క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి!

క్రెడిట్ కార్డు పొందే, ఉపయోగించే , పోగొట్టుకున్న సందర్భాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం

క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి!

క్రెడిట్ కార్డు తీసుకోవడం, వాడడం సర్వ సాధారణం అయిపోయింది. ఇందులో ఎన్నో లాభ, నష్టాలు ఉంటాయి. అయితే, జాగ్రత్తగా వాడినట్టయితే నష్టాలని నివారించి లాభం పొందొచ్చు.
క్రెడిట్ కార్డు పొందే ముందు గమనించాల్సిన విషయాలు చూద్దాం.

క్రెడిట్‌ కార్డు పరిమితి:

బ్యాంకులు కొంత పరిమితితో కార్డులను మంజూరు చేస్తాయి. అవసరాలకు తగిన పరిమితి మేరకు క్రెడిట్‌ కార్డులను పొందడం మంచిది.

వడ్డీ:

క్రెడిట్‌ కార్డులకు వడ్డీ లేకుండా సొమ్ము తిరిగి చెల్లించేందుకు కొంత గడువున్నా… గడువు తర్వాత ఎంత వడ్డీ విధిస్తారో తెలుసుకొని ఉండాలి.

రుసుములు :

ప్రారంభ, వార్షిక నిర్వహణ ఛార్జీలు, ఏటీఎంలో నగదును విత్‌డ్రా చేసినప్పుడు, చెల్లింపులు ఆలశ్యం అయినపుడు రుసుములు ఎంత వరకు విధిస్తారో అడిగి తెలుసుకోవాలి. వీలయినంత వరకూ తక్కువ చార్జీలు ఉన్న కార్డును ఎంచుకోవాలి.

చెల్లింపు గడువు :

అప్పు చేసిన సొమ్మును తిరిగి చెల్లించేందుకు క్రెడిట్‌ కార్డు సంస్థలు వ‌డ్డీ ప‌డ‌కుండా కొంత‌  గడువునిస్తాయి. ఈ గడువు ఎక్కువ రోజులు ఉన్న కార్డును ఎంచుకోవడం లాభదాయకం.

కార్డు పొందాక …

 • క్రెడిట్‌ కార్డును పొందిన వెంటనే అది మనం దరఖాస్తు చేసుకున్న రకానికి చెందినదా లేదా అని పరిశీలించాలి. కార్డుతో పాటు ఇచ్చిన నియమనిబంధనల పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి.
 • కార్డు అందుకున్న వెంట‌నే దాని మీద మన పేరు స్పష్టంగా ఉందో లేదో చూసుకోవాలి.  త‌ర్వాత వెనుక వైపు సంతకం చేయాలి.
 • క్రెడిట్‌ కార్డు సంస్థలు కార్డు అందజేశాక పోస్ట్ ద్వారా సీల్డు కవర్‌లో ‘పిన్‌ నంబరు’ను పంపిస్తారు. పిన్‌ సహాయంతో క్రెడిట్‌ కార్డు నిర్వహణ జరుపుకోవచ్చు. ఈ పిన్‌ ఉపయోగించి కార్డును ఆక్టివేట్ చేసుకున్న తర్వాత వేరే పిన్‌ నెంబరును సెట్‌ చేసుకోవడం సురక్షితం.
 • పిన్‌ నెంబరును కార్డు మీదనో, మరే ఇతర చోట్ల రాసుకోవడం ప్రమాదకరం. పిన్‌ నంబరును గుర్తుపెట్టుకోవడం మేలు.

కార్డు వాడేటప్పుడు…

 • షాపులలో, హోటళ్లలో క్రెడిట్‌ కార్డును వేరే చోటికి తీసుకెళ్లి కాకుండా మన ముందే స్వైప్‌ చేయమని కోరాలి.
 • ఫోన్ నెంబర్ నమోదు చేసిఉంటే, క్రెడిట్ కార్డుల ద్వారా జ‌రిపిన లావాదేవీల స‌మాచారాన్నికంపెనీలు ఫోన్‌కు సంక్షిప్త సందేశం అందుతుంది. అలానే ఫోన్ నంబ‌రు మారిన‌ప్పుడు అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది.
 • మ‌నం చేసిన బిల్లు, కార్డు నుంచి డెబిట్ అయిన సొమ్ము ఒక‌టేనా అనే విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిచూసుకోవాలి.
 • అప‌రిచిత వ్య‌క్తులు ఫోన్‌చేసి కంపెనీ త‌ర‌పున ఫోన్ చేస్తున్నామ‌ని చెబుతూ కార్డు వివ‌రాలు అడిగితే చెప్ప‌కూడ‌దు.
 • క్రెడిట్‌ కార్డుకు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని వీలైనంత వ‌ర‌కూ ఫోన్‌ ద్వారా, మెయిల్‌ ద్వారా ఎవ‌రితోనూ పంచుకోవద్దు.
 • మీ ఖర్చుల బిల్లులు, క్రెడిట్‌ కార్డుల స్టేట్‌మెంట్లు దగ్గర ఉంచుకొని సరిచూసుకోండి. ఏవైనా తేడాలు వస్తే వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయాలి.

ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్తలు:

 • పరిమిత గడువు తర్వాత వడ్డీ  క‌ట్టాల్సి ఉంటుంది కాబట్టి క్రెడిట్‌ కార్డు బిల్లులను గడువు లోపు చెల్లించే ప్రయత్నం చేయాలి.
 • ఆన్‌లైన్‌లో షాపింగ్‌ జరిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. పిన్‌ నంబరు, ఖాతా వివరాలు అందించేటప్పుడు సురక్షితమైన మాధ్యమం ద్వారా చెల్లింపులు జరుగుతున్నదీ లేనిదీ చూసుకోవాలి.
 • వీటి కోసం కొన్ని గుర్తులు ఉంటాయి. https… తో మొదలయ్యే వెబ్‌సైట్‌ అడ్రసులు సురక్షితం. అదీకాక వెబ్‌ చిరునామా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. వెబ్‌ పేజీ చివరలో అనేక అనుబంధ సంస్థలు సదరు పేజీ సురక్షితమని తెలిపేవి ఉంటాయి.

క్రెడిట్‌ కార్డు పోతే…

 • క్రెడిట్‌ కార్డు పోతే వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేసి కార్డును బ్లాక్‌ చేయించుకోవాలి.
 • త‌దుప‌రి నగదు లావాదేవీలు జరగకుండా జాగ్రత్తపడినవారమవుతాం.
 • కార్డు పాడైపోయినట్లయితే దాన్ని ముక్కలుగా కత్తిరించి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.
 • కొత్త కార్డు జారీ అయ్యాక క్రితం బ్యాలెన్స్‌కు ఇప్పటి బ్యాలెన్స్‌లో పోలికలు చూసుకోవాలి. సరితూగకపోతే ఎక్కడో కార్డు దుర్వినియోగం అయినట్టు లెక్క.

కార్డుల సంరక్షణ:

 • కొన్ని క్రెడిట్‌ కార్డు సంస్థలు మనం తీసుకున్న క్రెడిట్‌ కార్డులపై బీమానందిస్తున్నాయి. వీటి కోసం కొంత ప్రీమియం వసూలు చేస్తారు.
 • కార్డు పోతే అందుకయ్యే ఖర్చునే కాకుండా ఒక వేళ దుర్వినియోగం అయితే కొంత పరిమితి మేరకు బీమా రక్షణ ఉంటుంది.
 • కొన్ని బ్యాంకులు ఉచితంగా ఈ సేవలను అందిస్తాయి. అలాంటి ఉచిత సేవలతో కూడిన కార్డును ఎంచుకోవడం మేలు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly