రూ. 64,700 కోట్ల రీఫండ్లు జారీ చేసిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌

గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే ఈ సంవ‌త్స‌రం ఎల‌క్ట్రిక్ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసిన వారి సంఖ్య 18.65 శాతం పెరిగింది

రూ. 64,700 కోట్ల రీఫండ్లు జారీ చేసిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌

ఆదాయ ప‌న్ను శాఖ ప్ర‌స్తుత ఆర్ధిక సంవత్స‌రానికి గానూ రూ. 64,700 కోట్ల విలువైన‌ రీఫండ్స్‌ను జారీ చేసిన‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సోమ‌వారం తెలిపారు. 2018-19 పూర్తి ఆర్ధిక సంవ‌త్స‌రానికి విడుద‌ల చేసిన మొత్తం రూ. 1.61 ల‌క్ష‌ల కోట్లుగా ఉంద‌ని ఆమె తెలిపారు.

అసెస్మెంటు సంవ‌త్స‌రం 2018-19(ఆర్థిక సంవ‌త్స‌రం 2017-18) సంవ‌త్స‌రానికి గానూ 6.49 కోట్ల ప‌న్ను చెల్లింపుదారులు ఎల‌క్ట్రిక్ రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించార‌ని, 2017-18 అసెస్మెంటు సంవ‌త్స‌రానికి గానూ 5.47 కోట్ల మంది ఎల‌క్ట్రిక్ రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించార‌ని, అంటే ఈ సంఖ్య 18.65 శాతం పెరిగింద‌ని, లోక్ స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం తెలిపారు.

చిన్న స్థాయి ప‌న్ను చెల్లింపుదారుల‌తో స‌హా ప‌న్ను చెల్లింపుదారులంద‌రికీ రీఫండ్లు జారీ చేసేందుకు ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త నిస్తుంద‌ని, మొత్తం ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు(ఐటీఆర్‌)లో 0.5 శాతం కంటే త‌క్కువ రిట‌ర్నులు ప‌రిశీల‌కు ఎంపిక చేశార‌ని , అధిక శాతం ప‌న్ను రిట‌ర్నులు వేగంగా ప్రాసెస్ చేసి, రిఫండ్‌ల‌ను జారీ చేసిన‌ట్లు నిర్మాలా సీతారామ‌న్ తెలిపారు. సాంకేతిక ప‌రిజ్ఞానం అధిక స్థాయిలో వినియోగించుకుని ప్రాసెస్ చేసే స‌మ‌యాన్ని త‌గ్గించిన‌ట్లు ఆమె తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ 18, 2019 నాటికి, రూ. 64,700 కోట్లను రీఫండ్ చేశారు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన మొత్తం రూ.1.61 లక్షల కోట్లకు పైగా ఉంది.2018-19లో పన్ను చెల్లింపుదారుల‌లో, ఇంత‌వ‌ర‌కు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌ని వారు తమ ఐటీఆర్‌లను సకాలంలో దాఖ‌లు చేసేందుకు 26.9 కోట్ల ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్ పంపిచిన‌ట్లు సీతారామన్ తెలిపారు.

రిటర్న్‌లను సకాలంలో ప్రాసెస్ చేయడానికి ఐటీ శాఖ ఇంటిగ్రేటెడ్ ఈ-ఫైలింగ్‌, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) 2.0 ప్రాజెక్టును 2019 జనవరిలో ప్రభుత్వం ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ముందుస్తుగా రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌డం ద్వారా, రిటర్న్‌లో ఉన్న సమాచారం, ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడ‌మే కాకుండా, రిటర్న్‌లను ప్రాసెస్ చేయడానికి, రీఫండ్ ఇవ్వడానికి జారీ చేసిన సమయాన్ని త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఐటీ శాఖ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.

మార్చి 2019 నుంచి ఆదాయ‌పు ప‌న్ను రీఫండ్ల‌ను ఈసీఎస్ ద్వారా మాత్ర‌మే జారీ చేయ‌డాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ విధానం ద్వారా బ్యాంకు ఖాతాల‌కు నేరుగా, వేగ‌వంతంగా క్రెడిట్ చేసేందుకు వీల‌వుతుంద‌ని తెలిపింది. అంతేకాకుండా రూ.5 వేల వ‌ర‌కు ఉన్న రీఫండ్‌ల‌పై ఎటువంటి స‌ర్దుబాట్లు లేకుండా జారీ చేయాల‌ని అన్ని విభాగాల అధికారుల‌కు సూచ‌న‌లు జారీ చేసింది.

పన్ను చెల్లింపుదారులు వారి ఐటీఆర్‌లను ఈ-ఫైల్ చేయడానికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. ఈ-ఫైలింగ్‌లో శిక్షణ, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలను ఆదాయపు పన్ను శాఖ చేపడుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly