మదుపుతో ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వ్

మనం ఆర్ధికంగా స్థిరంగా ఉంటే.. కుటుంబానికి అండగా , ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం

మదుపుతో  ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వ్

సమస్య. సమస్య లేని వ్యక్తి లేరు. ప్రతి వారికి ఎదో ఒక సమస్య. అయితే ఒకరికి పెద్ద సమస్య, మరొకరికి చిన్నదిగా ఉంటుంది. ఈ సమస్య వ్యక్తిగతం కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఆర్ధికంగా కావచ్చు. ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సమస్యకి ఒకటి లేదా అనేక సమాధానాలు ఉంటాయి. ముందుగా వాటిని ఆలోచించాలి , విశ్లేషించుకోవాలి, గ్రహించి పరిష్కారం వైపు అడుగులు వేయాలి. కొన్ని వెంటనే సమసి పోతాయి. కొన్ని కొంత సమయం తీసుకుంటాయి. అందుకే మన పెద్దలు అంటారు ’ కష్టాలు కలకాలం ఉండవని.

ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నవారు, ఉన్నత పదవులలో ఉన్నవారు కూడా ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి వచ్చిన వారే. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు . ప్రతి సమస్యని ఎదుర్కొని, పరిష్కరించుకుంటూ వెళ్లారు. ఇప్పుడు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగని ఇప్పుడు కష్టాలు లేవా అనికాదు. వయసుతో వచ్చిన అనుభవం, సమస్యని పరిష్కరించగలను అనే నమ్మకం వారిని నిలబెడుతున్నాయి.

ఎంతో మంది యువతీ యువకులు ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి , ఓర్పుతో, ధైర్యసాహసాలతో తాము కన్న కలలను నిజం చేసుకోవడంలో చూపిన ఆత్మ స్తైర్యం ఎంతో అబ్బురపరుస్తుంది. చాలా సమస్యలలో కనిపించేది ఆర్ధిక సమస్య. భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆందోళన. ఇది ఒక రకంగా అనవసరమైనది . ఎందుకంటే , భవిష్యతులో ఏం జరగబోతోందోనని ఊహించుకుంటూ, వర్తమానంలో చేయాల్సిన ఆలోచనను వదిలివేస్తాము.

మనం ఆర్ధికంగా స్థిరంగా ఉంటే, కుటుంబానికి అండగా , ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం. ముఖ్యంగా పిల్లలకు చదువులు చెప్పించగలిగితే వారికి మంచి భవిష్యత్తును ఇచ్చిన వారు అవుతారు. వారు సంపాదనపై వారు నిలబడడమే కాక, మీకు అండగా ఉండగలుగుతారు. చదువుకునే వయసులో వారికి కావలసిన ఇల్లు ,తిండి, బట్ట, విద్యా ఖర్చులకు ఏర్పాటుచేయగలిగితే వారు చదువుపై ధ్యాసతో ఉంటారు.

పిల్లల చదువులు అంటే కనీసం పట్టభద్రత పొందాలంటే , ఐదవ ఏట ప్రారంభించిన చదువును మరో 15 ఏళ్ల పాటు కొనసాగించే ఏర్పాట్లు చేయాలి. అంటే వాళ్లకి 20 ఏళ్ల వయసు వచ్చే వరకు పట్టభద్రత పొందగలుగుతారు . దీనికి నిరంతరం డబ్బు సదుపాయం ఏర్పాటుచేసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. పొదుపు సామర్ధ్యం తగ్గుతుంది. దీనిని అధిగమించాలంటే , యుక్త వయసు నుంచే అధిక మొత్తంలో మదుపు చేయాలి. ఉద్యోగం వచ్చిన కొత్తలో ఎక్కువ బరువు బాధ్యతలు ఉండవు కాబట్టి అధిక మొత్తం ఖర్చు చేస్తాము. వివాహం అయిన కొత్తలో ఇంటికి కావలసిన వస్తువులను సమకూర్చుకోవడం కోసం అదనపు ఖర్చులు అవుతాయి. ఆ తరువాత పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది.

ముందుగా నెలవారీ బడ్జెట్ వేసుకుని, అనవసరపు ఖర్చులను నివారించి , ఆ సొమ్ము కూడా మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో పైన చెప్పిన ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఆన్లైన్ అమ్మకాలు , క్రెడిట్ కార్డు, డిస్కౌంట్ ఆఫర్లు, ఫ్రీ- గిఫ్ట్స్ వంటి వాటి వలన అనవసర వస్తు సేవల కోసం ఖర్చు చేస్తున్నాము. వీటి నుంచి ఎంత త్వరగా బయటపడి , మదుపు మొదలు పెడితే అంత మంచిది. ద్రవ్యోల్బణం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాన్ని మరువకూడదు. మదుపు చేసేందుకు అనేక మార్గాలున్నాయి. మనసుండాలంతే .
మరింకెందుకు ఆలస్యం. నేడే బడ్జెట్ వేయండి. మదుపు మొదలు పెట్టండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly