పిల్ల‌ల పేరుతో పెట్టుబ‌డులకు ఏ ప‌థ‌కాలు మంచివి?

ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు మొదలు పెడితే కొంత అవగాహన తోపాటు అలవాటు అవుతుంది.

పిల్ల‌ల పేరుతో పెట్టుబ‌డులకు ఏ ప‌థ‌కాలు మంచివి?

ప్ర‌శ్న‌: హాయ్ సిరి, నేను ఒక నిర్మాణ సంస్థలో అసిస్టెంట్ అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. నా వార్షిక ఆదాయం రూ 6 లక్షలు. మా అబ్బాయి కి రెండు సంవత్సరాలు. బాబు భవిష్యత్తుకు నెలకి రూ 3 వేలు పీ పీ ఎఫ్ ఖాతాలు జమ చేస్తున్నాను. బాబు ప్రతి పుట్టిన రోజున‌ రూ. 50 వేలు మదుపు చేద్దామనుకుంటున్నాను. పిల్లల ప్లాన్ల గురించి తెలుపండి.

జ‌వాబు: ముందుగా మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండే టర్మ్ జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు.
మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .
పిల్లల పేరు మీద అనేక పధకాలు ఉన్నా , ప్రత్యేకంగా ఉపయోగం వుండవు. రాబడి తక్కువగా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లు స్వల్ప కాలంలో ఒడిదుడుకులకు లోనైనా, దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి . ఒక మ్యూచువల్ ఫండ్ లో మదుపు మొదలుపెట్టండి. మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు మొదలు పెడితే కొంత అవగాహన తోపాటు అలవాటు అవుతుంది. ఇండెక్స్ ఫండ్లు ఒక ఇండెక్స్ ని అనుసరించి పెట్టుబడులు పెడతాయి కాబట్టి ఈ ఫండ్లలో రిస్క్ తక్కువగా ఉంటుంది. దీని కోసం మీరు యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయండి. దీనిలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలం అంటే పది సంవత్సరాలు చేస్తే మంచి రాబడి పొందవచ్చు.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
రూ 3 వేలతో మొదలు పెట్టి, ప్రతి సంవత్సరం మదుపును పది శాతం పెంచుకుంటూ వెళితే , పది సంవత్సరాల తరువాత పీ పీ ఎఫ్ లో 8 శాతం రాబడి అంచనాతో రూ 8.27 లక్షలు జమ అవుతాయి, అదే మ్యూచువల్ ఫండ్ లో 10 శాతం రాబడి అంచనాతో రూ 9.14 లక్షలు, అదే మ్యూచువల్ ఫండ్ లో 12 శాతం రాబడి అంచనాతో రూ 10.12 లక్షలు పొందవచ్చు .
మీ ఇతర ఆర్ధిక లక్ష్యాలైన ఇల్లు కొనుగోలు, పదవీవిరమణ నిధి కోసం వేరువేరుగా మదుపు చేయడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly