సుల‌భంగా ప్ర‌భుత్వ బాండ్ల‌లో పెట్టుబ‌డి

ప్ర‌భుత్వ సెక్యురిటీలు (గ‌వ‌ర్న‌మెంట్ సెక్యూరిటీస్) ని జీ- సెక్ అని సంక్షిప్తంగా పిలుస్తారు.

సుల‌భంగా ప్ర‌భుత్వ బాండ్ల‌లో పెట్టుబ‌డి

రిజ‌ర్వు బ్యాంకు 2001 లోనే నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో రిటైల్ మ‌దుప‌ర్లకు బాండ్ల‌ను అందుబాటులోకి తెచ్చినా వాటికి అంత ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. వీటిలో మ‌దుపు చేసేందుకు ఉండే ప్ర‌క్రియ కొంత క్లిష్టంగా ఉండ‌ట‌మే కార‌ణం. ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంకులు రిటైల్ మ‌దుప‌ర్ల‌కు ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌ను చేరువ చేద్దామ‌ని చేప‌ట్టిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేద‌ని చెప్పాలి. అయితే, గ‌త నెల‌లో జీరోదా క‌నీస పెట్టుబ‌డి రూ.10,000 తో రిటైల్ మ‌దుప‌ర్లు బాండ్ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు వీలుగా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ను ప్ర‌వేశ‌పెట్టింది. గ‌త వారంలోనే ఎన్ఎస్ఈ గోబిడ్ ఆన్ లైన్ ద్వారా రిటైల్ మ‌దుప‌ర్లు ప్ర‌భుత్వ సెక్యూరిటీల క్ర‌య‌విక్ర‌యాలు చేసేందుకు యాప్ ను తీసుకొచ్చింది. రిటైల్ మ‌దుప‌ర్లు అంత‌గా ఆద‌ర‌ణ చూపించ‌ని ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌ను వారికి చేరువ చేసేందుకు సంస్థ‌లు ఆస‌క్తి చూప‌డం భ‌విష్య‌త్తులో వీటి మార్కెట్ పెరుగుతుంద‌ని భావించ‌వచ్చు.

ప్ర‌భుత్వ సెక్యురిటీలు (గ‌వ‌ర్న‌మెంట్ సెక్యూరిటీస్) ని జీ- సెక్ అని సంక్షిప్తంగా పిలుస్తారు. వీటిలో స్వ‌ల్ప‌,దీర్ఘ‌కాలిక కాల‌ప‌రిమితికి ప్ర‌భుత్వ సెక్యూరిటీలు ఉంటాయి. స్వ‌ల్ప‌కాలానికి ఉండే వాటిని ట్రెజ‌రీ బిల్లులు, దీర్ఘ‌కాలికానికి ఉండే వాటిని ప్ర‌భుత్వ బాండ్లు అంటారు. ప్ర‌భుత్వ సెక్యురిటీల పై వ‌చ్చే వ‌డ్డీని కూప‌న్ అంటారు. వీటిలో ఆరు నెల‌లు, సంవ‌త్స‌రానికి ఒక సారి కూప‌న్ అందుతుంది. కూపన్ అంటే బాండ్ కొనుగోలు చేసిన వ్య‌క్తికి వ‌చ్చే రాబ‌డి. వీటిలో జీరో కూప‌న్ బాండ్లు కూడా ఉంటాయి. అంటే వాటికి మ‌ధ్య‌లో ఎటువంటి కూప‌న్ లు ఉండ‌వు. నేరుగా మెచ్యూరిటీ ముగిసే స‌మ‌యానికి వ‌డ్డీ అస‌లు క‌లిపి చెల్లిస్తారు. అందుకే వీటిని జీరో కూప‌న్ బాండ్లు అంటారు.

కార్పోరేటు బాండ్ల‌లో రిటైల్ మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేయ‌డం కొత్త విష‌యం కాదు. ప్రభుత్వ సెక్యురిటీల‌లో పెట్టుబ‌డి చేయ‌డం మాత్రం రిటైల్ మ‌దుప‌ర్ల‌కు కాస్త క‌ష్ట‌మైన ప‌నిగానే ఉంటుంది. వీటిలో ఎక్కువగా సంస్థాగ‌త మ‌దుప‌ర్లు మాత్ర‌మే పెట్టుబ‌డులు చేస్తుంటారు. రిజ‌ర్వు బ్యాంకు 2017 లో రిటైల్ మ‌దుప‌ర్లు ప్ర‌భుత్వ బాండ్ల‌ను కొనుగోలుచేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్టాక్ ఎక్స్ఛేంజీల‌కు ఆదేశాలు జారీచేసింది. బాండ్లను కొనుగోలు చేయ‌డం క్లిష్ట‌మైన ప‌నిగా భావించ‌న‌వ‌స‌రం లేదు. సాధార‌ణంగా ఇనీషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్ ద్వారా షేర్ల‌ను కొనుగోలు చేసిన‌ట్టే ప్ర‌క్రియ ఉంటుంది. రిటైల్ మ‌దుప‌ర్లు ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌ను కొనేందుకు ముందుగా ఆన్ లైన్ ద్వారా బిడ్ వేయాలి. అనంత‌రం బిడ్డింగ్ ముగిసిన త‌రువాత వారికి బాండ్లు కేటాయింపు జ‌రుగుతుంది. వాటిలో వ‌చ్చే కూప‌న్, మెచ్యూరిటీ త‌దిత‌ర వివ‌రాలు తెలుసుకోవాలి.

ప్ర‌స్తుతం బాండ్ల‌తో వ‌చ్చే స‌మ‌స్య ఏంటంటే, మెచ్యూరిటీ తీర‌క ముందు డ‌బ్బు కావాలంటే సెకండ‌రీ మార్కెట్ లో ఎక్స్ఛేంజ్ ద్వారా విక్ర‌యించొచ్చు. కానీ వీటికి లిక్విడిటీ త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో బాండ్ ముఖ విలువ కంటే త‌క్కువ రేటుకు అమ్మాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డొచ్చు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా సెకండ‌రీ మార్కెట్ లో విక్ర‌యాలు చేసేట‌పుడు మార్కెట్ మేకింగ్ విధానంలో త‌మ ఖాతాదారుల‌కు చెందిన బాండ్ల‌ను కొనుగోలు చేయాల‌ని జీరోదా సీఈఓ నితిన్ కామ‌త్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం జీరోదా త‌మ ఖాతాదారుల‌కు ఈ సేవ‌లు అందిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌భుత్వ సెక్యూరిటీలలో ఎటువంటి న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. రిటైల్, హెచ్ఎన్ఐ మ‌దుప‌ర్ల‌కు దీర్ఘ‌కాలంలో మంచి పెట్టుబ‌డిగా వీటిని చెప్పొచ్చు. 3 నుంచి 5 ఏళ్ల‌కు ఫిక్సిడ్ డిపాజిట్లు అనుకూలంగా ఉంటాయి. అంత‌కంటే ఎక్కువ కాల‌ప‌రిమితికి మ‌దుపు చేయాలంటే ప్ర‌భుత్వ బాండ్లు మంచి ఎంపిక . వీటిలో గ‌రిష్టంగా 30 సంవ‌త్సరాల కాల‌ప‌రిమితికి బాండ్లు అందుబాటులో ఉంటాయి. స్వ‌ల్ప‌కాలానికి కూడా ప్ర‌భుత్వ సెక్యురిటీలు అందుబాటులో ఉంటాయి. 3-6 నెల‌ల స్వ‌ల్ప‌ కాల‌ప‌రిమితుల‌కు పెట్టుబ‌డి చేసేందుకు 91రోజులు, 181 రోజుల ట్రెజ‌రీ బిల్లుల‌ను ఎంచుకోవ‌చ్చు

జీరోదా , ఎన్ఎస్ఈ ప్లాట్ ఫామ్ ల ద్వారా పెట్టుబ‌డులు చేసేందుకు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ సుల‌భంగా ఉంటుంది. డీమ్యాట్ ఖాతా క‌లిగి ఉంటే నేరుగా ఆన్ లైన్ కొనుగోలు చేసి డీమ్యాట్ ఖాతాలో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. వీటిలో ఛార్జీలు కూడా త‌క్కువ‌గా నే ఉంటాయి. జీరోదా రూ. 10000 కు రూ.6 ఛార్జీలు తీసుకుంటున్నాయి. ఎన్ఎస్ఈ లో అయితే ఎటువంటి ఛార్జీలు ఉండ‌వు. డీమ్యాట్ ఛార్జీలు మాత్రం ఉంటాయి. ఎన్ఎస్ఈ గోబిడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు మ‌దుప‌ర్లు త‌మ బ్రోక‌ర్లను సంప్ర‌దించాలి. దీంతో పాటు పాన్, వ్య‌క్తిగ‌త వివ‌రాలు తెల‌పాలి

మ్యూచువల్ ఫండ్ మార్గం: మీరు జీ-సెక్ లేదా గిల్ట్ ఫండ్ల ద్వారా కూడా మ‌దుపు చేయోచ్చు.ఎంత కాలంపాటు కొన‌సాగాల‌నే విష‌యం స్ప‌ష్ట‌త లేన‌డుడు మ్యూచువ‌ల్ ఫండ్ల మార్గం ఎంచుకోవ‌చ్చు. లిక్విడిటీ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఫండ్ వేర్వేరు మెచ్యూరిటీలతో ఉన్న బాండ్ల‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

ఉదాహరణకు, 10-సంవత్సరాల 30-సంవత్సరాల కాల‌ప‌రిమితిలో ఒకే ఫండ్ ద్వారా పెట్టుబడి చేయ‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్లు ప్రతిరోజు ఎన్ఎవిని డిక్లేర్ చేస్తుంటాయి. కాబట్టి రోజువారీ విలువలో చాలా హెచ్చుతగ్గులు ఉండొచ్చు దీర్ఘ-కాలికంలో ప్రభావం లేక‌పోయినా ధ‌ర హెచ్చుత‌గ్గుల ద్వారా ఆందోళ‌న ఉంటే నేరుగా బాండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచి ఎంపిక. ఛార్జీల వారీగా చూసినా ప్ర‌త్య‌క్ష విధానం మంచిది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly