ఇంటి విలువ‌ను తిరిగి పెంచుకోండి

ఇంటిని మ‌రింతగా ఆధునీక‌రించ‌డం/తిరిగి పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా విలువ‌ను పెంచుకోవ‌చ్చు.

ఇంటి విలువ‌ను తిరిగి పెంచుకోండి

చాలా మంది ఇంటిని కొనుగోలు చేసి ఫ‌ర్నీచ‌ర్, పేయింటింగ్ వంటి వాటికి ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డి పెడ‌తారు. అయితే ఇలా ఒకేసారి కాకుండా స‌మ‌యానుగుణంగా ఆధునీక‌రించ‌డం ద్వారా ఇంటి విలువ పెంచుకోవ‌చ్చ‌ని గుర్తుంచుకోవాలి. చాలా ఇళ్ళ‌లో ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ గ‌దుల‌కు సంబంధించి పూర్తి ప‌ని చేయ‌కుండా అలానే వ‌దిలేయ‌డం మ‌నం చూస్తుంటాం, అయితే ఇంటిలో ఉన్న ప్ర‌తీ గ‌దిని పూర్తి చేయ‌డం ద్వారా ఆ ఇంటి విలువ పెరుగుతుంది.

ఇంటి విలువ పెంచండి:

ఇంటి విలువ పెరిగేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఇది రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇంటిని మ‌రింతగా ఆధునీక‌రించ‌డం/తిరిగి పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా విలువ‌ను పెంచుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు, ప్ర‌స్తుతం ఇంటిలో ఉన్న గ‌దుల‌కు అద‌నంగా మరొక కొత్త‌ గ‌దిని నిర్మించేందుకు రూ.2 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే చ‌ద‌ర‌పు అడుగులు కూడా పెరుగుతాయి, అప్పుడు ఇంటి విలువ ల‌క్ష‌ల్లో పెరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ స్థ‌లం, స్టోరేజ్ వంటివి ఇంటికి విలువ‌ను పెంచుతాయి. ఇంటి విక్ర‌యంలో వీటి ప్ర‌భావం ఉంటుంది.

మ‌రికొన్ని సంవ‌త్స‌రాలు కొత్త దానిలా:

ఒక‌సారి ఇంటి నిర్మాణం పూర్తైన త‌రువాత, మ‌ళ్ళీ దానికి స‌రైన నిర్వ‌హ‌ణ ఉండ‌దు. ఎలాంటి ఆధునీక‌ర‌ణ చేయ‌కుండా వ‌దిలేస్తారు, మ‌రి ఇంటికి విక్ర‌యించిన‌ప్పుడు ఎక్కువ విలువ రావాలంటే తిరిగి ఆ ఇంటికి పెట్టుబ‌డి పెట్టాల్సిందే. ఆస్తి విలువ‌తో పాటు, మ‌రికొన్ని సంవ‌త్స‌రాల లైఫ్ ఇవ్వాలంటే పెట్టుబ‌డులు పెట్టాలి.

ఇంటిపై రీఇన్‌వెస్ట్ చేశేవారు ఎందుకు పెట్టుబ‌డి పెడుతున్నాము అనే దానిపై స‌రైన స్ప‌ష్ట‌త ఉండాలి. విక్ర‌యించాల‌నుకుంటున్నారా? ఎక్కువ అద్దె కావాల‌నుకుంటున్నారా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలిస్తే ఇంటిని ఆధునీక‌రించేందుకు ఎంత పెట్టుబ‌డి పెట్టాలి అనే దానిపై అవ‌గాహ‌న ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి, ఒకే ర‌కంగా ఉన్న రెండు ఇళ్లు అమ్మ‌కానికి వ‌చ్చిన‌ప్పుడు, ఆధునీక‌రించిన ఇంటికి కొనుగోలుదారులు ప్రాధాన్య‌త చూపుతారు. అందుకే ఇంటిపై ఖర్చు చేసేముందు ఎందుకు చేస్తున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి. ఇంటిని అమ్మేందుకు, నివ‌సించేందుకు లేదా అద్దెకు ఇచ్చేందుకా అనేది నిర్ణ‌యించుకొని దాని ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకోవాలి.

అమ్మేందుకు పెట్టుబ‌డి:

ఇంటిని అమ్మేందుకు అయితే , ఇంటిని కొనుగోలు చేసేవారి వైపు నుంచి ఆలోచించాలి. ఇంటిని ఆధునీక‌రించేందుకు మ‌రీ ఎక్కువ‌గా ఖ‌ర్చు పెట్ట‌క‌పోవ‌డం మేలు.

అద్దెకు ఇచ్చేందుకు:

ఇళ్లు అందంగా ఉంటే అద్దెకు తీసుకునేవారు మొగ్గుచూపుతారు, దీంతో పాటు ఎక్కువ అద్దెను పెంచేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. తిరిగి కొత్త రంగులు వేయించ‌డం వంటివి చేసి ఇంటిని ఆక‌ర్ష‌ణీయంగా మార్చాలి.

నివ‌సించేందుకు:

అదే ఇంట్లో మీరు నివ‌సించాల‌నుకుంటే కొత్త‌ ఫ‌ర్నీచ‌ర్‌, పేయింటింగ్ వంటివి చేసుకోవాలి. నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు త‌క్క‌వుగా ఉండే ఎల‌క్ట్రానిక్‌ వ‌స్తువుల‌ను ఉప‌యోగించాలి. ఇంటిని ఆధునీక‌రించేందుకు కూడా రుణాలు ల‌భిస్తాయి. వీటిపై ప‌న్ను మిన‌హాయింపు కూడా ఉంటుంది. సొంత ఇళ్లు అయితే ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి రూ. 30 వేలు ఉంటుంది. అద్దె ఇంటికి ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి లేదు.

చివ‌రిగా:

ఇంటిపై తిరిగి ఖ‌ర్చు చేసే ముందు ఎందుకు చేస్తున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి. ఇంటిని అమ్మేందుకు, అద్దెకు ఇచ్చేందుకు లేదా నివ‌సించేందుకు అనేది నిర్ణ‌యించుకొని దానికి త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డి చేయాలి. ఇంటిని ఏ రకంగా మార్చాల‌నుకుంటున్నారో దానికి త‌గినట్లుగా బ‌డ్జెట్ సిద్ధం చేసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly