రెండు యూఏఎన్ నెంబ‌ర్లు ఉన్నాయా?

ఒకే ఈపీఎఫ్ చందాదారునికి చెందిన రెండు యూఏఎన్ నెంబ‌ర్ల‌ను ఏవిధంగా విలీనం చేయాలో తెల‌సుకుందాం.

రెండు యూఏఎన్ నెంబ‌ర్లు ఉన్నాయా?

ఒకే ఉద్యోగి లేదా ఈపీఎఫ్ స‌భ్యుడు రెండు యూఏఎన్ నెంబ‌ర్లు క‌లిగి ఉండ‌డం ఈపీఎఫ్ఓ నియ‌మ నిబంధ‌న‌లకు విరుద్ధం. ఒక ఉద్యోగికి ఒక యూఏఎన్ నెంబరు మాత్ర‌మే ఉండాలి. ఒకవేళ ఒక‌టి కంటే ఎక్కువ యూఏఎన్ నెంబ‌ర్లు ఉంటే ప్ర‌స్తుతం యాక్టీవ్‌లో ఉన్న కొత్త యూఏఎన్ నెంబ‌ర్ త‌ప్ప మిగిలిన వాటిని క్రియార‌హితం(డీ-యాక్టీవేట్) చేసుకోవాలి.

రెండ‌వ యూఏఎన్‌ ఉండేందుకు గ‌ల కార‌ణాలు ఏమిటి?

రెండు సంద‌ర్భాల‌లో ఇది సాధ్య‌ప‌డుతుంది. మొద‌టిది, ఒక సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగి ఈపీఎఫ్ఓకు కాంట్రీబ్యూట్ చేస్తూ యూఏఎన్ నెంబ‌రు క‌లిగి ఉంటే, అత‌ను ఆ సంస్థ‌ నుంచి మ‌రొక సంస్థ‌కు మారిన‌ప్పుడు, కొత్త య‌జ‌మానికి త‌న పాత కంపెనీ వారు కేటాయించిన‌ యూఏఎన్ నెంబ‌రును ఇవ్వాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఉద్యోగి కొత్త సంస్థ య‌జ‌మానికి యూఏఎన్ నెంబ‌రు ఇవ్వ‌న‌ట్ల‌యితే, కొత్త సంస్థ మ‌రొక యూఏఎన్‌ను కేటాయిస్తుంది. ఆ విధంగా ఒక ఉద్యోగికి రెండు యూఏఎన్ నెంబ‌ర్లు ఉండే అవ‌కాశం ఉంది.

మీరు ఒక సంస్థ నుంచి మ‌రొక సంస్థ‌కు మారిన‌ప్పుడు, మీ పాత కంపెనీ ఎల‌క్ట్రిక్ చ‌లానా కం రిట‌ర్న్‌(ఈసీఆర్‌) లో నిష్క్ర‌మ‌ణ తేది వివ‌రాల‌ను అందిచాలి. ఒకవేళ మీ పాత కంపెనీ ఈ స‌మాచారాన్ని, కొత్త కంపెనీలో చేరేలోపు ఇవ్వ‌క పోతే రెండవ యూఏఎన్‌ను కేటాయించే అవ‌కాశం ఉంటుంది.

అన్ని ఈపీఎఫ్ ఖాతాల‌ను ఒకే యూఏఎన్‌కు లింక్ చేయ‌డం ఎలా?

మొద‌టి ప‌ద్ధ‌తి:

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ద్వారా అందించిన వివ‌రాల ప్ర‌కారం, మీ పాత సంస్థ ఎల‌క్ట్రిక్ చ‌లానా కం రిట‌ర్న్‌(ఈసీర్) ఫైలింగ్‌లో నిష్క్ర‌మ‌ణ తేది ఫిల్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ రెండవ‌ యూఏఎన్ నెంబ‌ర్‌ను కేటాయిస్తే, మీ ప్ర‌స్తుత సంస్థ ద్వారా స‌ర్వీసు బ‌దిలీకి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఈ సంద‌ర్భంలో మీరు మీ సంస్థ‌కు గానీ, uanepf@epfindia.gov.in ఈమెయిల్ ద్వారా మీ ప్ర‌స్తుత, పాత యూఏఎన్ నెంబ‌ర్ల‌ను పంపించాల్సి ఉంటుంది. వెరిఫికేష‌న్ పూర్తైన త‌రువాత ప్ర‌స్తుత యూఏఎన్‌ను చ‌లామ‌ణిలో ఉంచి, పాత యూఏఎన్‌ను క్రియార‌హితం చేస్తారు. త‌రువాత మీ స‌ర్వీసు, అందులోని నిధుల‌ను ప్ర‌స్తుత యూఏఎన్ లింక్ అయిన ఈపీఎఫ్ ఖాతాకు బ‌దిలీ చేసేందుకు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. పైన వివ‌రించిన విధానం ద్వారా రెండు యూఏఎన్‌లు అనుసంధానించేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల ఈపీఎఫ్ఓ ఒక కొత్త ఆటోమేటిక్ ప‌ద్ద‌తి ద్వారా ఒక ఉద్యోగికి ఉన్న రెండు లేదా డూప్లికేట్ యూఏఎన్‌ల‌ను అనుసంధానిస్తుంది.

రెండ‌వ ప‌ద్ధ‌తి(ఆటోమేటిక్ విధానం):

  • ఈపీఎఫ్ సభ్యులు ముందుగా పాత ఈపీఎఫ్ ఖాతాను కొత్త ఖాతాకు బ‌దిలీ చేసేందుకు ద‌ర‌ఖాస్తు చేయాల్సిఉంటుంది.
  • ఒకే ఉద్యోగి చెందిన రెండు ఈపీఎఫ్ ఖాతాలు వేరు వేరు యూఏఎన్ నెంబ‌రుతో అనుసంధానం అయ్యి ఉంటే అటువంటి ఖాతాల‌ను ఈపీఎఫ్ఓ వ్య‌వ‌స్థ స్వ‌యం చాల‌కంగా గుర్తిస్తుంది.
  • ఈ గుర్తింపు ప్ర‌కియ కాలానుగుణంగా జ‌రుగుతుంది.
  • ఖాతాల‌ను గుర్తించిన త‌రువాత‌- పాత యూఏఎన్‌తో లింక్ అయిన ఈపీఎఫ్ ఖాతా నిధుల‌ను వేరొక యూఏఎన్‌తో లింక్ అయిన కొత్త ఈపీఎఫ్ ఖాతాకు బ‌దిలీ చేసిన‌ అనంత‌రం పాత యూఏఎన్‌ను ఈపీఎఫ్ఓ క్రియార‌హితం చేస్తుంది.
  • ఈ ప్రాసెస్ పూర్తైన త‌రువాత పాత యూఏఎన్ స్వ‌యంచాల‌కంగా ర‌ద్దువుతుంది. ఉద్యోగి పాత ఈపీఎఫ్‌ స‌భ్య‌త్వ గుర్తింపు నెంబ‌రును ప్ర‌స్తుత యూఏఎన్‌కు లింక్ చేస్తారు.
  • ర‌ద్దైన‌ స్టేట‌స్‌ను ఎస్ఎమ్ఎస్ ద్వారా ఉద్యోగికి తెలుపుతారు.
  • ఒక‌వేళ ఉద్యోగి కొత్త యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోక‌పోతే, యాక్టీవేట్ చేసేందుకు అభ్య‌ర్థ‌న పెట్టి, ఖాతా ప్ర‌స్తుత స్థితిని తెలుసుకోవ‌చ్చు.
  • ఉద్యోగి త‌న ముందు సంస్థ నుంచి ఏమైనా పీఎఫ్ బ‌కాయిలు పొంద‌వ‌ల‌సి ఉంటే, ఈసీఆర్‌లో సిస్ట‌మ్ స్వ‌యంచాల‌కంగా కొత్త‌ యూఏఎన్ నెంబ‌రును ఇస్తుంది. కొత్త యూఏఎన్ నెంబ‌రుతో లింక్ అయిన పీఎఫ్ ఖాతాలో రావ‌ల‌సిన బ‌కాయిల గురించి తెలుస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly