ఆధార్ బ‌యోమెట్రిక్స్ లాక్..ఎప్పుడు చేయాలి?

వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే బ‌యోమెట్రిక్స్‌ని లాక్ చేయాలి.

ఆధార్ బ‌యోమెట్రిక్స్ లాక్..ఎప్పుడు  చేయాలి?

యూఐడీఏఐ వెబ్‌సైట్ వివ‌రాల ప్ర‌కారం, ఫిబ్ర‌వ‌రి 20, 2019 నాటికి మొత్తం దేశంలో మొత్తం 123 కోట్ల‌ ఆధార్ కార్డులను జారీ చేసారు. ఈ ప‌న్నెండు అంకెల గుర్తింపు సంఖ్యను ప్ర‌భుత్వం భార‌త‌ పౌరుల‌కు త‌ప్ప‌నిస‌రి చేసింది. ఒక‌సారి ఈ సంఖ్య జ‌న‌రేట్ అయితే జీవితాంతం, జీవితానంత‌రం కూడా ఉంటుంది. మ‌ర‌ణానంత‌రం దీనిని ర‌ద్దు చేసేందుకు కాని, తిరిగి స‌రెండ‌ర్ చేసేందుకు కాని ఎలాంటి నియ‌మాలు లేవు. అదేవిధంగా వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్లు తెలిపేందుకు కూడా ఎలాంటి అవ‌కాశం లేదు. కొన్ని రాష్ర్టాల్లో జ‌నాబా కంటే ఆధార్ కార్డులు ఎక్కువ‌గా ఉండ‌టానికి ఇదే కార‌ణం. ఉదాహ‌ర‌ణ‌కు, దిల్లీలో మొత్తం జ‌నాబా 1.834 కోట్లు అనుకుంటే ఫిబ్ర‌వ‌రి 20, 2019 2.184 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. మ‌రి ఆధార్ వివ‌రాల‌ను అప్‌డేట్ చేసేంద‌కు వీలు లేక‌పోతే తర్వాత ఆ నంబర్‌ను దుర్వినియోగ‌ప‌రిచే అవ‌కాశం లేక‌పోలేదు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం …

ఆధార్ దుర్వినియోగం కాకుండా …

పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటి వాటిలో వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లుగా వివ‌రాలు అప్‌డేట్ చేయ‌డం, ర‌ద్దు లేదా స‌రెండ‌ర్‌ చేసిన‌ట్లుగా ఆధార్‌లో చేసేందుకు వీల్లేదు. యూఐడీఏఐ, వెబ్‌సైట్‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూఐ ఈ విధ‌మైన ఆప్ష‌న్ ఆధార్ విష‌యంలో లేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం వ్యక్తుల‌కు ఒక గుర్తింపునిచ్చేందుకు మాత్ర‌మే దీనిని జారీ చేస్తున్న‌ట్లు తెలిపింది. ఒక‌వేళ వ్య‌క్తి మ‌ర‌ణించినా ఆ స‌మాచారం అందించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది. కాని వారి ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వార‌సులు ఆ వ్య‌క్తి బ‌యోమెట్రిక్స్‌ను లాక్ చేయాలి.

లాకింగ్ బ‌యోమెట్రిక్స్‌:

ఆధార్ జారీ చేసేట‌ప్పుడు సేక‌రించే వేలిముద్ర‌లు, క‌నుపాప వంటి బ‌యోమెట్రిక్స్‌ను లాక్ చేసేంద‌కు అవ‌కాశం ఉంటుంది. ఒక‌సారి బ‌యోమెట్రిక్స్ లాక్ అయిన త‌ర్వాత ఆధార్ నంబ‌ర్‌ను తిరిగి ఉప‌యోగించేందుకు ప్ర‌య‌త్నిస్తే బ‌యోమెట్రిక్స్ లాక్ అయిన‌ట్లుగా specific error code ‘330’ క‌నిపిస్తుంది.

అయితే బ‌యోమెట్రిక్స్‌ను కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే లాక్ చేసేందుకు వీలుంది. కంప్యూట‌ర్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేయ‌వ‌చ్చు. దీనికోసం యూఐడీఏఐ హోమ్‌పేజిలో ‘Aadhaar services’ ట్యాబ్‌కి వెళ్లి ‘lock/unlock biometrics’ లింక్‌పై క్లిక్ చేయాలి. త‌ర్వాత‌ ‘resident.uidai.gov.in/biometric-lock’ పేజి ఓపెన్ అవుతుంది. ఆ వ్య‌క్తి ప్రొఫైల్‌కి లాగిన్ అయిన త‌ర్వాత కుడివైపున పైభాగంలో ఉండే “Biometric Settings’’ పై క్లిక్ చేయాలి. బ‌యోమెట్రిక్స్‌ను లాక్ చేసేందుకు “Enable Biometric Lock’’ సెల‌క్ట్ చేయాలి. సెల‌క్ష‌న్‌ను సేవ్ చేయాలి. ఆ త‌ర్వాత ఆ వ్య‌క్తి న‌మోదిత మొబైల్ నంబ‌ర్‌కి ఓటీపీ వ‌స్తుంది. అందుకే వారి మొబైల్‌ను మీ వ‌ద్ద ఉండేలా చూసుకోవాలి. ఓటీపీని ఎంట‌ర్ చేస్తే తిరిగి అన్‌లాక్ చేసేంత వ‌ర‌కు శాశ్వ‌తంగా బ‌యోమెట్రిక్స్ లాక్ అవుతాయి.

ఇలాంటి స‌మ‌యాల్లో ఉప‌యోగ‌క‌రంగా ఉండేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు మీ ఆర్థిక విష‌యాల గురించి కుటుంబ స‌భ్యుల‌కు, వార‌సుల‌కు తెలియ‌జేస్తుండాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly