2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఐటీఆర్‌ దాఖ‌లు చేయ‌డం ఎలా? పూర్తి వివ‌ర‌ణ‌..

గ‌డువులోగా ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించ‌క‌పోతే పెట్టుబ‌డుల మీద ప‌న్ను మిన‌హాయింపుల కొర‌కు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు.

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఐటీఆర్‌ దాఖ‌లు చేయ‌డం ఎలా? పూర్తి వివ‌ర‌ణ‌..

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం లేదా 2019-20 మ‌దింపు సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు నోటిఫై చేసింది. ఈ ఏడాది ఐటీఆర్‌లో పెద్దగా మార్పులేమి జ‌ర‌గ‌లేదు. కొన్ని వివ‌రాలు మాత్రం అద‌నంగా అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐటీఆర్ 2 లో… దేశంలో ఎన్ని రోజులు నివాసం ఉన్నారు, లిస్ట్‌లో లేని షేర్లు ఎన్ని క‌లిగి ఉన్నారు , టీడీఎస్ మిన‌హాయింపు ఉన్న నేప‌థ్యంలో పాన్ వివ‌రాలు వంటివి అద‌నంగా చేర్చాల్సి ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ఏర్పాటు చేసిన‌ కొత్త సెక్ష‌న్ 80TTB ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌చ్చిన వ‌డ్డీ, లాంగ్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్ ఈక్వీటీల‌పై రాబ‌డి వంటివి తెలియ‌జేయాలి. ఆదాయ ప‌న్ను వెబ్‌సైట్‌లో త్వ‌ర‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి.

గ‌డువులోగా ఐటీఆర్ దాఖ‌లు చేయండి:

ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేది జులై 31 2019. ఈ 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి వ్య‌క్తులు లేదా కంపెనీలు గ‌డువులోగా ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించ‌క‌పోతే త‌మ పెట్టుబ‌డుల మీద ప‌న్ను మిన‌హాయింపుల కొర‌కు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు. సెక్ష‌న్ 80 కింద ల‌భించే పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజు, మెడిక‌ల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు వంటి వాటికి మిన‌హాయింపు ల‌భించ‌దు. అదేవిధంగా సెక్ష‌న్ 80డీ కింద ల‌భించే మెడిక్లెయిమ్‌, ఆరోగ్య బీమా, సెక్ష‌న్ 80TTA కి సంబంధించిన బ్యాంకు పొదుపు ఖాతాపై వ‌డ్డీ, 80 జీ కింద‌కు వ‌చ్చే డొనేష‌న్లు వంటివి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు.

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం లేదా 2019-20 మ‌దింపు సంవ‌త్స‌రానికి ఐటీఆర్ -1:

 1. దేశంలో నివ‌సించే వ్య‌క్తులు ఎవ‌రైతే వేత‌నం, గృహం, వ‌డ్డీ ఆదాయం లేదా ఇత‌ర మార్గాల ద్వారా రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం పొందుతున్న‌వారు ఐటీఆర్-1 ఫారం ద్వారా దాఖ‌లు చేయాలి.
 2. జాబితాలో లేని ఈక్విటీ షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన వ్య‌క్తులు లేదా ఒక కంపెనీకి డైరెక్ట‌ర్ వంటి వారికి ఐటీఆర్-1 ఫారం వ‌ర్తించ‌దు.
 3. గ‌త సంవ‌త్స‌రానికి సంబంధించిన వేత‌న వివార‌ల‌ను వ్య‌క్తులు ఈ ఫారంలో అందించాల్సి ఉంటుంది.
 4. ఐటీఆర్-1 ఇప్పుడు స్టాండ‌ర్ట్ డిడ‌క్ష‌న్‌తో క‌లిపి ఉంటుంది.రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు గ‌రిష్ఠంగా వ్య‌క్తి లేదా పెన్ష‌న‌ర్ రూ.40 వేల వ‌ర‌కు స్టాండర్ట్ డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ రూ.50 వేల‌కు పెంచారు. అది ఏప్రిల్ 1, 2019 నుంచి వ‌ర్తిస్తుంది.
 5. 60 ఏళ్లు దాటిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు బ్యాంకు పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్ల‌పై వ‌చ్చిన ఆదాయంపై రూ.50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంది. (గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఇది రూ.10,000 గా ఉండేది) కొత్త‌గా ఏర్ప‌డిన సెక్ష‌న్ 80TTB ప్ర‌కారం దీనిని క్లెయిమ్ చేసుకోవాలి. సీనియ‌ర్ సిటిజ‌న్లు సెక్ష‌న్ 80TTA కింద క్లెయిమ్ చేసుకునేందుకు వీల్లేదు. సెక్ష‌న్ 80TTA పొదుపు ఖాతాల‌పై వ‌చ్చిన వ‌డ్డీని రూ.10 వేల వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఇది వ్య‌క్తుల‌కు , హిందు అవిభాజ్య కుటుంబాల‌కు వ‌ర్తిస్తుంది.
 6. ఐటీఆర్-1 లో మీ సొంతింట్లో నివాసం ఉంటున్నారా లేదా అద్దెకు ఇచ్చారా అన్న‌ది తెలియ‌జేయాలి.
  7.ఈ ఏడాది ఇత‌ర ఆదాయాన్ని కూడా వెల్ల‌డించాల్సిందిగా కొత్త నిబంధ‌న తీసుకొచ్చారు. అంటే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వ‌చ్చిన ఆదాయం వంటిది.
 7. సెక్ష‌న్ 80TTA ప్ర‌కారం బ్యాంకు డిపాజిట్ల మీద వ‌చ్చే ఆదాయాన్ని రూ.10 వేల వ‌ర‌కుక్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ఆల‌స్యంగా దాఖ‌లు చేసిన వారికి ఇది వ‌ర్తించ‌దు.

ఐటీఆర్ 2:

 • ఐటీఆర్‌-2 వ్యాపారం లేదా ఇత‌ర వృత్తుల ద్వారా ఆదాయం పొంద‌ని వ్య‌క్తుల‌కు , హిందూ అవిభాజ్య కుటుంబాల‌కు వ‌ర్తిస్తుంది.
 • వ్య‌క్తులు లేదా హెచ్‌యూఎఫ్ ఇప్పుడు నివాస వివ‌రాల‌ను ఐటీఆర్ 2 లో అందించాల్సి ఉంటుంది. అంటే సెక్ష‌న్ 6 (1) (a) ప్ర‌కారం దేశీయ నివాసులు గ‌తేడాదిలో 182 రోజులు లేదా అంత‌కంటే ఎక్కువ రోజులు దేశంలో ఉన్నారా లేదా తెలియ‌జేయాలి. సెక్ష‌న్‌ 6 (1) © ప్ర‌కారం, గ‌తేడాది దేశంలో 60 రోజులు లేదా అంత‌కంటే ఎక్కువ‌ రోజులు , లేదా గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో దేశంలో 365 రోజులు లేదా అంత‌కంటే ఎక్కువ రోజులు నివాసం ఉన్నారా లేదా తెలియ‌జేయాలి.
 • గ‌త 10 సంవ‌త్స‌రాల‌లో 9 సంవ‌త్స‌రాలు నాన్‌-రెసిడెంట్‌గా ఉంటే లేదా గ‌త ఏడేళ్ల‌లో 729 రోజులు లేదా అంత‌కంటే త‌క్కువ రోజులు దేశంలో ఉంటే సాధార‌ణ నివాసిగా గుర్తించ‌రు.

నాన్‌-రెసిడెంట్:

గ‌తేడాదిలో మీరు నాన్-రెసిడెంట్ అయితే ఎక్క‌డ నివ‌సించారో వివ‌రాలు అందించాలి.

జాబితాలో లేని కంపెనీల షేర్లు క‌లిగి ఉంటే కంపెనీ పేరు, పాన్, షేర్ల సంఖ్య, విక్రయాల వివ‌రాలు ఐటీఆర్-2 లో తెలియ‌జేయాలి.

ఈక్విటీల‌పై లాంగ్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్:

ఈక్విటీలు లేదా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి వ‌చ్చిన ల‌క్ష రూపాయ‌ల‌కు పైగా రాబ‌డిపై లాంగ్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) 10 శాతం ప‌డుతుంది. స్వ‌ల్ప‌కాలిక‌ మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను శ్లాబు ప్ర‌కారం వ‌ర్తిస్తుంది.

ఐటీఆర్ ఫారంల‌పై స‌మీక్ష‌:

ఆఫ్‌లైన్‌లో ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం ఇప్పుడు కేవ‌లం 80 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన‌వారికి మాత్ర‌మే అవ‌కాశం ఉంది. అది కూడా ఎవ‌రైతే ఐటీఆర్‌-1 లేదా ఐటీఆర్‌-4 ద్వారా దాఖ‌లు చేస్తారో వారికి వ‌ర్తిస్తుంది. ఇత‌రులు క‌చ్చితంగా ఆన్‌లైన్ ద్వారా దాఖ‌లు చేయాలి. ఇంత‌కుముంద‌రు రూ.5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న‌వారు రీఫండ్ అవ‌కాశం లేనివారు ఆఫ్‌లైన్‌లో దాఖ‌లు చేసేవారు ఇప్పుడు ఆ స‌దుపాయం లేదు.

వేత‌న జీవులు, పింఛ‌నుదారులు దాదాపుగా ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 2 ద్వారా రిట‌ర్నులు దాఖ‌లు చేస్తారు. ఐటీఆర్ 3 అనేది వ్యాపారం లేదా ఇత‌ర వృత్తుల ద్వారా ఆదాయం పొందే వ్య‌క్తులు,అవిభాజ్య కుటుంబాల‌కు వ‌ర్తిస్తుంది. ఐటీఆర్ 4 -రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వ్య‌క్తులు, హెచ్‌యూఎఫ్ , సంస్థ‌ల ఆదాయం సెక్ష‌న్ 44AD, 44ADA or 44AE కింద లెక్కిస్తారో వారికి సంబంధించిన‌ది. ఐటీఆర్ -4 ను కంపెనీ డైరెక్ట‌ర్ హోదాలో ఉన్న‌వారు, జాబితాలో లేని షేర్ల‌ను క‌లిగి ఉన్న‌వారు దీని ద్వారా దాఖ‌లు చేసేందుకు వీలుండ‌దు.

ఐటీఆర్‌-3 ఐటీఆర్‌-6 (కంపెనీలు) ట‌ర్నోవ‌ర్ లేదా స్థూల ఆదాయం గురించి జీఎస్‌టీకి అందించిన వివ‌రాల‌ను ఈ ఫారంల‌లో తెలియ‌జేయాలి. గ‌తేడాది ఇది కేవ‌లం ఐటీఆర్‌-4 ద్వారా ప‌న్ను దాఖ‌లు చేసిన‌వారికి మాత్ర‌మే వ‌ర్తించింది.

ఆదాయ ప‌న్నుపై పెరిగిన సెస్‌:

3 శాతం విద్యారుసుము ఇప్పుడు 4 శాతానికి చేరింది. అయితే ఇందులో వైద్య‌, విద్య సెస్ క‌లిపి ఉంటుంది . సెస్ పెర‌గ‌డంతో ఇప్పుడు ప‌న్ను పెరుగుతుంది.

 • అధిక ప‌న్ను శ్లాబులోకి వ‌చ్చేవారికి రూ.15 ల‌క్ష‌ల ఆదాయానికి ప‌న్ను రూ.2,625 వ‌ర‌కు పెరిగింది.
 • మ‌ధ్య‌-ఆదాయం క‌లిగిన‌ ప‌న్ను చెల్లింపుదారులు అంటే రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న‌వారికి రూ.1,125 వ‌ర‌కు పెరిగింది.
 • త‌క్కువ ఆదాయం రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల అయితే రూ.125 వ‌ర‌కు పెరిగింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly