రూపాయి ప‌డిపోతోంది, దీని ప్ర‌భావం మ‌న‌పై ఎంత?

డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల వ్య‌క్తుల ఆర్థిక జీవితాలు ఎలా ప్ర‌భావిత‌మ‌వుతాయి.

రూపాయి ప‌డిపోతోంది, దీని ప్ర‌భావం మ‌న‌పై ఎంత?

గ‌త మూడు నెల‌లుగా డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి దాదాపు 5 శాతం మేర న‌ష్ట‌పోయింది. రూపాయి ఇంత‌లా న‌ష్ట‌పోవ‌డానికి ఐదు కార‌ణాల‌ని ప్ర‌ముఖ ఆర్థిక నిపుణుడొక‌రు అన్నారు. అవి పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు, అమెరికా బాండ్ల రాబ‌డులు, వ‌ర్థ‌మాన మార్కెట్ల ఆస్తుల‌లో బ‌ల‌హీన‌త‌లు, అమెరికా డాల‌ర్‌పై స్పెక్యులేష‌న్‌, దేశంలో విదేశీ పెట్టుబ‌డులు త‌గ్గిపోవ‌డం ఇందుకు కార‌ణాలు అని ఆయన తెలిపారు. రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం, మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌పై ప్ర‌తికూలంగా, అదే స‌మ‌యంలో సానుకూల ప్ర‌భావాన్నీ చూపిస్తుంది.

రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల న‌ష్టాలెలా ఉంటాయి?

డాల‌ర్ తో రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల దిగుమ‌తులు భార‌మ‌వుతాయి. ప్ర‌పంచంలో ఇంధ‌నాన్ని అధికంగా దిగుమ‌తి చేసుకునే దేశాల్లో మ‌న దేశ‌మూ ఒక‌టి. ఈ దిగుమతుల‌న్నీ డాల‌ర్ల‌లో చెల్లించాల్సి రావ‌డం వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణంపై ప్ర‌భావం చూపుతుంది. ద్ర‌వ్యోల్బ‌ణం అధికమ‌వ‌డం వ‌ల్ల ఖ‌ర్చులు భార‌మై, పొదుపు త‌గ్గుతుంది. ఇది వ్య‌క్తుల ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతుంది. అధిక ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితులు ఎక్కువ కాలం కొన‌సాగితే, వ‌డ్డీ రేట్లు పెరిగి రుణాలు భార‌మ‌వుతాయి.

రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల‌ విదేశాల్లో పెట్టిన పెట్టుబ‌డులు, విదేశీ ఉన్న‌త విద్య‌, విదేశీ ప్ర‌యాణాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది.

రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల లాభాలేమైనా ఉన్నాయా?

విదేశాల నుంచి మ‌న దేశానికి డ‌బ్బులు పంపించే వారికి ఇది ప్ర‌యోజ‌న‌క‌ర‌మే, అలాగే విదేశీ పెట్టుబ‌డుల‌ను ఉపసంహ‌రించుకునేట‌ప్పుడు కూడా ఇది లాభ‌దాయ‌క‌మే. అయితే దీనివ‌ల్ల ఈక్విటీలో పెట్టుబ‌డులు పెట్టిన‌ మ‌దుప‌రుల‌పై మిశ్ర‌మ ప్ర‌భావాలేర్ప‌డుతాయి. ఎందుకంటే రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల ఎగుమ‌తిదారుల‌కు ల‌భించే ప్ర‌యోజ‌నాలు, దిగుమ‌తిదారులు అందుకునే న‌ష్టాల‌తో త‌ట‌స్థీకృత‌మ‌వుతాయి.

బ‌ల‌హీన రూపాయి వ్య‌క్తుల ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో మ‌రింత వివ‌రంగా తెలుసుకుందాం.

విదేశీ విద్య

విదేశాల్లో ఉన్న‌త విద్య న‌భ్య‌సించాల‌నుకునే విద్యార్థులు ఆయా యూనివ‌ర్సిటీల‌లో ప్ర‌వేశం కోసం టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్ లాంటి ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. రూపాయి విలువ బ‌ల‌హీన‌మ‌వ‌డంతో ఈ ప‌రీక్ష‌లు రాసేందుకు విద్యార్థులు అధికంగా డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇప్ప‌టికే విదేశాల్లో చ‌ద‌వుతున్న విద్యార్థుల బ‌డ్జెట్‌పైనా ఇది తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపుతుంది. అప్లికేష‌న్ రుసుములు, ప‌రీక్ష ఫీజు, ట్యూష‌న్ ఫీజులు వారికి భారం కానున్నాయి.

అలాగే నివాస ఖ‌ర్చులూ అధిక‌మ‌వుతాయి. ఉన్న‌త విద్య కోసం రుణం తీసుకున్న వారికి కొత్త స‌మ‌స్య‌లు ఎదురవుతాయి. అవ‌స‌రానికంటే త‌క్క‌వు రుణం మంజూరు అయిన‌ప్పుడు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిగిలిన మొత్తాన్ని వారు త‌మ సొంత జేబులో నుంచి ఖ‌ర్చు పెడతారు.

విదేశీ ప్ర‌యాణాలు- విహార యాత్ర‌లూ

విదేశీ ప్ర‌యాణాలు చేయాల‌నుకునే వారికి ఇది మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి. గ‌త కొద్ది నెల‌లుగా డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి 5 శాతం మేర న‌ష్ట‌పోవ‌డంతో, ఇక విదేశీ ప్ర‌యాణ ఖ‌ర్చులు 10 నుంచి 15 శాతం మేర భార‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని ఆర్థిక నిపుణుడొక‌రు అన్నారు. దీని వ‌ల్ల వ్య‌క్తులు త‌మ విదేశీ విహార‌యాత్ర‌ల‌ను త‌క్కువ రోజుల‌కే ప‌రిమితం చేసుకోవాల్సి రావ‌చ్చు. అయితే ముందే బుకింగ్ చేసుకున్న వారిపై ఈ ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉంటుంది.

అయితే ఆసియా క‌రెన్సీలతో మ‌న రూపాయి ఒడుదొడుకులు ఎదుర్కొనే అవ‌కాశాలు త‌క్కువే కాబ‌ట్టి, ప‌శ్చిమ దేశాల‌లో త‌క్కువ రోజులు విహార‌యాత్ర చేసే బ‌దులు ఈ దేశాలలో ఎక్కువ రోజులు విహ‌రించ‌వ‌చ్చు.

వైద్య ఖ‌ర్చులు

రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం వైద్య ఖ‌ర్చుల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ప్ర‌స్తుతం మొత్తం వైద్య ఖ‌ర్చుల‌లో 30 నుంచి 40 శాతం వైద్య ఉప‌క‌ర‌ణాలు, ఇత‌ర రోగ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల‌వే ఉంటున్నాయి. ఈ ప‌రిక‌రాలలో 80 శాతం విదేశాల నుంచే దిగుమ‌తి అవుతున్నాయి. ఈ ఖ‌ర్చుల‌ను ఆసుప‌త్రులు రోగుల‌కే బ‌ద‌లాయించే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో చికిత్స తీసుకోవాల‌నుకునే వారికి కూడా ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామమే. అందుకే ఈ ఖ‌ర్చుల‌ను త‌ట్టుకోవ‌డానికి ఆరోగ్య బీమా తీసుకోవ‌డం మంచిది.

కారు కొన‌డం

ప్ర‌స్తుతం దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు ఉక్కు, ఇత‌ర లోహాలు, ప్లాస్టిక్‌, వైర్లు, విద్యుత్ ఉప‌క‌రణాలు వంటి విడిభాగాల‌ను ఎక్కువ‌గా విదేశాల నుంచే దిగుమ‌తి చేసుకుంటున్నారు. దీని వల్ల కారు త‌యారీ ఖర్చులు పెరుగుతాయి. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే పెరిగిన ఈ ఖ‌ర్చుల‌ను వాహ‌న కంపెనీలు వినియోగ‌దారుల నెత్తి పైనే మోపే అవ‌కాశం ఉంది.

హోట‌ళ్లకు వెళ్ల‌డం/ స‌రుకులు/ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల కొనుగోళ్లు

ఒక‌వేళ మీరు ఏదైనా ప్ర‌పంచ ఖ్యాతి నొందిన విదేశీ హోట‌ళ్ల‌కు భోజ‌నానికి వెళితే, పెరిగిన బిల్లును చూసి ఆశ్య‌ర్య‌పోకండి. ఎందుకంటే రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల దిగుమ‌తి చేసుకునే ఆహార వ‌స్తువుల ధ‌ర‌లూ పెరుగుతాయి కాబ‌ట్టి. అలాగే మండిపోతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల కార‌ణంగా ర‌వాణా ఖ‌ర్చులు పెరిగి స‌ర‌కులు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లూ పెరుగుతాయి. దీని వ‌ల్ల సామాన్య ప్ర‌జానీకం ఇబ్బందుల‌నెదుర్కోక త‌ప్ప‌దు.

మీరు మీ బడ్జెట్‌కే ప‌రిమిత‌మై అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌వ‌ని ఆర్థిక నిపుణలు స్ప‌ష్టం చేస్తున్నారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly