ఉమ్మడి బ్యాంకు ఖాతా

కుటుంబ సభ్యులతో కలిసి తెరిచే జాయింట్ బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుందాం

ఉమ్మడి బ్యాంకు ఖాతా

రోజూ వారీ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం బ్యాంకు ఖాతాలతో అవసరం ఉంటుంది. బ్యాంకుకు వెళ్లి చెక్కులు డ్రా చేసేందుకు, డీడీలు తీసేందుకు సమయం ఉండటం లేదు. ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం ద్వారా పలు సౌకర్యాలను ఉపయోగించుకునే వీలుంది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న నేటి రోజుల్లో ఇద్దరూ కలిసి బ్యాంకు ఖాతాను నిర్వహించడం ద్వారా బిల్లులు చెల్లించడంలో, చెక్కులు జారీ చేయడంలో ఇబ్బందులను అధిగమించవచ్చు. సీనియర్‌ సిటిజన్స్‌ విషయంలో వారు పదే పదే బ్యాంకుకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. అలా కాకుండా వారు కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడి ఖాతా నిర్వహించుకోవడం ద్వారా లావాదేవీలు సులువుగా చేసుకునే వీలుంటుంది. పిల్లలతో కలిసి ఉమ్మడి ఖాతా తెరిస్తే వారి నిర్వహణను పెద్దవారు పరిశీలించేందుకు వీలుంటుంది.

ఉమ్మడి ఖాతా తెరిచే విధానం:

 • ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి ఉమ్మడిఖాతా తెరవాల్సి ఉంటుంది.
 • నియమనిబంధనలన్నింటిపై ఉమ్మడి ఖాతాదారులు సంతకాలు చేయాల్సి ఉంటుంది.
 • కేవైసీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
 • ఖాతా తెరిచేందుకు అవసరమయ్యే పత్రాలన్నీ సాధారణ పొదుపు ఖాతాకు సంబంధించినవే ఉంటాయి.

ఖాతా నిర్వహణ విధానం:

 • ఖాతా తెరిచే సమయంలో దరఖాస్తు ఫారంలో ఉమ్మడి ఖాతా అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
 • ఉమ్మడి ఖాతాలో అనుకోకుండా ఒకరికి ఏదైనా జరిగితే మరొకరికి హక్కు బదిలీ అవుతుంది.
  ఉమ్మడి ఖాతాను పలు రకాలుగా నిర్వహించుకోవచ్చు. ఖాతాదారులందరూ కలిసి ఎలా ప్రయోజనం పొందాలో వారి అవసరం మేరకు వారే ప్రారంభంలోనే నిర్ణయించుకోవచ్చు.

ఉమ్మడి ఖాతా(ఉమ్మడిగా నిర్వహించుకునేది):

 • ఈ పద్ధతిలో లావాదేవీల కోసం ఖాతాదారులందరి సంతకాలు ఉండాలి.
  ఉదాహరణకు : భార్యాభర్తలు కలిసి ఉమ్మడిగా నిర్వహించే పద్ధతిని ఎంచుకుని ఖాతా తెరిచినప్పుడు లావాదేవీ చెల్లుబాటు కావాలంటే ఇద్దరి సంతకాలు తప్పనిసరి. ఎవరో ఒకరు సంతకం చేసిన లావాదేవీ చెల్లదు.
 • ఇక్కడ ఉమ్మడి ఖాతాదారుల్లో ఏ ఒక్కరు మరణించినా అక్కడితో ఖాతాను నిలిపివేస్తారు. నామినీకి, జీవించి ఉన్న ఖాతాదారుడికి ఖాతాలో ఉన్న సొమ్మును చెల్లిస్తారు.

ఉమ్మడిగా లేదా విడివిడిగా:

 • ఈ పద్ధతిలో సైతం లావాదేవీల సమయంలో ఉమ్మడి ఖాతాదారులంతా సంతకం చేయాల్సి ఉంటుంది.
 • ఉమ్మడి ఖాతాదారుల్లో ఒకరికి మరణం సంభవించినా రెండో వ్యక్తి ఖాతాను నిర్వహించుకోవచ్చు. హక్కులన్నీ బదిలీ అవుతాయి.
  ఉదాహరణకు : ఇద్దరు ఉమ్మడి ఖాతాను నిర్వహిస్తూ, ప్రథమ ఖాతాదారు మరణిస్తే రెండోవారు దాన్ని నిర్వహించుకోవచ్చు. హక్కులన్నీ బదలాయిస్తారు.

ఏ ఒక్కరైనా:

 • ఈ పద్ధతిలో ఉమ్మడి ఖాతాదారులందరూ లావాదేవీలు నిర్వహించుకునే వీలుంటుంది.
 • లావాదేవీలపై ఏ ఒక్కరు సంతకం చేసిన చెల్లుబాటు అవుతాయి.

ప్రధమ ఖాతాదారు లేదా జీవించి ఉన్న ఉమ్మడి ఖాతా దారు:

 • ఈ పద్ధతిలో ప్రథమ ఖాతాదారుడు మాత్రమే ఖాతాను నిర్వహించే వీలుంటుంది.
  ఒకవేళ ప్రథమ ఖాతాదారుడికి అనుకోకుండా ఏదైనా జరిగితే ఉమ్మడి ఖాతాదారులకు నిర్వహణ హక్కు కల్పిస్తారు.

ఉమ్మడి ఖాతా వలన ప్రయోజనాలు:

 • ఉమ్మడి ఖాతాలో కుటుంబ ఆర్థిక నిర్వహణ మొత్తం ఒకే ఖాతా నుంచే జరిగేలా చూడవచ్చు.

 • సమయాభావం వల్ల ఒకరు బిల్లులు చెల్లించలేకపోయినా మరొకరు చేసేందుకు వీలుంటుంది.

 • ఖర్చుల మీద నియంత్రణ ఉంటుంది. వృథా ఖర్చులను తగ్గించుకోవచ్చు .

 • చెక్కులు, విత్‌డ్రాలు ఎవరైనా చేసేందుకు వీలుగా ఏ ఒక్కరైనా నిర్వహించే వీలుండే ఉమ్మడి ఖాతా ప్రయోజనం కలిగిస్తుంది.

 • ఉమ్మడి ఖాతాలో ఒకరు మరణించినా మిగిలిన వారికి నిర్వహణ హక్కులు కల్పిస్తారు.

ఉమ్మడి ఖాతాలో పరిమితులు:

 • ఉమ్మడి ఖాతాదారులు ఒకరికి తెలియకుండా మరొకరు చెక్కు జారీ చేస్తే ఒక్కోసారి బౌన్స్‌ అయ్యే ప్రమాదం ఉంది.

 • ఖాతాలో సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు మళ్లిస్తే, టీడీఎస్‌ మొదటి ఖాతాదారుడికి వర్తిస్తుంది.

 • ఇద్దరూ సంపాదనపరులైతే, ఆర్థిక స్వేచ్ఛ లేదని భావించే ప్రమాదం ఉంది.

 • ఖాతాలో నుంచి ఒవర్‌డ్రాఫ్ట్‌ ద్వారా ఒకరు డబ్బు తీసుకున్నా రుణభారం ఉమ్మడి ఖాతాదారులంతా భరించాల్సి ఉంటుంది.

 • ఖాతా నిర్వహణలో ఏవైౖనా పొరపాట్లు జరిగితే ఉమ్మడి ఖాతాదారులందరి రుణ చరిత్ర మీద ప్రభావం పడుతుంది.

నామినీ:

 • ఉమ్మడి ఖాతాదారులిద్దరూ కలిసి ఒక నామినీని సూచించే సదుపాయం ఉంది.

 • ఖాతా ప్రారంభ సమయంలో ఒకవేళ నామినీ లేకుండా ఉండి, ప్రథమ ఖాతాదారు మరణిస్తే రెండో ఖాతాదారు నామినీని సూచించవచ్చు.

సాధారణంగా కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక ఉమ్మడి ఖాతా నిర్వహిస్తే ఖర్చులపై సమగ్ర అవగాహన ఉంటుంది. బిల్లుల చెల్లింపులో ఆలస్యాన్ని నివారించవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా దూరదృష్టి ఉన్నవారు మాత్రమే ఉమ్మడి ఖాతాలను నిర్వహించుకోవాలి. లేకపోతే ఖాతాలు ఎక్కువై నిర్వహణ భారంగా మారుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly