వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తి అలవాట్లు, ఆరోగ్య స్థితిని బట్టి బీమా అవసరాన్ని గుర్తించి తీసుకునే వ్యక్తిగత ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం.

వ్యక్తిగత ఆరోగ్య బీమా

ఆరోగ్య బీమా పాలసీని వ్యక్తి, కుటుంబ అవసరాన్ని బట్టి విడిగా ఒక్కరికే లేదా కుటుంబం మొత్తానికీ ఫామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకోవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీదారుడికి మాత్రమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది.

18 ఏళ్ల నుంచి 65ఏళ్ల వయసు ఉన్నవారెవరైనా వ్యక్తిగత ఆరోగ్య బీమా పొందేందుకు వీలుంది. పద్దెనిమిదేళ్ల లోపు వారి పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీదారుడి అవసరాన్ని బట్టి, ప్రీమియం చెల్లించగల స్థోమతను బట్టి బీమా సొమ్మును నిర్ణయించుకోవచ్చు. రూ.1లక్ష నుంచి రూ.50లక్షల వరకు పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

 • వ్యక్తి వయసు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, అలవాట్లు, నివసించే ప్రాంతాన్ని బట్టి ప్రీమియం నిర్ణయిస్తారు.

ఉదాహరణకు : బీమా తీసుకున్న వ్యక్తికి పొగతాగే అలవాటు ఉంటే ప్రీమియం అధికంగా ఉంటుంది.

 • సాధారణంగా 45 ఏళ్ల వయసు వరకూ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి కాదు. 45 ఏళ్లు పైబడిన వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే అందుకైన ఖర్చును కంపెనీ చెల్లించే అవకాశం ఉంది.

 • ఆసుపత్రిలో అయ్యే వైద్యఖర్చులు, ఆసుపత్రిలో చేరకముందు, ఆ తర్వాత డిశ్ఛార్జి అయ్యాక కలిగే సాధారణ ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది. అంబులెన్స్‌ ఛార్జీలు, అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అయిన ఖర్చులను చెల్లిస్తారు.

 • ముందే ఉన్న అనారోగ్య సమస్యలకు ( ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీసెస్‌) 3/4ఏళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న మూడు/ నాలుగేళ్ల తర్వాతే బీమా వర్తిస్తుంది.

 • నెట్‌వర్క్‌ పరిధిలో ఉండే ఆసుపత్రుల్లో నగదురహిత సదుపాయం కల్పిస్తారు లేదా హెల్త్‌ కార్డులను జారీచేస్తారు.

 • పాలసీ తీసుకున్న తర్వాత అది మనకు సరిపోదని భావించినట్లయితే 15రోజుల ఫ్రీలుక్‌ పీరియడ్‌ ఉంటుంది.

 • పాలసీదారుడు ఎలాంటి క్లెయిం చేయకపోతే నోక్లెయిం బోనస్ చెల్లిస్తారు.

 • ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్‌ 80 (డీ) కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

 • కొన్ని పాలసీలు వైద్యులతో, పోషకాహార నిపుణులతో ఆన్‌లైన్‌లో ముఖాముఖి జరిపేందుకు, వారితో మన సమస్యలను వివరించేందుకు, వారి నుంచి సలహాలు, సూచనలు పొందేందుకు ఉచిత ఏర్పాట్లు చేస్తాయి.

 • అల్లోపతి కాని వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులను చాలా బీమా కంపెనీలు చెల్లించవు.

పాలసీ తీసుకునేటప్పుడు గమనించాల్సిన విషయాలు:

 • మనకు అందుబాటులో ఉండే ఆసుపత్రులు పాలసీ నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తున్నాయా లేదా అని సరిచూసుకోవాలి.
 • ఏయే అనారోగ్య సమస్యలకు పాలసీ వర్తిస్తుంది, వేటికి వర్తించదు అనే విషయాలను తెలుసుకొని ఉండడం మంచిది.
 • ఏవైనా అనారోగ్య సమస్యలకు ఉపపరిమితులు, కో పే ఆప్షన్‌ ఉందా, ఉంటే ఎంత మేరకు ఉందో తెలుకోవాలి.
 • మధ్యవర్తి (థర్డ్‌ పార్టీ) ఫోన్‌ నం., ఇతర వివరాలు తెలుసుకొని ఉండాలి.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు గమనించాల్సిన విషయాలు

పాలసీ పునరుద్ధరించుకునేందుకు వ్యక్తి గరిష్ఠ వయోపరిమితి:

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేముందు వ్యక్తి గరిష్ఠ వయోపరిమితిని చూసుకోవడం మంచిది ఎందుకంటే ఆరోగ్య సమస్యలనేవి వయసుతో పాటు ఎక్కువవుతాయి. కాబట్టి ఆరోగ్య బీమా పెద్ద వయసువారికి ఎక్కువగా అవసరమవుతుంది. పైగా పెద్ద వయసు వారికి కొత్త ఆరోగ్య బీమా పాలసీలు కొనుగోలు చేసేందుకు ప్రీమియం అధికంగా ఉంటుంది. మనం తీసుకునే పాలసీకి గరిష్ఠ వయోపరిమితి అధికంగా ఉంటే మంచిది.

ఆరోగ్య బీమా పరిధి నుంచి తొలగించిన వ్యాధులు:

ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే వ్యాధులు, రానివాటిని తెలుసుకొని ఉండడం మంచిది. తీరా క్లెయిం చేసుకునే సమయానికి వ్యాధి పాలసీ పరిధిలోకి రాదని తెలిస్తే నిర్ఘాంతపోవాల్సి ఉంటుంది.

కో పే (పాల‌సీదారుడు, బీమా కంపెనీ క‌లిసి ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డం)

బీమాదారుడు, బీమాకంపెనీ కలిసి ఆసుపత్రి ఖర్చులు, ఇతర వైద్య ఖర్చులు భరిస్తాయి. ఉదాహరణకు 80:20 నిష్పత్తిలో పద్ధతిలో పాలసీ తీసుకున్నట్టయితే రూ.లక్ష వైద్య ఖర్చులకు బీమా కంపెనీ రూ.80వేలు భరిస్తుంది. బీమాదారుడు రూ.20వేలు భరించాల్సి ఉంటుంది. బీమా పాలసీ తీసుకునేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీమా కంపెనీ ఎంత శాతం భరిస్తుంది. మన చేతి నుంచి ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందో తెలుసుకోవడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly