన 60వ ఏట పదవీ విరమణ తీసుకోదలచాడు. వారివురి జీవించే కాలం 80 ఏళ్ళు అనుకుంటే, పదవీ విరమణ తరువాత 20 సంవత్సరాలు జీవిస్తారు. పదవీ విరమణ అనంతర జీవితానికి కావలసిన ఆదాయానికి నిధిని ఏర్పాటు చేసుకోదలిచాడు. పదవీ విరమణ అనంతర కూడా ఇదే జీవన ప్రమాణాలను పాటిద్దామనుకుంటున్నారు. మొత్తం జీవిత కాలంలో ద్రవ్యోల్బణాన్ని 6 శాతం అంచనా వేయడమైనది . దీని ప్రకారం పదవీవిరమణ నాటికి వారి నెల ఖర్చులు రూ 86 వేలుగా(వార్షిక ఖర్చులు రూ 10.32 లక్షలు) ఉంటాయి. దీని ప్రకారం వారికి రూ 1 కోటి 75 లక్షల పదవీ విరమణ నిధి అవసరం. పదవీవిరమణ అనంతర కాలంలో నిధి ఫై రాబడి 8శాతం అంచనా వేయడమైనది.

పీ ఎఫ్ / వి పీ ఎఫ్(వేరియబుల్ ప్రావిడెంట్ ఫండ్) : ప్రతి నెలా జీతం నుండి జమ అవటం వలన , మనం ప్రత్యేకంగా ఈ ట్రాన్సక్షన్ చేయకుండానే పీ ఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. దీని వలన దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావం వలన అధిక నిధిని సమకూర్చుకోవచ్చు. మనం విడిగా మదుపు చేయాల్సివస్తే, ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు లేదా ఆ సొమ్ముని ఇతర పనులకు వినియోగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు చేస్తున్న ఈ పీ ఎఫ్ ఖాతాలోనే వి పీ ఎఫ్ (వేరియబుల్ ప్రావిడెంట్ ఫండ్) కింది మీ వాటాగా జమ చేయవచ్చు. ప్రస్తుతం నియమాల ప్రకారం రూ 15 వేలఫై 15.67 శాతం (12 శాతం తన వాటా + 3.67 యజమాని వాటా) కింద ప్రతి నెలా జమ అవుతుంది. ప్రభుత్వం ఈ పరిధిని ప్రతి ఐదు సంవత్సరాలకు పెంచుతుందని అంచనా వేయడమైనది. ఈ కింది పట్టిక జమ అయ్యే అంచనా మొత్తం చూపిస్తుంది.
PF contrb.jpg

తన పీ ఎఫ్ ఖాతా లో జమ అయ్యే మొత్తం ద్వారా రూ 66 లక్షలు లభిస్తుంది. మిగిలిన కోటి పది లక్షల రూపాయలను వి పీ ఎఫ్ (వేరియబుల్ ప్రావిడెంట్ ఫండ్) ద్వారా సమకూర్చుకోవాలనుకున్నాడు. దీని కోసం నెలకు రూ 4 వేలు (వార్షికంగా రూ 48 వేలు) తో మొదలు పెట్టి , వార్షిక వడ్డీ 8.50 శాతంగా, జీతంలో వార్షిక వృద్ధిని 5 శాతంగా అంచనా తో పదవీవిరమణ నాటికి మిగిలిన నిధిని సమకూర్చుకోవచ్చు. చాలా మంది స్వల్పకాల పనులకోసం పీ ఎఫ్ ఖాతా నుంచి సొమ్మును ఉపసంహరించుకొంటున్నారు. ఇది మంచి పధ్ధతి కాదు . సాధ్యమైనంతవరకు ఈ సొమ్మును పదవీవిరమణ అనంతర ఆదాయం కోసమే ఉపయోగించాలి.

పీ పీ ఎఫ్ ఖాతా:
ప్రావిడెంట్ ఫండ్ ద్వారా జమ అయ్యే రూ 66 లక్షలు కాక , మిగిలిన కోటి పది లక్షల రూపాయలను పీ పీ ఎఫ్ ఖాతా ద్వారా సమకూర్చుకోవచ్చు. దీనిలో రాబడి 8 శాతం వరకు ఉంటుందని అంచనా వేయడమైంది . మదుపు ఫై , వడ్డీ ఆదాయంపై, నగదు ఉపసంహరణపై పన్ను మినహాయింపులు ఉంటాయి. ఈ ఖాతాకు ఉన్న ప్రత్యేకతలవలన లాభపడవచ్చు. అయితే, పాక్షిక ఉపసంహరణ సదుపాయం వలన సొమ్మును ఇతర ఖర్చులకు వినియోగించే అవకాశం ఉంది. అలాకాక దీర్ఘకాలంలో మదుపు చేసినట్లయితే పన్ను మినహాయింపులతోపాటు , చక్రవడ్డీ ప్రభావంతో అధిక నిధిని జమ చేసికోవచ్చు. నెలకు రూ 4,400లతో మొదలుపెట్టి, ప్రతి సంవత్సరం ఐదు శాతం పెంచుకుంటూ జమ చేస్తే 30 సంవత్సరాల తరువాత కోటి పది లక్షల రూపాయలను పొందవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్:
దీనిలో 50% వరకు ఈక్విటీ లలో మదుపు చేసే అవకాశం ఉండటం వలన స్వల్ప కాలంలో ఒడిదుడుకులకు లోనైనా, దీర్ఘకాలంలో 10% వరకు రాబడి ఆశించవచ్చు. ఇది ఈ పీ ఎఫ్ కన్నా అధికం కాబట్టి దీర్ఘ కాలం లో అధిక నిధిని చేకూర్చుకోవచ్చు. ప్రస్తుత నియమ నిబంధలను ప్రకారం జమ అయిన నిధి నుంచి 60 శాతం వరకు ఎటువంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని కచ్చితంగా పెన్షన్ ఫండ్లలో మదుపు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా నెలనెలా ఆదాయం పొందవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ ద్వారా జమ అయ్యే రూ 66 లక్షలు కాక , మిగిలిన కోటి పది లక్షల రూపాయలను నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతా ద్వారా సమకూర్చుకోవచ్చు. దీని కోసం ప్రతి నెలా రూ 3,100తో (వార్షికంగా రూ 37,200) మదుపు మొదలుపెట్టి , ప్రతి సంవత్సరం ఐదు శాతం పెంచుకుంటూ వెళ్ళాలి . ముప్పై సంవత్సరాల తరువాత మిగిలిన రూ కోటి పది లక్షలను సమకూర్చుకోవచ్చు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్:
దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో, ఉదా : యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో మదుపు చేస్తే , 12 శాతం రాబడి అంచనాతో ఎక్కువ మొత్తంలో నిధిని సమకూర్చుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ ద్వారా జమ అయ్యే రూ 66 లక్షలు కాక, మిగిలిన కోటి పది లక్షల రూపాయలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సమకూర్చుకోవచ్చు. దీని కోసం ప్రతి నెలా రూ 2,100తో (వార్షికంగా రూ 25,200) మదుపు మొదలుపెట్టి, ప్రతి సంవత్సరం ఐదు శాతం పెంచుకుంటూ వెళ్ళాలి. ముప్పై సంవత్సరాల తరువాత మిగిలిన రూ కోటి పది లక్షలను సమకూర్చుకోవచ్చు.

బీమా కంపెనీలు అందించే పెన్షన్ పధకాలు:
ఈ పథకాలలో కచ్చితమైన ఆదాయం ఉంటుంది. అయితే , దీర్ఘకాలంలో మదుపు చేసినప్పటికీ , అధిక రాబడి ఉండదు. ఈ కంపెనీలు పెట్టుబడిని ప్రభుత్వ బాండ్లలో మదుపు చేస్తాయి కాబట్టి , ఖర్చులు పోను రాబడి కూడా 5.50శాతం వరకు ఉంటుంది. అయితే, ఒకసారి మదుపు చేస్తే , రద్దు చేసుకునే అవకాశం ఉండదు.

ముగింపు:
పైన గమనించినట్లయితే , రాబడి పెరుగుతున్నకొద్దీ , తక్కువ సొమ్ముతో మదుపు మొదలుపెట్టవచ్చు. ప్రతి సంవత్సరం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కాబట్టి మదుపు కూడా పెంచుకుంటూ ఉండాలి. దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో అధిక నిధిని సమకూర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయ వనరు, పెరుగుదల , ఖర్చులు, అవసరాలు, ఇతర ఆర్ధిక లక్ష్యాలు, కుటుంబ బాధ్యతలు, వేరు వేరుగా ఉంటాయి కాబట్టి, తగిన పద్దతిలో మదుపు చేయవచ్చు. అయితే, ఎట్టి పరిస్థితులలోను పదవీవిరమణ తరువాత జీవితాన్ని ఇతరులపై ఆధారపడే విధంగా చేసుకోకూడదు . దీనికి, ముందునుంచే ప్రణాళిక వేసుకుని మదుపు చేయాలి. ఒకే పధకంలో కాక రెండు లేదా మూడు పథకాలలో మదుపు చేయడం ద్వారా పోర్ట్ ఫోలియో ని బ్యాలన్స్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం పునఃసమీక్షించుకోవాలి . డబ్బులు ఎక్కువవుంటే మంచిదే కానీ, తక్కువయితేనే ఇబ్బంది. ప్రతి సంవత్సరం మదుపును పెంచుకుంటూ ఉండండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly