వీలునామాను ఎలా రాయాలో తెలుసుకుందాం

వీలునామా రాసే వ్య‌క్తి త‌న జీవితంలో ఎప్పుడైనా అందులో మార్పుచేర్పులు చేసుకునే హ‌క్కుంది.

వీలునామాను ఎలా రాయాలో తెలుసుకుందాం

సొంతంగా సంపాదించిన ఆస్తిని త‌న త‌ద‌నంత‌రం ఎవ‌రికి చెందాల‌నేదానిపై చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ రాసే ద‌స్త్రాన్నే వీలునామా అంటారని తెలిసిందే. ఇక్క‌డ సొంతంగా సంపాదించింది అంటే వార‌స‌త్వంగా వ‌చ్చింది లెక్క‌లోకి రాదు. వీలునామా రాసే వ్య‌క్తి త‌న జీవితంలో ఎప్పుడైనా అందులో మార్పుచేర్పులు చేసుకునే హ‌క్కుంది. రిజిస్ట‌ర్ చేసిన వీలునామాను మాత్రం మార్చాలంటే తిరిగి రిజిస్ట‌ర్ చేసుకుంటేనే చెల్లుతుంది. స్థిరాస్తి బ‌దిలీ కోసం ఉద్దేశించిన‌ వీలునామాకు స్టాంప్ డ్యూటీ అక్క‌ర్లేదు.

త‌ల్లిదండ్రుల‌ను పిల్ల‌లు బాగా చూసుకుంటార‌నే న‌మ్మ‌కం ఉంటే కోర్టులో వార‌సత్వ ఆస్తి గురించి బ‌హుశా ఇన్నేసి కేసులు ఉండ‌వు కాబోలు!. శారీర‌కంగా, మాన‌సికంగా ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే వీలునామా రాసి దాన్ని రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం మంచిది. మీ త‌ద‌నంత‌రం న‌కిలీ ధ్రుప‌త్రాలు, త‌ప్పుడు సంత‌కాల‌తో ఆస్తిని కాజేయాల‌ని చూసే వారికి వీలునామానే త‌గిన స‌మాధానంగా నిలుస్తుంది.దేంట్లో రాయాలి? వీలునామాను తెల్ల‌కాగితం పైనా రాయ‌వ‌చ్చు. దీనిపై ఇద్ద‌రు సాక్షి సంత‌కాలు పెట్టాల్సి ఉంటుంది. సాక్షులుగా న‌మ్మ‌క‌స్తులు, కాస్త చిన్న లేదా మ‌ధ్య‌వ‌య‌సువారిని ఎంచుకుంటే మంచిది. మ‌రీ వ‌య‌సు మీరిన వారిని తీసుకుంటే డాక్ట‌ర్ స‌ర్టిపికెట్ పొంది వీలునామాకు జ‌త‌చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు రాయాలి? వీలునామా రాసేందుకు అన్నింటి కంటే చివ‌రి ప్రాధాన్య‌త ఇస్తారు. అయితే, ఎంత తొంద‌ర‌గా వీలైతే అంత తొంద‌ర‌గా వీలునామా రాయ‌డం మంచిదంటారు. పెళ్లి అవ్వ‌డంతోనే లేదా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసిన సంద‌ర్భంలో వీలునామా రాయాలి. చావు చెప్పి రాదంటారు. కాబ‌ట్టే వీలునామా రాసేందుకు ఇదీ స‌మ‌యం అంటూ ఉండ‌దు. నామినీలున్నారా? నామినీలు మాత్ర‌మే చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సుల‌కు లేదా ల‌బ్ధిదారుల‌కు న‌మ్మ‌కంగా ఆస్తిని బ‌దిలీ చేయ‌గ‌ల‌రు. స్థిరాస్తికి నామినీలంటూ ఉండ‌రు. కాబ‌ట్టి ఇలాంటి వాటికి త‌ప్ప‌నిస‌రిగా వీలునామా రాయాల్సి ఉంటుంది. చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సుల వివ‌రాలు - వీలునామా రాసే వ్య‌క్తి చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సుల పేరు, వివ‌రాలు తెల‌పాలి. త‌ల్లి, భార్య/భ‌ర్త‌, కూతురు, కొడుకు ఇలా అన్న‌మాట‌. కుటుంబంలో కనీసం ఒక్క వ్య‌క్తిక‌యినా వీలునామాను ఎక్క‌డ భ‌ద్ర‌ప‌రిచింది తెలియ‌జేయాలి. వీలునామాలో ఏం రాయ‌వ‌చ్చు. సొంతంగా సంపాదించుకున్న స్థిర‌, చ‌రాస్థులకు సంబంధించి ఏవైనా వీలునామాలో రాయ‌వ‌చ్చు. ఏదైనా ఆస్తి నేరుగా తండ్రి, తాత, ముత్తాత‌ల నుంచి సంక్ర‌మిస్తే దాన్ని సొంతంగా సంపాదించిన దాంతో స‌మానంగా చూస్తారు. కాబ‌ట్టి దీనిని వీలునామాలో జ‌త‌చేయ‌వ‌చ్చు. స్థిరాస్తికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వీలునామాలో రాయాల్సి ఉంటుంది. ఆస్థిలో ఎంత వాటా, అది ఉన్న వీధి, ఇంటి నెంబ‌రు, ప్రాంతం, నగ‌రం, ఎవ‌రి ద‌గ్గ‌ర నుంచి కొన్నార‌న్న విష‌యాల‌ను త‌ప్ప‌క న‌మోదు చేయాలి. త‌ద్వారా సందిగ్ధ‌త‌ల‌కు తావివ్వ‌కుండా చేయ‌వ‌చ్చు. సాధార‌ణంగా ఆస్తిని భార్య పేరిట రాస్తారు. ఆమె త‌ద‌నంతరం పిల్ల‌ల‌కు చెందేలా రాస్తారు. భార్యకు పూర్తి ఆస్తిని అమ్ముకునే హ‌క్కును ఆపాదిస్తూ కూడా వీలునామా రాయ‌వ‌చ్చు.

ఈ న‌మూనా వీలునామా చూడండి…’‘నేను కొన్న ఇంట్లో నా భార్య ఉండేందుకు హ‌క్కు ఉంది’’ అని ఒక వ్య‌క్తి వీలునామా రాసి పోయాడు. ఆ త‌ర్వాత ఆమె ఎక్క‌డ ఉందో ఊహించ‌గ‌ల‌రా? ఆమె చ‌ర‌మ ద‌శ‌లో కారు షెడ్డులో జీవితం గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అదే ఆ వీలునామాలో ఇలా రాసి ఉంటే… ‘‘నేను ఉన్న‌ప్పుడు ఏ విధంగా అయితే బెడ్‌రూమ్‌, డ్రాయింగ్ రూమ్‌, కిచెన్‌, లాబీ, గార్డెన్ వాడుతూ క‌లియ‌తిరిగుతూ ఉన్నానో నా త‌ద‌నంత‌రం కూడా నా భార్యకు నా ఇంట్లో ఈ చోట్ల‌లో తిరిగాడే, జీవించే హ‌క్కు ఉంది’’. పై విధంగా రాసి ఉంటే ఆ ప‌రిస్థితే వేరుగా ఉండేది. అందుకే వీలునామాలో ప్ర‌తి చిన్న విష‌యాన్ని స్ప‌ష్టంగా రాయడం మంచిది. వీలునామా స‌వ‌ర‌ణ‌ - వీలునామా ఒక‌సారికి రాసి వదిలేసిది కాదు. కుటుంబంలో పరిస్థితులు మారినా అంటే కుటుంబ‌స‌భ్యుల్లో ఎవ‌రో ఒక‌రు చ‌నిపోయినా, కొత్త ఇల్లు, షాప్‌ కొనుగోలుచేసినా, వ్యాపారం ప్రార‌భించినా కొత్త వీలునామా రాయ‌డం మంచిది లేదా అందులోనే త‌గిన మార్పులు చేసుకోవ‌చ్చు. వీలునామాను ఎన్ని సార్ల‌యినా స‌వ‌రించుకోవ‌చ్చు.

వీలునామా రిజిస్ట్రేష‌న్‌ - రిజిస్ట‌ర్ చేయించ‌క‌పోతే అస‌లైన వ్య‌క్తే వీలునామా రాశాడా అన్న సందేహం క‌లుగుతుంది. రిజిస్ట‌ర్ అయిన వీలునామాకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రిజిస్ట్రేష‌న్‌కు నామ‌మాత్ర‌పు ఛార్జీ ఉంటుంది. వీలునామాను టైప్ చేయించి ఒరిజిన‌ల్‌వి రెండు కాపీలు సిద్ధం చేసుకోవాలి. దీనిపై కుడి వైపున పై భాగంలో ఫొటో అతికించి జ‌త‌గా గుర్తింపు ప‌త్రాన్ని పొందుప‌ర్చాలి. వీలునామా ప్ర‌తి ప్రేజీలోనూ వీలునామా రాసిన వ్య‌క్తి సంత‌కం, ఇద్ద‌రు సాక్షుల సంత‌కాలు ఉండాలి. ఆ త‌ర్వాతే స‌బ్ రిజిస్ట్రార్‌కు వీలునామా స‌మ‌ర్పించాలి. కొన్ని చోట్ల వ‌యో వృద్దుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తారు. అలాంటి చోట్ల‌ వీలునామా రిజిస్ట్రేష‌న్ త్వ‌ర‌గా పూర్త‌వుతుంది.విదేశాల్లోని పిల్ల‌ల కోసం…చాలా మంది త‌ల్లిదండ్రులేమో ఇక్క‌డ ఉంటారు. వారి పిల్ల‌లు విదేశాల్లో స్థిర‌ప‌డి ఉంటారు. ఆస్తిని వారి పేరిట బ‌దిలీ చేసేందుకు వీలునామా రాయ‌డం చాలా ముఖ్యం. దీన్ని రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌డం చాలా మంచిది. వీలునామాలో పేర్కొన్న ఆస్తిని అమ్ముకొని దాని లాభాల‌ను విదేశాల‌కు త‌ర‌లించ‌డాన్ని ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది. అయితే అది విదేశీ మార‌క నిర్వ‌హ‌ణ చ‌ట్టానికి (ఫెమా) లోబ‌డి ఉంటుంది. అది ఏటా 1 మిలియ‌న్ డాల‌ర్ల‌కు ప‌రిమితం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly