డెట్ ఫండ్లలో పెట్టుబ‌డి చేసేముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

డెట్ ఫండ్‌ను ఎన్నుకునే ముందు మ‌దుప‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఏవిధంగా నిర్వహిస్తున్నాయో చూడాలి.

డెట్ ఫండ్లలో పెట్టుబ‌డి చేసేముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

డెట్ మ్యూచువల్ ఫండ్లు ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, రేటెడ్ కంపెనీ బాండ్లు, స్వల్పకాలిక పత్రాల వంటి స్థిర ఆదాయ సాధనాలలో పెట్టుబడులు పెడతాయి. కాబట్టి డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు స్థిర‌మైన‌ రాబడితో పెట్టుబడుల సురక్షితమైన‌వి భావిస్తారు. అయితే ఐఎల్ & ఎఫ్ఎస్ డిఫాల్ట్, డిహెచ్ఎఫ్ఎల్ తాజా ప్రమాదంతో ప్రారంభమైన బాండ్ వైఫల్యాలు డెట్ ఫండ్ల నిర్వ‌హ‌ణ‌లో మ‌దుప‌ర్ల‌కు ఆందోళ‌న క‌లిగించాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

డెట్ ఫండ్లు అక్రూవల్ (సముపార్జన), డ్యూరేష‌న్ (కాల‌వ్యవధి) పథకాలుగా వర్గీకరించవచ్చు. అక్రూవల్ ఫండ్లు క్రెడిట్ డౌన్‌గ్రేడ్, డిఫాల్ట్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, డిహెచ్‌ఎఫ్ఎల్ బాండ్ల వైఫల్యాల సమయంలో ఇటీవల అయినట్లుగా, కాల‌వ్యవధి ఫండ్లు వడ్డీ రేటులో వ‌చ్చే నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి ఫండ్‌లు డిఫాల్ట్ రిస్క్‌ను ఎదుర్కోవని నిపుణులు చెబుతున్నారు.

సురక్షితమైన కేటగిరీగా భావించి పెట్టుబ‌డి చేసిన డ‌బ్బు ప్ర‌తికూల రాబడిని ఇస్తే, పెట్టుబడిదారుల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంది. అయితే, ఇటీవల కొన్ని డెట్ ఫండ్లు తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ, అధిక ద్రవ్యత, భద్రత, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ప్రయోజనాలు వంటి ప్రయోజనాలు ఉండ‌టం వ‌ల్ల ఇప్పటికీ స్థిరఆదాయ పెట్టుబ‌డి సాధ‌నాలు ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచాయి.

ఫండ్ నిర్వాహ‌కులు ఒకే కంపెనీకి చెందిన ఆస్తుల్లో పెట్టుబ‌డి చేయ‌డం, అటువంటి సంస్థల పేపర్‌లకు అధిక రేటింగ్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీలు బాండ్ వైఫల్యాలకు దారితీసి ఆ ప్ర‌భావం కాస్త డెట్ ఫండ్ వర్గంపై ప‌డ‌టం ద్వారా ఏర్ప‌డిన‌ గందరగోళానికి కారణమని చెప్పవచ్చు. డెట్ ఫండ్‌ను ఎన్నుకునే ముందు మ‌దుప‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఏవిధంగా నిర్వహిస్తున్నాయో చూడాలి.

డెట్ ఫండ్ పథకాన్ని ఎన్నుకునేటప్పుడు ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోవాలి

ఫండ్ నిర్వాహ‌కులు: డెట్ ఫండ్లు స్థిర రాబడి సాధనాలలో పెట్టుబడి పెడుతున్నందున అధిక రాబడిని అందించేందుకు అవ‌కాశం ఉండ‌దు. అయితే వాటిలో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. వాటిని న‌ష్ట‌పోకుండా చూసుకునే భాద్య‌త ఫండ్ నిర్వాహకుల ముఖ్యమైన పని. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ముందు డెట్ ఫండ్ల నిర్వహణలో ఫండ్ మేనేజర్ అనుభవాన్ని, ట్రాక్ రికార్డును తనిఖీ చేయాలి.

ఏఎమ్‌సీ వైఖ‌రి: కొంత‌ అదనపు రాబడితో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఏఎమ్‌సీలు, ఫండ్ నిర్వాహకులు అధిక న‌ష్ట‌భ‌యం సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం చేయోచ్చు. అయితే ఈ విధ‌మైన ధోర‌ణి వ‌ల్ల న‌ష్ట‌భ‌యం పెరుగుతుంది. ఇటీవలి బాండ్ వైఫల్యాల తర్వాత ఏఎమ్‌సీలు తీవ్రంగా దెబ్బతిన‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. కాబ‌ట్టి అధిక రిస్క్ తీసుకునే డెట్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. డెట్ ఫండ్ల నిర్వహణలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఏఎమ్‌సీ ల ద్వారా మాత్రమే పెట్టుబడిదారులు ఈ పథకాలను ఎన్నుకోవాలి.

ఫండ్ రకాలు: సెబీ డెట్ ఫండ్ల‌ను వాటి లక్షణాల ఆధారంగా 16 వర్గాలుగా విభజించింది. ప్రత్యేకంగా డెట్ ఫండ్లు పెట్టుబ‌డి చేసే సెక్యూరిటీల రకాల‌కు వర్తింపచేస్తుంది. డెట్ ఫండ్ల‌లో కాల‌వ్య‌వ‌ధితో పాటు న‌ష్ట‌భ‌యం పెరుగుతుంది. త‌క్కువ కాల‌వ్య‌వ‌ధి ఉండే లిక్విడ్ ఫండ్, అల్ట్రా స్వల్పకాలిక ఫండ్, స్వల్పకాలిక ఫండ్ మొదలైన ఫండ్లలో త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది.

పోర్ట్ఫోలియో: ఒక నిర్దిష్ట పథకంలో డబ్బు పెట్టడానికి ముందు, దాని పోర్ట్ ఫోలియోను చూడ‌టం మంచిది. ఒకే కంపెనీలేదా ఒకే గ్రూపుకు చెందిన వాటిలో ఎక్కువ‌శాతం పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌లో మ‌దుపు చేయోద్దు. ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడి పంపిణీ చేయ‌డం ద్వారా తక్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది.

రాబ‌డి: డెట్ ఫండ్లు స్థిరమైన ఆదాయం సెక్యూరిటీలలో పెట్టుబడి పెడ‌తాయి కాబ‌ట్టి అదే కేట‌గిరీకి చెందిన ఫండ్లలో రాబ‌డి ఏవిధంగా ఉందో పోల్చి చూసుకోవాలి. స‌గ‌టు రాబ‌డి కంటే బాగా త‌క్కువ‌గా ఉన్నా లేదా బాగా ఎక్కువ‌గా ఉన్నా ఒక‌సారి ఆ ఫండ్‌ను స‌మీక్షించుకోవాలి.

డెట్ ఫండ్ పెట్టుబడుల తీసుకునే ముందు కొంత ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. తగినంత అనుభవం లేదా పెట్టుబడి పెట్టేముందు విషయాలను అధ్యయనం చేయడానికి సమయం లేని మ‌దుప‌ర్లు ఆర్ధిక సలహాదారుల నుంచి సలహాలు తీసుకోవ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly