డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు 5 ఆప్ష‌న్లు

డిజిట‌ల్ రూపంలో బంగారం కొనుగోలు చేయ‌డం సుల‌భం, సుర‌క్షితం. అవ‌స‌ర‌మైన‌ప్పుడు దానిని ఫిజిక‌ల్ గోల్డ్ రూపంలోకి మార్చుకోవ‌చ్చు.

డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు 5 ఆప్ష‌న్లు

భార‌త‌దేశంలో బంగారం పెట్టుబ‌డుల‌కు చాలా ప్రాధాన్య‌తనిస్తారు. బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆభ‌ర‌ణాలుగా వాడుకోవ‌చ్చే అదేవిధంగా పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు ఉంటుంద‌ని భావిస్తారు. ఈ డిజిట‌ల్ యుగంలో బంగారాన్ని కూడా డిజిట‌ల్ రూపంలోనే కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీంతో బంగారం నిల్వ చేసుకునేందుకు ఎలాంటి భ‌యం ఉండ‌దు. పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు కూడా ఉంటుంది. డిజిట‌ల్ బంగారం కొనుగోలు చేసేందుకు చాలా ర‌కాల ఆప్ష‌న్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

డిజిట‌ల్ గోల్డ్ అంటే ఏంటి?

డిజిట‌ల్ గోల్డ్ అంటే బంగారం బౌతిక రూపంలో కాకుండా డిజిట‌ల్ రూపంలో కొనుగోలు చేయ‌డం. ఇది వేగంగా, సుల‌భంగా, భ‌ద్ర‌త‌తో కూడిన పెట్టుబ‌డి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు దానిని ఫిజిక‌ల్ బంగారం రూపంలోకి మార్చుకోవ‌చ్చు. మార్కెట్ల ఆధారంగా ధ‌ర ఉంటుంది. ఈ ప‌ద్ధ‌తిలో బంగారం కొంటే ఎప్పుడైనా, ఎక్క‌డైనా అమ్మ‌కం, కొనుగోలు జ‌ర‌ప‌వ‌చ్చు. కొనుగోలు దారుడి ఆన్‌లైన్ ఖాతాలో పెట్టుబ‌డుల గురించిన వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుస్తాయి.

డిజిట‌ల్ గోల్డ్ ఎందుకు?

డిజిట‌ల్ గోల్డ్ తో చాలా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అయితే అందులో కొన్ని ముఖ్య‌మైన కార‌ణాలు…

త‌యారీ ఛార్జీలు:

బంగారాన్ని ఆభ‌ర‌ణాల రూపంలో కొనుగోలు చేసిన‌ప్పుడు త‌యారీ ఛార్జీలు వ‌ర్తిస్తాయి ఇవి 6 శాతం నుంచి 14 శాతం వ‌ర‌కు ఉంటాయి. అదే డిజిటల్ గోల్డ్ కొంటే ఎలాంటి త‌యారీ ఛార్జీలు అవ‌స‌రం లేదు.

స్వ‌చ్ఛ‌మైన బంగారం:

మీరు ఎంత డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేస్తారో అంతే స‌మానంగా 24 క్యారెట్ల 99.5 శాతం స్వ‌చ్చ‌మైన బంగారం తిరిగి పొంద‌వ‌చ్చు.

భ‌ద్ర‌త‌:

బంగారం ఆభ‌ర‌ణాలు, బిస్కెట్ల రూపంలో ఉంటే జాగ్ర‌త్త‌గా దాచుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో లాక‌ర్ అవ‌స‌రం కూడా ఉండ‌వ‌చ్చు. డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేస్తే దాచుకునేందుకు ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

ట్రేడింగ్ సుల‌భం:

ఫిజిక‌ల్ గోల్డ్‌లో ట్రేడింగ్ చాలా క‌ష్టంగా ఉంటుంది. అదే డిజిట‌ల్ గోల్డ్‌లో అయితే సుల‌భంగా ఆన్‌లైన్‌లో అమ్మ‌కం, కొనుగోలు చేయ‌వ‌చ్చు.

గారాన్ని డ‌బ్బు రూపంలోకి మారిస్తే…

డిజిట‌ల్ గోల్డ్‌ను ఆన్‌లైన్‌లో సుల‌భంగా విక్ర‌యించి డ‌బ్బు రూపంలో పొంద‌వ‌చ్చు. బంగారం అమ్మేసిన త‌ర్వాత మొత్తం న‌గ‌దు కొన్ని గంట‌ల్లో మీ బ్యాంకు ఖాతాలో చేరుతుంది. అదే ఫిజిక‌ల్ గోల్డ్‌ను అమ్మాల‌నుకుంటే బంగారం దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది.

బంగారం కొనుగోలు చేసేందుకు 5 డిజిట్ ఆప్ష‌న్లు:

 1. మీ - గోల్డ్ (Me-Gold)
 • మీ- గోల్డ్, మోతీలాల్ ఓస్వాల్ పెట్టుబ‌డుల ఫ్లాట్ ఫాం
 • మీ-గోల్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేయ‌వ‌చ్చు.
 • 999.9 స్వ‌చ్ఛ‌త క‌లిగిన 24 క్యారెట్ల బంగారం ల‌భిస్తుంది.
 • ఈ స్కీమ్‌లో భాగంగా బంగారం కొనుగోలు చేస్తే ఎంఎంటీసీ, పీఎఎంపీ 100 శాతం బీమా స‌దుపాయం క‌ల్పిస్తున్నాయి.
 • మీ గోల్డ్‌లో అతి త‌క్కువ‌గా 0.5 గ్రాములు కొనుగోలు చేయ‌వ‌చ్చు.
 • ఈ స్కీమ్ ఐదేళ్లు ఉంటుంది. త‌ప్ప‌నిస‌రిగా డిజిట‌ల్ గోల్డ్‌ను విక్రయించ‌డం లేదా ఫిజిక‌ల్ గోల్డ్ రూపంలోకి మార్చుకోవ‌డం చేయాలి.
 • వరుసగా 18 నెల‌లు మీ-గోల్డ్ ఖాతా లో లావాదేవీలు లేక‌పోతే ఖాతా డీయాక్టివేట్ అయిపోతుంది.
 1. పేటీఎం
 • పేటీఎం యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగ‌దారులు బంగారాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు.
 • ఇందులో క‌నీసం 0.0005 గ్రాముల నుంచి గ‌రిష్ఠంగా 50 గ్రాముల వ‌ర‌కు బంగారం కొనుక్కోవ‌చ్చు.
 • ఐదేళ్ల త‌ర్వాత అద‌న‌పు ఛార్జీలు వ‌ర్తిస్తాయి.
 • డెలివ‌రీ ఆప్ష‌న్ ఎంచుకుంటే అద‌నంగా డెలివ‌రీ, మేకింగ్ ఛార్జీలు కూడా ప‌డ‌తాయి.
 1. ఫోన్ పే
 • ఫోన్ పే మొబైల్ యాప్ ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. దీంతో బంగారం కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు.
 • క‌నీసం 0.001 గ్రాము నుంచి గ‌రిష్ఠంగా రోజుకు రూ. 49,999 విలువైన బంగారం తీసుకోవ‌చ్చు.
 • 99.5 శాతం స్వ‌చ్ఛ‌మైన బంగారం ల‌భిస్తుంది.
 • బంగారాన్ని నాణేలు, పెండెంట్లు రూపంలోకి మార్చుకోవ‌చ్చు. డెలివ‌రీ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. దీనికి అద‌న‌పు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
 1. మొబిక్విక్
 • మొబిక్విక్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేయ‌వ‌చ్చు.
 • ఇందులో గ‌త ఏడు వారాల నుంచి ఉన్న బంగారం ధ‌ర‌ను కూడా ట్రాక్ చేయ‌వ‌చ్చు.
 • గరిష్ఠంగా 30 గ్రాముల వ‌ర‌కు ఇందులో బంగారం కొనుగోలు చేయ‌వ‌చ్చు. కేవైసీ లేనివారు కూడా ఇందులో 15 గ్రాముల వ‌ర‌కు తీసుకొని నిల్వ చేసుకోవ‌చ్చు.
 • బంగారం విక్రయించిన త‌ర్వాత న‌గ‌దు మీ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది.
 • కొనుగోలు స‌మ‌యంలో ప్రాసెసింగ్ ఛార్జీలు ప‌డ‌తాయి.
 • 24 క్యారెట్ల స్వ‌చ్ఛ‌మైన బంగారం ఇక్క‌డ ల‌భిస్తుంది.
 • డిజిట‌ల్ రూపంలో కొనుగోలు చేసిన గోల్డ్‌ను ఫిజిక‌ల్ రూపంలోకి మార్చుకొని డెలివ‌రీ కూడా పొంద‌వ‌చ్చు.
 1. పైసా బ‌జార్
 • పైసాబ‌జార్ కూడా ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే స‌దుపాయాన్ని క‌ల్పిస్తుంది.
 • ఇందులో బంగారం తీసుకుంటే గోల్డ డ్యాష్‌బోర్డులో క‌నిపిస్తుంది.
 • రూ.100 తో కూడా పైసాబ‌జార్‌లో బంగారం కొనుగోలు చేయ‌డం ప్రాంర‌భించ‌వ‌చ్చు.
 • మీ ఖాతాలో ఉన్న బంగారం ఫిజిక‌ల్ గోల్డ్‌కు స‌మానంగా బీమా క‌లిగి ఉంటుంది.
 • బంగారం నిల్వ చేసుకునేందుకు రెండేళ్ల వ‌ర‌కు ఎలాంటి ఫీజు ఉండ‌దు. ఆ త‌ర్వాత క‌నీస ఛార్జీలు వ‌ర్తిస్తాయి.
 • ఇందులో బంగారం కొనేందుకు, అమ్మేందుకు, స్టోర్ చేసుకునేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అవ‌స‌ర‌ముండ‌దు.
 • గోల్డ్ సేవింగ్ ప్లాన్‌ను కూడా పైసాబ‌జార్ అందిస్తుంది.

డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబ‌డులు చేసేముందు ప‌రిశీలించాల్సిన అంశాలు:

 • డిజిట‌ల్ గోల్డ్ ఆఫ‌ర్ చేసే కంపెనీ వివరాలు ముందు ప‌రిశీలించాలి.
 • ప్రైజ్ ట్రాకింగ్ ఎర్ర‌ర్(ప్రస్తుత మార్కెట్ ధర కి, కంపెనీ అందించే ధర కి మధ్య వ్యత్యాసం) చెక్ చేయాలి.
 • స్టోరింగ్ ఛార్జీలు, గ‌రిష్ఠ కాల‌ప‌రిమితి వంటివి తెలుసుకోవాలి.
 • ఇత‌ర ప్రొవైడ‌ర్లు అందించే ఆఫ‌ర్ల‌ను పోల్చి చూడాలి.

చివ‌ర‌గా…

డిజిట‌ల్ గోల్డ్ అనేది చాలా సుల‌భంగా ఆన్‌లైన్‌లో బంగారంపై పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అయితే ప్రొవైడ‌ర్‌ను ఎంచుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించాలి. ఉత్ప‌త్తుల‌పై వ‌ర్తించే వివిధ ఛార్జీలు, ఫీచ‌ర్ల‌ను ప‌రిశీలించాలి. ఇత‌ర బంగారం పెట్టుబ‌డులు ర‌కాల‌ను గ‌మ‌నించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly