బీమా పాల‌సీలు ఎన్ని ర‌కాలు, వాటి ప్ర‌యోజనాలేంటీ?

బీమా పాలసీలు ఎన్ని ర‌కాలు, వాటి ప్ర‌యోజ‌నాల గురించి ఈ క‌థ‌నంలో వివ‌రంగా తెలుసుకుందాం.

బీమా పాల‌సీలు ఎన్ని ర‌కాలు, వాటి ప్ర‌యోజనాలేంటీ?

ప్ర‌స్తుతం మారుతున్న సామాజిక, ఆర్థిక ప‌రిస్థితుల‌లో బీమా తీసుకోవ‌డం ఒక త‌ప్ప‌నిస‌రిగా అంశంగా మారింది. మ‌రి బీమా పాల‌సీలు ఎన్ని ర‌కాలు. అవి క‌ల్పించే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసుకుందామా.

 1. టర్మ్‌ పాలసీ

ఒక వ్యక్తికి అనుకోకుండా ఏదైనా జరిగితే పాలసీ పరిధిలోపు అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉద్దేశించిందే టర్మ్‌ పాలసీ.

పాలసీ తీసుకోవడానికి కావాల్సిన పత్రాలు:

 • పాన్‌ కార్డు నకలు
 • ఆదాయధ్రువీకరణ : వేతన ఉద్యోగులైతే శాలరీ స్లిప్పులు
 • ఇతరులు - గత మూడేళ్ల ఆదాయ పన్ను రిటర్న్సు పత్రం
 • చిరునామా గుర్తింపు
 • పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో

క్లెయిం విధివిధానాలు:
క్లెయిం చేసుకునే సందర్భం వచ్చినప్పుడు మరణం సంభవిస్తే సమర్పించాల్సిన పత్రాలు ఒక విధంగా, ప్రమాద వైకల్యమయితే మరో విధంగా ఉంటాయి.

మరణం సంభవించినప్పుడు:

 1. మరణ ధ్రువీకరణ పత్రం
 2. ఒరిజినల్‌ పాలసీ బాండ్‌
 3. క్లెయింకు సంబంధించి కంపెనీ అందించే పత్రాలు, తదితరాలు

ప్రమాదం వల్ల అంగవైకల్యం, తీవ్ర అనారోగ్యం సంభవించినప్పుడు:

 1. మెడికల్‌ రికార్డ్స్‌, వైద్యుల నివేదికలు, డిశ్చార్జి సమ్మరీ, ఆసుపత్రిలో చేరినట్లుగా ఉండే రికార్డులు, ల్యాబ్‌ పరీక్షల నివేదికలు
 2. ఒరిజినల్‌ పాలసీ బాండ్‌
 3. క్లెయింకు సంబంధించి కంపెనీ అందించే పత్రాలు, తదితరాలు

ఈ విధంగా పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవడంతో పాటు ప్రమాదం, మరణం సంభవించినప్పుడు సాధ్యమైనంత త్వరగా బీమా సంస్థకు సమాచారం అందించాలి.

సాధారణ బీమాకు సంబంధించి అన్నింటికన్నా తక్కువ ధరకు లభించే పాలసీ టర్మ్‌ పాలసీ. ఆఫ్‌లైన్‌లో అయితే బీమా మధ్యవర్తి ద్వారా, లేదా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ల ద్వారా పాలసీ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయవచ్చు.

 1. ఎండోమెంట్‌ పాలసీ

బీమా హామీతో పాటు పెట్టుబడి మార్గంగా ఉపయోగపడేదే ఎండోమెంట్‌ పాలసీ.
ఈ రకమైన పాలసీలు 7 ఏళ్ల నుంచి మొదలుకొని 30 ఏళ్ల కాలపరిమితి వరకూ ఉన్నాయి.

ఎండోమెంట్‌ పాలసీ తీసుకోవడానికి అవసరమయ్యే పత్రాలు:

 1. దరఖాస్తు ఫారం
 2. చిరునామా గుర్తింపు
 3. వయసు ధ్రువీకరణ పత్రం
 4. వైద్య పరీక్షల నివేదికలు (బీమా సంస్థను బట్టి)

ఎండోమెంట్‌ పాలసీ లక్షణాలు:

 1. టర్మ్‌ పాలసీలతో పోల్చి చూస్తే బీమా హామీ మొత్తం తక్కువగా ఉంటుంది.
 2. పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు
 3. పాలసీదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే నామినీలకు ఆర్థిక రక్షణ ఉంటుంది.
 4. పాలసీతో పాటు వివిధ రైడర్లు అందుబాటులో ఉంటాయి.

సరైన ఆర్థిక ప్రణాళిక లేని నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం చివర్లో ఎక్కువమంది ఎండోమెంట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకుంటున్నారు.
బీమా రక్షణతో పాటు అదనపు పెట్టుబడి ప్రయోజనాలు ఆశించేవారికి ఎండోమెంట్‌ పాలసీ సూచనీయం.

 1. మనీ బ్యాక్‌ పాలసీ

పాలసీదారుడికి క్రమానుగతంగా డబ్బును చెల్లిస్తూ బీమా కల్పించడం మనీబ్యాక్‌ పాలసీ ఉద్దేశం. కుటుంబ అవసరాల కోసం నిర్ణీత కాలవ్యవధిలో డబ్బు కావాలనుకునేవారికి ఈ పాలసీ తగినదిగా చెప్పుకోవచ్చు. 13 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారి వరకూ మనీ బ్యాక్‌ పాలసీలు తీసుకునే వీలుంది. 7 సంవత్సరాలు మొదలుకొని 25 సంవత్సరాల కాలపరిమితి ఉన్న పాలసీలను బీమా సంస్థలు అందిస్తున్నాయి.

మనీ బ్యాక్‌ పాలసీ లక్షణాలు:

 • పిల్లల చదువులు, వివాహ అవసరాలు, ఇంటి కొనుగోలు, కారు రుణం ప్రీమియంల చెల్లింపు దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీలను తీసుకోవచ్చు.
 • ప్రీమియం నెలకు లేదా మూడునెలలకు లేదా ఆరునెలలకు ఒకసారి చెల్లించే సదుపాయం ఉంది.
 • పాలసీదారుడు ఆకస్మికంగా మృతిచెందితే, అప్పటివరకూ చెల్లించిన మొత్తాన్ని మినహాయించకుండా బీమా హామీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.
 • పాలసీ కాలపరిమితిని ఆధారంగా ఒక సంవత్సరం గడిచిన తర్వాత పాలసీపై రుణ సదుపాయాన్ని పొందవచ్చు.
 • ఈ పాలసీలపై లభించే రైడర్ల కారణంగా బీమా హామీ మొత్తం తగిన విధంగా పెంచుకోవచ్చు.

మనీబ్యాక్‌ పాలసీ ప్రయోజనాలు:

 • మన అవసరాలకు అనుగుణంగా పాలసీ కాలపరిమితి ఉన్న పాలసీలను ఎంచుకోవచ్చు. అదేవిధంగా క్రమానుగతంగా తిరిగి సొమ్మును పొందే పరిమితిని నిర్ణయించుకునే సదుపాయం ఉండటం వినియోగదారుడి కుటుంబ ఆర్థిక నిర్వహణకు తోడ్పడుతుంది.

 • రైడర్ల వల్ల కావాల్సిన బీమా కవరేజీని, రిస్క్‌ కవరేజీని అదనంగా జోడించుకోవచ్చు. అప్పుడు కుటుంబ ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు పూర్తి బీమా భరోసా ఉంటుంది.

 • కొన్ని బీమా సంస్థలు పాలసీదారుడు మరణించినప్పుడు ఇదివరకూ చెల్లించిన మొత్తాన్ని లెక్కలోకి తీసుకోకుండా మెచ్యూరిటీ ప్రయోజనాలను అందజేస్తాయి.

 • పాలసీదారుడు మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా, మనీబ్యాక్‌ పాలసీలు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తాయి.

 1. యాన్యుటీ పాలసీలు

పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన నిధిని సమకూర్చుకునేందుకు రూపొందించిన పాలసీలను రిటైర్‌మెంట్‌ పెన్షన్‌ పాలసీలు(యాన్యుటీ ప్లాన్స్‌) అంటారు.

 • కనిష్ఠ వయసు 18 ఏళ్లు మొదలుకొని 80 ఏళ్ల వయసు ఉండేవారి అవసరాలకు అనుగుణంగా బీమా సంస్థలు ఈ రకమైన పాలసీలను రూపొందిస్తున్నాయి.
 • రూ. 25000 మొదలుకొని రూ. 50,00,000 వరకూ బీమా హామీ మొత్తం ఉన్న పాలసీలు ఉన్నాయి. మన ఆర్థిక స్థితిగతుల ఆధారంగా పాలసీని ఎంచుకోవాలి.
 • నెలవారీ ప్రీమియం చెల్లించే పాలసీలను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా పెద్ద భారం లేకుండా పాలసీని కొనసాగించవచ్చు.
 • ఎంచుకున్న కాలపరిమితి లోపు పాలసీదారుడు మరణిస్తే, మిగిలిన కాలానికి నామినీకి పింఛను వస్తుంది.
 • ఆదాయపు పన్ను చట్టాన్ని అనుసరించి పన్ను మినహాయింపులు ఉంటాయి.

పాలసీదారులు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలంటే యాన్యుటీ పాలసీలు ఒక మార్గంగా ఉపయోగపడతాయి. ఇప్పటికే ఎన్‌పీఎస్‌లో లేదా పీపీఎఫ్‌లో పొదుపు చేసే వారికి యాన్యుటీ పాలసీలు సూచనీయం కాదు.

 1. పిల్లల బీమా పాలసీలు

ద్రవ్యోల్బణం దృష్ట్యా ఇప్పుడు ఉన్నత విద్యకోసం అయ్యే ఖర్చులు మరో 20 ఏళ్లలో రెట్టింపు కావచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మొదటి నుంచే ప్రణాళికలు వేసుకుంటేనే దీర్ఘకాలంలో ఆర్థిక జీవితం సాఫీగా సాగుతుంది.
ఇందుకోసం బీమా కంపెనీలు పిల్లల బీమా పాలసీలను రూపొందిస్తున్నాయి.

పాలసీల ఎంపిక ముందు గమనించాల్సిన విషయాలు:

 1. పిల్లల ఉన్నత విద్య, వివాహ అవసరాలను గుర్తించి అందుకు అవసరమయ్యే మొత్తం ఎంతో లెక్కించుకోవాలి.
 2. దీర్ఘకాలిక లక్ష్యాలు కాకుండా, 5 నుంచి 8 ఏళ్ల లోపు కాలపరిమితి కలిగిన పాలసీ తీసుకోవాలనుకుంటే ఎండోమెంట్‌ పాలసీని ఎంచుకోవడం మంచిది.
 3. 10 ఏళ్ల పైబడిన లక్ష్యాలు కలిగి పెట్టుబడి అంశాన్ని ప్రధానంగా ఆలోచించేవారు యులిప్స్‌ను ప్రయత్నించవచ్చు.
 4. పేరుకు పిల్లల బీమా పాలసీలే అయినా ఇవి పెద్దల పేరు మీదే ఉంటాయి.

పిల్లల బీమా పాలసీ ప్రయోజనాలు:

ఆకస్మికంగా పాలసీదారుకు ఏమైనా జరిగితే -

 • లబ్ధిదారుకు(పిల్లలకు) బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు
 • భవిష్యత్తులో ఎలాంటి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు
 • పాలసీ మెచ్యూర్‌ అయిన వెంటనే బీమా హామీ మొత్తంతో పాటు అదనపు ప్రయోజనాలను అందిస్తారు
 • ఆదాయపు పన్ను చట్టాన్ని అనుసరించి పన్ను మినహాయింపులు ఉంటాయి.
 • చాలా సంస్థలు వైద్య పరీక్షలు అవసరం లేకుండానే, ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతోనే పాలసీని అందిస్తున్నాయి.
 • పిల్లల బీమా పాలసీలపై రుణాన్ని పొందే సదుపాయం ఉంది.

పాలసీదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే, ఆ తర్వాతి ప్రీమియంలను రద్దు చేసే పాలసీలను ఎంచుకోవడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly