ప‌దేళ్ల పిల్ల‌ల‌కూ బ్యాంకు ఖాతా

ప‌దేళ్ల వ‌య‌సులోని పిల్ల‌ల పేరిట బ్యాంకు ఖాతా తెరిచే వెసులుబాటు ఉంది. పిల్ల‌ల్లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పెంపొందించేందుకు ఇది స‌హ‌క‌రిస్తుంది.

ప‌దేళ్ల పిల్ల‌ల‌కూ బ్యాంకు ఖాతా

**పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించడం, వారి కలలను సాకారం చేసేందుకు పరితపించడం సాధారణమైన విషయం. ముందు తరాల వారికన్నా ప్రస్తుత తరంలోని పిల్లలు ఎంతో వేగంగా ఉన్నారు. సాంకేతికంగా పరంగా, నైపుణ్యాల పరంగా, చదువుల్లో నేటి తరం పిల్లలు చురుకుగా ఉంటున్నారు. ప్రస్తుత తరం తల్లిదండ్రులు వారి చిన్నతనంలో ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న సందర్భాలు తక్కువ. అదే ఇప్పటి పిల్లల పాకెట్‌ మనీయే వందల నుంచి వేలల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక నిర్వహణ దిశగా కిడ్డీ బ్యాంకులు ఏ మేరకు పనికి వస్తాయో చూద్దాం.

అర్హతలు:

 • ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు పద్దెనిమిదేళ్ల వయసు లోపు వారు ఎవరైనా మైనర్‌ ఖాతాకు అర్హులు.
 • పదేళ్ల వయసు లోపు వారికి సంరక్షకులు అవసరం.
 • పది నుంచి పద్దెనిమిదేళ్ల వయసు వారు స్వతంత్రంగా పరిమితులతో కూడిన ఖాతాను నిర్వహించుకోవచ్చు.

అవసరమైన వివరాలు :

 • ఈ తరహా ఖాతాలకు పిల్లలు మైనర్లని పేర్కొంటూ, సంరక్షకులు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.
 • తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వ్యక్తిగత గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
 • తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఫోటో, మైనర్‌ ఫోటో, మైనర్‌ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి

జనన ధ్రువీకరణ కోసం:

జనన నమోదు పత్రం, పాస్‌పోర్టు, పాఠశాల గుర్తింపుకార్డు (ఫోటో, జన్మించిన తేదీ ఉండాలి) మొదలైనవాటిని రుజువుగా అంగీకరిస్తారు.

పిల్లల పొడుపు ఖాతా ప్రత్యేక సౌకర్యాలు:

పర్యవేక్షణ:

 • పిల్లల ఖాతాలో జరిగే లావాదేవీలను మొబైల్‌ అలర్ట్స్‌ ద్వారా, ఆన్‌లైన్‌ స్టేట్‌మెంట్ల ద్వారా తల్లిదండ్రులు పర్యవేక్షించవచ్చు.
 • మొబైల్‌ బ్యాంకింగ్‌కు అనుమతించే బ్యాంకులు, ఖాతాలో ఎప్పుడు లావాదేవీ జరిగినా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మొబైల్‌కు సంక్షిప్త సందేశాన్ని పంపుతాయి.
 • ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌ వంటి సదుపాయాలను తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అభ్యర్థన మేరకు మాత్రమే అందిస్తారు.
 • పరిమితులను బ్యాంకులు ముందుగానే నిర్ణయిస్తాయి లేదా పరిమితులను నిర్ణయించే స్వేచ్ఛను తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఉండేలా చూస్తాయి.
 • ఉచిత పాస్‌బుక్‌, చెక్కు పుస్తకం వంటి సదుపాయాలు కల్పిస్తారు.
 • నామినేషన్‌ సౌకర్యం ఉంటుంది.

డెబిట్‌/ఏటీఎమ్‌ కార్డు:

ఈ రోజుల్లో పిల్లల ఖాతాకు ఏడేళ్ల వయసు నుంచే ఏటీఎమ్‌ అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. తల్లిదండ్రుల అవసరం లేకుండానే పిల్లలు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఖాతాలోని నగదును వాడుకునేందుకు విత్‌డ్రాయల్‌ లిమిట్‌ను నిర్ణయించేందుకు తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది. ఆ పరిమితిని మించి పిల్లలు ఏటీఎమ్‌ను వాడుకునేందుకు వీలు ఉండదు.

పేరెంట్‌ అకౌంట్‌తో అనుసంధానం:

పిల్లల ఖాతాను, తల్లిదండ్రుల ఖాతాతో అనుసంధానించడం ద్వారా ప్రతినెలా పాకెట్‌ మనీని బ్యాంక్‌ ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేయవచ్చు. తల్లిదండ్రుల మొబైల్‌కు సంక్షిప్త రూపంలో సందేశాలు అందడం ద్వారా పిల్లల ఖర్చులను నియంత్రించి, వారికి డబ్బు విలువను తెలియజేయవచ్చు.

కనీస నిల్వ:

ఈ తరహా ఖాతాలను ప్రోత్సహించేందుకు కొన్ని బ్యాంకులు కనీస నిల్వ ఉంచాలన్న నిబంధనను విధించలేదు. కొన్ని బ్యాంకులు రూ. 750 నుంచి మొదలుకొని రూ. 5000 వరకూ కనీస నిల్వ (నెలకు) నిబంధనలను అమలు చేస్తున్నాయి. కనీస నిల్వ లేకపోతే రూ. 50 నుంచి రూ. 150 వరకూ రుసుములను విధిస్తున్నాయి.

రాబడి:

సాధారణ పొదుపు ఖాతాలోని డబ్బుకు వర్తించినట్టుగానే పిల్లల పొదుపు ఖాతాలకు సైతం వడ్డీ వర్తిస్తుంది.

ఖాతాతో అదనపు ప్రయోజనాలు:

పొదుపు అలవాటు:

పిల్లలకు చిన్న వయసులోనే బ్యాంకింగ్‌ అలవాట్లు నేర్పించడం ద్వారా వారికి పొదుపుపై అవగాహన ఏర్పడుతుంది. బంధువులు, బహుమతుల ద్వారా అనుకోకుండా డబ్బు వచ్చినప్పుడు అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తపడతారు. పొదుపుతో పాటు నెమ్మదిగా పెట్టుబడులపై అవగాహనను పెంచుకుంటారు.

జీవిత బీమా/ప్రమాద బీమా :

బ్యాంకులు తల్లిదండ్రుల పేరిట జీవిత బీమా లేదా ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

ఎడ్యుకేషన్‌ ఇన్సూరెన్స్ :

తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు అనుకోకుండా ఏదైనా జరిగితే, పిల్లల చదువుకు ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్‌ ఇన్సూరెన్స్‌ అందేలా కొన్ని బ్యాంకులు ఖాతాతో పాటే ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం ఖాతా నుంచి ముందుగా నిర్ణయించిన కనీస ప్రీమియం మినహాయిస్తారు.

పిల్లలు మేజర్‌ అయిన తర్వాత సాధారణ వడ్డీ రేట్ల కంటే తక్కువ వడ్డీకే విద్యా రుణాలు పొందే వీలుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly