ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం తీసుకునే ఈపీఎఫ్ వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుందా?

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఈపీఎఫ్ ఖాతాల‌పై 8.65 శాతం వ‌డ్డీ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం తీసుకునే ఈపీఎఫ్ వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుందా?

పదవీ విరమణ ప్రయోజనం కోసం ఉద్యోగి భవిష్య నిధి ఉత్తమమైన పొదుపు పథకంగా చెప్ప‌వ‌చ్చు. ఇందులో నష్ట భయం ఉండ‌దు. హామీతో కూడిన రిటర్నుల‌ను అందిస్తుంది. ఆదాయ పన్నుచట్టం, సెక్షన్ 80సీ కింద ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలను ప్రభుత్వం నడుపుతుండగా, నిర్వహణ బాధ్యతలను మాత్రం ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చూసుకుంటుంది.
ఈపీఎఫ్ చట్టం కింద, ఒక ఉద్యోగి తన వేత‌నంలో 12 శాతాన్ని ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేయాలి. అదే విధంగా ఉద్యోగి ప‌నిచేసే సంస్థ కూడా ఉద్యోగి చెల్లించిన మొత్తానికి స‌మానమైన మొత్తాన్ని ఉద్యోగి ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్(ఈపీఎఫ్ఓ) ప్ర‌తీ సంవ‌త్స‌రం నిర్ణ‌యించిన ప్ర‌కారం వ‌డ్డీ కాంపౌండ్ చేస్తుంది. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి 8.65 శాతం వ‌డ్డీ ఇచ్చే విధంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యంతీసుకుంది. ఇత‌ర స్థిర రాబ‌డినిచ్చే పెట్టుబ‌డి సాధ‌నాల‌తో పోలిస్తే ఈపీఎఫ్ అధిక శాతం వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుంది. ఆదాయ పన్ను చట్టం1961, సెక్షన్ 80సీ కింద ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తంపై రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఐదు సంవ‌త్స‌రాల త‌రువాత‌ మాత్ర‌మే వ‌డ్డీపై మిన‌హాయింపు ల‌భిస్తుంది. రిటైర్‌మెంట్ వ‌ర‌కు ఈపీఎఫ్ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తే, ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యానికి వ‌చ్చే మొత్తంపై పూర్తి మిన‌హాయింపు ఉంటుంది. మ‌రి ప‌దివీ విర‌మ‌ణ అనంత‌రం ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోకపోతే ఆ మొత్తం వ‌డ్డీ ల‌భిస్తుందా? వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుందా? త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

ప‌ద‌వీవిర‌మ‌ణ త‌రువాత ఈపీఎఫ్‌పై వ‌డ్డీ:

పదవీ విరమణ చేసినా లేదా ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంత‌రం కూడా పలువురు ఉద్యోగులు వారి ఈపీఎఫ్ ఖాతాలను కొనసాగించి, దానిపై వడ్డీని పొందుతున్నారు. మ‌రికొంద‌రు ఈపీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవ‌డంలో ఆల‌స్యం చేస్తుంటారు. ఇందుకు వారికి అనేక కార‌ణాలు ఉండొచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు త‌మ ఖాతాలోని ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై భాద్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం కోసం, ప్ర‌త్యేకించి ఈపీఎఫ్ కాంట్రీబ్యూష‌న్ల‌ను నిలిపివేసిన వారికి, 2011 నుంచి 3 సంవ‌త్స‌రాలు లేదా 36 నెల‌లు ఖాతా నిర్వ‌హించ‌ని వారికీ వ‌డ్డీ చెల్లించ‌డం నిలిపివేసింది. అయితే 2016లో ఈ నియ‌మాన్ని స‌వ‌రిస్తూ నిర్వ‌హ‌ణలో లేని ఖాతాల‌కు సంబంధించి ఖాతాదారునికి 58 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు ఖాతాలో ఉన్న మొత్తంపై వ‌డ్డీ చెల్లిస్తుంది. అయితే ఖాతాదారుడు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై వ‌డ్డీ చెల్లించ‌దు.

ఈ విష‌యం గురించి కొన్నేళ్ళ క్రితం దిలీప్ రంజేక‌ర్ అనే ఉద్యోగి బెంగుళూరు ట్రిబ్యూన‌ల్ అప్పిలేట్‌లో కేసు న‌మోదుచేశారు. అత‌ను విప్రో లిమిటెడ్ ఉద్యోగి. ప‌ద‌వీవిర‌మ‌ణ త‌రువాత 9 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఈపీఎఫ్ నిధిని ఉప‌సంహ‌రించుకోలేదు. ఈపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంద‌ని భావించి రంజేక‌ర్ త‌న ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌లో ఈ వివ‌రాలు తెలియ‌జేయ‌లేదు, అత‌ను ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకున్న సంవ‌త్స‌రం ఎటువంటి ప‌న్ను చెల్లించ‌లేదు.

అయితే ఈ విష‌య‌మై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ నుంచి అత‌నికి నోటీసుల అందిన నేప‌ధ్యంలో ఆదాయ‌పు ప‌న్ను క‌మీష‌న్‌కు వ్య‌తిరేకంగా బెంగళూరులోని ఆదాయపు-పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్ర‌యించాడు. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందు సేక‌రించిన నిధిపై వ‌చ్చిన వ‌డ్డీకి(ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత విత్‌డ్రా చేసుకున్నా, చేసుకోక‌పోయినా) ఎటువంటి ప‌న్ను వ‌ర్తించ‌దు. అయితే ఒక‌వేళ ప‌ద‌వీవిర‌మ‌ణ త‌రువాత కూడా నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోక‌పోతే ఆ మొత్తంపై వ‌చ్చే వ‌డ్డీకి పన్ను చెల్లించాల్సిందేనని ఆదాయపు-పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పు విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే కాకుండా, వివిధ కారణాల వల్ల ఉద్యోగాన్ని విడిచిపెట్టినవారికి వర్తిస్తుంది. ఎందుకంటే ఒక వ్య‌క్తి త‌న ఉద్యోగాన్ని వ‌దిలేసినా, లేదా ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన అత‌డిని ఉద్యోగి కింద ప‌ర‌గ‌ణించ‌రు. అందువ‌ల్ల అటువంటి వారికి వ‌చ్చే అన్ని వ‌డ్డీల‌పై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly