స్వ‌ల్ప‌కాలానికి పెట్టుబ‌డులు చేయాలంటే

స్వ‌ల్పకాలం పాటు పెట్టుబ‌డి చేసేందుకు అనుకూలంగా ఉండే వివిధ ర‌కాల పెట్టుబ‌డి సాధ‌నాలు

స్వ‌ల్ప‌కాలానికి పెట్టుబ‌డులు చేయాలంటే

మార్కెట్లో ఉన్న అస్థిత‌ర‌తను అధిగ‌మించేందుకు స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డి చేయాలంటే ఎక్క‌డ చేయాలి? సేవింగ్స్ బ్యాంకు లో డ‌బ్బు ఉంచుకోవ‌డం ఒక మార్గం. ఇది కాకుండా ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాలు కూడా మ‌దుప‌ర్లకు అందుబాటులో ఉన్నాయి. డెట్ ఫండ్లలో పెట్టుబ‌డులు ప్ర‌భుత్వ బాండ్లు, స‌ర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్, కార్పొరేట్ బాండ్లు, ట్రెజ‌రీ బిల్లులు, మ‌నీ మార్కెట్ సాధ‌నాల్లో పెట్టుబ‌డిగా పెడ‌తారు. వ‌డ్డీ రేట్ల‌లో క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి పెట్టుబ‌డుల్లో త‌గిన మార్పుచేర్పులు చేస్తుంటారు. స్వ‌ల్పకాలం పాటు పెట్టుబ‌డి చేసేందుకు అనుకూలంగా ఉండే వివిధ ర‌కాల డెట్ ఫండ్లు:

లిక్విడ్ ఫండ్లు:

ఇవి 91 రోజుల కంటే త‌క్కువ కాల‌ప‌రిమితి ఉన్న పెట్టుబ‌డి సాధానాల్లో మ‌దుపు చేస్తాయి. గ‌తంలో ఈ కేట‌గిరీలో వ‌చ్చిన‌ స‌గ‌టు రాబ‌డి 6.68 శాతంగా ఉంది. అత్య‌వ‌స‌ర నిధి కోసం వీటిలో మ‌దుపు చేయోచ్చు

‘అల్ట్రా షార్ట్ ట‌ర్మ్’ ఫండ్లు:

3 నుంచి 6 నెల‌ల కాల‌ప‌రిమితితో కూడిన స్థిరాదాయ‌ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేస్తారు. గ‌తంలోఈ కేట‌గిరీలో వ‌చ్చిన‌ స‌గ‌టు రాబ‌డి 5.78 శాతంగా ఉంది.

‘లో డ్యూరేష‌న్’ ఫండ్లు:

6 నుంచి 12 నెల‌ల కాల‌ప‌రిమితితో కూడిన స్థిరాదాయ‌ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేస్తారు. గ‌తంలోఈ కేట‌గిరీలో వ‌చ్చిన‌ స‌గ‌టు రాబ‌డి 6.20 శాతంగా ఉంది.

‘మ‌నీ మార్కెట్’ ఫండ్లు:

ఏడాది కాల‌ప‌రిమితి లోపు ఉండే స్థిరాదాయ‌ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేస్తారు.గ‌తంలోఈ కేట‌గిరీలో వ‌చ్చిన‌ స‌గ‌టు రాబ‌డి 6.79 శాతంగా ఉంది.

‘షార్ట్ డ్యూరేష‌న్’ ఫండ్లు:

ఏడాది నుంచి 3 ఏళ్ల కాల‌ప‌రిమితి మ‌ధ్య ఉండే పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేస్తారు. గ‌తంలో అందించిన స‌గ‌టు రాబ‌డి 4.41 శాతంగా ఉంది.

మార్కెట్ ఆధారిత పెట్టుబ‌డులు కాకుండా న‌ష్ట‌భ‌యం చాలా స్వ‌ల్పంగా ఉండే పెట్టుబ‌డులును ఎంచుకోవాల‌నుకుంటే కింది పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు.

స్వీప్ ఇన్ ఫిక్సిడ్ డిపాజిట్:

వీటిపై ల‌భించే వార్షిక వ‌డ్డీరేటు ఫిక్సిడ్ డిపాజిట్ ల‌పై వ‌చ్చే విధంగానే ఉంటుంది. ఖాతాదారుడు నిర్ణ‌యించిన మొత్తం కంటే ఎక్కువ డ‌బ్బు ఖాతాలో ఉంటే ఆటోమేటిక్ గా ఆ మొత్తం స్వీప్ ఇన్ విధానం ద్వారా ఫిక్సిడ్ డిపాజిట్ గా మారుతుంది.

షార్ట్ ట‌ర్మ్ ఫిక్సిడ్ డిపాజిట్:

వీటి మెచ్యూరిటీ ఏడు రోజుల నుంచి ఏడాది వ‌ర‌కూ కాల‌ప‌రిమితికి డిపాజిట్ చేయ‌వ‌చ్చు. వార్షిక వ‌డ్డీరేటు 3.5-6.75 శాతం వ‌ర‌కూ ఉంటుంది.క‌నీస పెట్ట‌బ‌డి రూ.100 అయితే ఇది బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటుంది.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్:

ఇవి 1,2,3,5 సంవ‌త్స‌రాల‌కు అందుబాటులో ఉంటాయి. వార్షిక వ‌డ్డీరేటు 6.9-7.8 శాతం వ‌ర‌కూ ఉంటుంది. క‌నీస పెట్ట‌బ‌డి రూ.200 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. గ‌రిష్ట ప‌రిమ‌తి లేదు. ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఐదేళ్ల కాల‌ప‌రిమితి టైమ్ డిపాజిట్ల‌పై మాత్ర‌మే ఉంటుంది. అంత‌కంటే త‌క్కువ కాల‌ప‌రిమితి టైమ్ డిపాజిట్ల‌పై ఉండ‌దు

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly