కోవిడ్-19 తో తిరిగి పొదుపు బాట ప‌ట్టిన భార‌తీయులు

భారతీయుల సగటు పొదుపు, ఆదాయ స్థాయిలో 32 శాతానికి త‌గ్గింది. గ‌తేడాది 38 శాతంతో పోలిస్తే 6 శాతం త‌గ్గింది

కోవిడ్-19 తో తిరిగి పొదుపు బాట ప‌ట్టిన భార‌తీయులు

కోవిడ్ -19 మహమ్మారితో చాలా మంది ఉద్యోగాలు, జీవనోపాధిని కోల్పోవ‌డ‌మే కాకుండా, వారి పొదుపును కూడా క్షీణింప‌జేసింది. ఏదైమైన‌ప్ప‌టికి ఈ మహమ్మారి పొదుపు ప్రాధాన్య‌త‌ను తిరిగి గుర్తుచేసింది. వారి ఖ‌ర్చులు, కేటాయింపుల‌ను మార్చుకునే ఆలోచ‌న‌ను క‌ల్పించింద‌ని బ్యాంక్‌బ‌జార్ చేసిన ప‌రిశోధ‌న‌లో తేలింది. సర్వే చేసిన వారిలో, 70 శాతం మంది ఊహించని ఖర్చుల కారణంగా ఎక్కువ ఆదా చేసినట్లు నివేదించారు.

నివేదికలోని కొన్ని ఇతర కీలకమైన అంశాలు…

త‌గ్గిన పొదుపు:

గత సంవత్సరం ఆర్థిక‌ మాంద్యంతో పాటు మహమ్మారి కార‌ణంగా విధించిన‌ లాక్‌డౌన్‌తో‌ ఖ‌ర్చు చేయాల‌న్నా, ఆదా చేయాల‌న్నా ప్ర‌జ‌ల చేతిలో త‌క్కువ డ‌బ్బు ఉంది. దీంతో పొదుపుపై ప్ర‌భావం ప‌డింది. దేశంలోని 5 నగరాల్లో 22- 45 సంవత్సరాల మధ్య వయస్సు గల 650 మంది వృత్తి నిపుణులతో నిర్వహించిన ఈ సంవత్సరం సర్వేలో, సగటు పొదుపులు ఆదాయ స్థాయిలో 32 శాతానికి ప‌డిపోయిది. గ‌త సంవ‌త్స‌రం ఇది 38 శాతంగా ఉంది. అందులో మ‌రీ ఎక్కువ‌గా 28-45 సంవ‌త్స‌రాల‌ మధ్య వయస్సు ఉన్నవారి ఆదాయం త‌గ్గింది. మ‌రోవైపు 22-27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారి ఆదాయం కొంత మెరుగ్గానే ఉంది. మార్కెట్ హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లలో కోత‌తో కూడా ప్ర‌జ‌ల‌ ఆదాయం త‌గ్గింది. సాధార‌ణంగా వ‌డ్డీ ఆదాయం కోసం ఎక్కువ మంది పెట్టుబ‌డుల‌పై మొగ్గుచూపుతారు, కానీ ఇప్పుడు అది కూడా త‌గ్గడం నిరాశ‌ప‌రిచింది.

ప్రాధాన్యతలలో మార్పు:

అయితే ఈ మహమ్మారితో వ‌చ్చిన‌ సానుకూల ఫలితం ఏమిటంటే, ఇది ఆర్థిక ప్రణాళిక , భద్రత ప్రాముఖ్యతను పెంచింది. చాలామంది వారి ప్రాధాన్యతల విష‌యంలో పునరాలోచించుకునేలా చేసింద‌ది. ప్రజలు దీర్ఘకాలిక ప్రణాళిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. పదవీ విరమణ, వారసత్వ ప్రణాళిక రెండింటికీ ఇచ్చిన ప్రాముఖ్యత దీనికి నిదర్శనం అని నివేదిక తెలిపింది.

మార్కెట్ హెచ్చుతగ్గులు, ఉద్యోగ అనిశ్చితులు… ప్రజలు వ్య‌క్తిగ‌తంగా లేదా కుటుంబం కోసం దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించేలా చేశాయి. లగ్జరీలు, ప్రయాణం లేదా పొదుపులు, ఆదాయం, అత్య‌వ‌స‌స‌ర ఖ‌ర్చుల‌పై విచ‌క్ష‌ణ పెరిగింది. 70 శాతం మంది అనుకోకుండా వ‌స్తున్న ఖ‌ర్చులను దృష్టిలో పెట్టుకొని పొదుపు చేసేందుకు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెల‌ప‌డం విశేషం. ఆ త‌ర్వాత‌ త‌మ జీవ‌న‌శైలిని మార్చుకోవ‌డానికి, ప‌ద‌వీవిర‌మ‌ణ కోసం ప్ర‌ణాళిక‌పై ఎక్కువ‌మంది దృష్టిపెట్టారు.

పదవీవిరమణ వాయిదా:

వడ్డీ రేట్లు తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడంతో ప‌దవీ విరమణ ప్రణాళికకు తగినంత కార్పస్ అవసరం గురించి ఎక్కువ మందిని ఆందోళనకు గురిచేస్తుంది. గత సంవత్సరం 20 శాతంతో పోలిస్తే ఇప్పుడు 25 శాతం మంది ప్రజలు రిటైర్మెంట్ కార్పస్‌గా రూ. 2 కోట్లు, అంతకంటే ఎక్కువగా నిధిని స‌మ‌కూర్చుకోవాల‌ని యోచిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

కానీ పెద్ద మొత్తం స‌మ‌కూరాలంటే అంటే ఎక్కువ కాలం ఉద్యోగంలో కొన‌సాగే దిశ‌గా ఆలోచిస్తున్నారు. త్వ‌ర‌గా 56, 57 సంవ‌త్స‌రాల‌కు విర‌మించుకుందాం అనుకునేవారు కూడా ఇప్పుడు మ‌రింత నిధిని స‌మ‌కూర్చుకోవ‌డం కోసం మ‌రో ఏడాది ఎక్కువ ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారు.

మన జీవితంలోని అనేక ఇతర అంశాల మాదిరిగానే, మహమ్మారి భారతీయులు ఆదా చేసే, పెట్టుబడి పెట్టే విధానాన్ని మార్చింది. పెద్ద సంక్షోభ‌మైనా, ఇది ప్రజల ఆర్థిక జీవితాల వాస్తవికతలను ప్ర‌తిబింబింప‌జేసింది. నిధులతో వారి ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడం, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎక్కువ డబ్బు కేటాయించడంపై దృష్టి పెట్టాలని గుర్తుచేసింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly