టర్మ్ జీవిత బీమాయే ఎందుకంటే ...

మారుతున్న జీవన విధానానికి , జీవన ప్రమాణాలకు సరిపోయే విధంగా జీవిత బీమా ఉండాలి. అందుకోసమే ప్ర‌వేశ‌పెట్టిన‌దే ' టర్మ్ జీవిత బీమా '

టర్మ్ జీవిత బీమాయే ఎందుకంటే ...

సాధారణంగా ప్రతి వ్యక్తి 20-25 ఏళ్ల వయసులో సంపాదన మొదలు పెడతారు. ఈ వయసులో చాలా మంది పెళ్లి కాని వారు ఉంటారు . తమ తల్లిదండ్రులలో కనీసం ఒకరైనా సంపాదనపరులై ఉంటారు. దీనివలన వీరిపై ఆర్థిక బాధ్యతలు ఎక్కువ ఉండవు. వయసు పెరిగే కొద్దీ , తల్లిదండ్రులు పెద్ద‌వాళ్ల‌వుతుంటారు. వాళ్ళ సంపాదన తగ్గుతూ ఉంటుంది. అందుచేత వీరిఫై బాధ్యతలతోపాటు ఖర్చులు పెరుగుతాయి. సంపాదించే వ్యక్తికి అనుకోని సంఘటన వలన ఆదాయం కోల్పోతే ఆ కుటుంబం చాలా కష్టాలు పడాల్సివస్తుంది. ఆ సంఘటన వలన ఒక్కొక్క సారి సంపాదించే వ్యక్తి ప్రాణం కూడా కోల్పోవచ్చు లేదా పాక్షిక వైకల్యం రావచ్చు. ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, లేదా వైకల్యం సంభవించి, కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులకు లోనవుతున్న సంఘ‌ట‌న‌లు మనం రోజూ పత్రికలలో చూస్తుంటాం.

ఇటువంటి సమయంలో ఆర్థికంగా ఆదుకోవటానికి ఎవరు ముందుకు రాలేక పోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులకు చాలా డబ్బులు అవసమవుతాయి. అలాగే ఎంతకాలం అవసరమవుతాయో తెలియదు. ఇటువంటి సమయంలో ఆదుకునేది ‘జీవిత బీమా’ .

ఇదివరకు ప్రమాదాల స్థాయి ఇంత ఉండేవి కావు. అలాగే జీవితానికి కావాల్సిన నిత్యావసరాలు చాలా చౌకగా దొరికేవి. వస్తు సేవల వినిమయం అంత ఎక్కువగా ఉండేది కాదు. అందువల్ల తక్కువ మొత్తంలో జీవిత బీమా పాలసీలు ఉండేవి. అవికూడా జీవిత బీమా తో పాటు పొదుపు/ మదుపు కలిపి ఉండటం వలన , కాలపరిమితి చివరన కొంత సొమ్ము లభిస్తుంది అనే ఆశతోనైనా పాలసీ తీసుకునేవారు. దానికి తోడు పాలసీదారులను ఉత్సాహపరిచేందుకు బీమా సంస్థలు బోనస్ ప్రకటించేవి. అలాగే చెల్లించిన జీవిత బీమా ప్రీమియం తో ఆదాయపు పన్ను మినహాయింపు పొందేవారు.

మారుతున్న జీవన విధానానికి , జీవన ప్రమాణాలకు సరిపోయే విధంగా జీవిత బీమా ఉండాలి. అందుకోసమే ప్రవేశ ఉద్దేశించిన‌ది ’ టర్మ్ జీవిత బీమా '. ఇవి తక్కువ ప్రీమియం తో ఎక్కువ బీమా హామీని కలిపిస్తాయి. అలాగే జీవిత బీమా ప్రీమియం తో ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. టర్మ్ జీవిత బీమాను ఆన్లైన్ లోనూ పొందొచ్చు.

టర్మ్ జీవిత బీమాను తీసుకునేటప్పుడు ఈ కింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి:

 1. ప్రపోజల్ ఫారం ను మీరే స్వయంగా నింపాలి. ఏజెంట్ ద్వారా నింపినట్లయితే , కొన్ని ముఖ్యమైన విషయాలను వదిలివేయవచ్చు లేదా తప్పుగా రాయవచ్చు.
 2. బీమా సంస్థ అడిగిన అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వండి. ఏదైనా అనుమానం ఉంటె బీమా సంస్థ ద్వారా నివృత్తి చేసుకోండి. అంతేకానీ , తప్పుడు సమాచారం ఇవ్వవద్దు. దీనివలన భవిష్యత్ లో క్లెయిమ్ చేసేటప్పుడు సమస్య రావచ్చు.
 3. ప్ర‌తి సంవ‌త్స‌రం స‌రైన‌ స‌మ‌యంలో ప్రీమియంలు చెల్లించి పాల‌సీ పున‌రుద్ద‌రించుకుంటూ ఉండాలి, లేకపోతే బీమా సంస్థ‌ అదనపు వైద్య నివేదికలను కోర‌వ‌చ్చు.
 4. బీమా హామీ మీ వార్షిక ఆదాయానికి 10-15 రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి.
 5. కొద్ది మొత్తంలో ప్రీమియం చెల్లించే విధంగా మీకు స‌రిప‌డ‌ రైడ‌ర్ల‌ను ఎంచుకోండి.
 6. స‌మ‌యానికి ప్రీమియం చెల్లింపులు కోసం మీ బ్యాంకు వారికి సూచ‌న‌లు ఇవ్వండి. గ‌డువు తేదికి ముందుగానే ఖాతాలో త‌గినంత నిధులు ఉండేలా చూసుకోండి.
 7. ప్ర‌స్తుతం ఉన్న పాల‌సీని కోల్పోయి, మీ వ‌య‌స్సు పెరిగిన త‌రువాత మ‌రొక కొత్త పాల‌సీని తీసుకుంటే అధిక ప్రీమియం చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది. లేదా ఒక్కొక్క సారి పాలసీ నిరాకరించవచ్చు.
 8. మీ కుటుంబ సభ్యుల‌కు పాల‌సీ వివ‌రాలు తెలియ‌చేయండి.
 9. క్లెయిమ్ సొమ్ము కొంత లంప్సం గా ,మిగిలినది నెలవారీ ఆదాయం గా వచ్చేటట్లు ఏర్పాటు చేయాలి.

ముగింపు:
మారుతున్న అవసరాలకు తగినట్టుగా పాలసీలలో మార్పులు చేస్తున్నారు. వీటిని పరిశీలిస్తూ, ఉన్న పాలసీకి అదనంగా బీమా హామీ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.

 • మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి.
 • కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
  సాంప్రదాయ పాలసీలో కంటే , టర్మ్ బీమా పాలసీలలో ప్రీమియం తక్కువ కాబట్టి, ఆ మిగులు సొమ్మును , పాలసీ కాలానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం ద్వారా మంచి నిధిని కూడా సమకూర్చుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly