పెర‌గ‌నున్న‌ కార్లు, ద్విచ‌క్ర వాహ‌నాల థ‌ర్డ్‌పార్టీ ప్రీమియం

విద్యుత్‌ వాహనాలకు సంబంధించి థర్డ్‌ పార్టీ పాలసీ ప్రీమియంలో 15శాతం రాయితీని ఇచ్చేందుకు ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది.

పెర‌గ‌నున్న‌ కార్లు, ద్విచ‌క్ర వాహ‌నాల థ‌ర్డ్‌పార్టీ ప్రీమియం

మోటారు వాహన చ‌ట్టం ప్ర‌కారం వాహ‌న బీమాలో భాగంగా థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పొంద‌డం అనివార్యం. ఈ థ‌ర్డ్ పార్టీ ఇన్సురెన్స్ రోడ్డుపై తిరిగే ప్ర‌తి వాహ‌నానికి ఉండాలి. అయితే ప్ర‌స్తుతం ఈ బీమా ప్రీమియంను పెంచాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్ర‌తిపాదించింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి కార్ల‌కు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు, ర‌వాణా వాహ‌నాల‌కూ ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది.

1000సీసీ కంటే త‌క్కువ ఉన్న కార్ల‌కు ప్ర‌స్తుతం రూ. 1850 ప్రీమియం వ‌ర్తిస్తుండ‌గా 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.2,120 కి పెంచాలని భావిస్తుంది. అదేవిధంగా 1000 సీసీ నుంచి 1500సీసీ మ‌ధ్య ఉన్న కార్ల‌కు రూ.2863గా ఉన్న ప్రీమియంను రూ.3300కి , ల‌గ్జ‌రీ కార్ల‌కు(1500సీసీ కంటే ఎక్కువ ఇంజ‌న్ సామ‌ర్ధ్యం ఉన్న కార్లు) ప్ర‌స్తుతం ఉన్న ప్రీమియం మార్పులు లేవ‌ని తెలిపింది. ఈ కార్ల‌కు ప్ర‌స్తుత వ‌ర్తిస్తున్న ప్రీమియం రూ.7890.

సాధార‌ణంగా థ‌ర్డ్ పార్టీ ఇన్సురెన్స్ రేట్ల‌ను ఏప్రిల్‌1 న పున‌రుద్ధ‌రిస్తారు. అయితే ఈ సారి కాస్త ఆల‌స్యంగా ప్రీమియం రేట్ల‌లో మార్పులు తీసుకువ‌స్తుంది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి థ‌ర్డ్ పార్టీ ప్రీమియం కోసం కొత్త రేట్ల‌తో కూడిన డ్రాప్ట్‌ను ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చింది ఈ డ్రాఫ్ట్ ప్ర‌కారం 75సీసీ కంటే త‌క్కువ సామ‌ర్ధ్యం ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాల ప్రీమియం రూ.427 నుంచి రూ.482కి పెంచ‌నుంది. 75సీసీ నుంచి 350సీసీ సామ‌ర్ధ్యం ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాల‌కు కూడా ప్రీమియంను రూ.720 నుంచి రూ. 750కు పెంచాల‌ని భావిస్తోంది. అయితే 350సీసీ కంటే ఎక్కువ సామ‌ర్ధ్యం ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాల‌కు రూ.2323 ప్రీమియంను య‌థాత‌దంగా ఉంచ‌నున్న‌ట్లు తెలిపింది.

కొత్త కార్లకు మూడేళ్లపాటు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్లకు వర్తించే థర్డ్‌ పార్టీ పాలసీ ప్రీమియాన్ని ప్రస్తుతం మార్చలేదు. అదే సమయంలో విద్యుత్‌ వాహనాలకు సంబంధించి థర్డ్‌ పార్టీ పాలసీ ప్రీమియంలో 15శాతం రాయితీని ఇచ్చేందుకు నిర్ణయించింది. స్కూలు బస్సులు, ట్యాక్సీలు, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లకు వర్తించే థర్డ్‌ పార్టీ ప్రీమియం రేట్లు కూడా పెరగనున్నాయి. ముసాయిదా పత్రం మీద మే 29 వరకూ అభ్యంతరాలు స్వీకరించాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. ఆ తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. అప్పుడు ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly