డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో ప‌రిమితికి మించి ఖ‌ర్చు చేస్తున్నారా..

కార్డు లిమిట్ సెట్ చేసి, మీ డ‌బ్బుకు అద‌న‌పు ర‌క్ష‌ణ క‌ల్పించండి

డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో ప‌రిమితికి మించి ఖ‌ర్చు చేస్తున్నారా..

ప్ర‌స్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు విరివిగా వాడుతున్నారు. ఈ కార్డులను ఉపయోగించి చాలా మంది ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా కూడా ప‌రిమితికి మించి ఖ‌ర్చుచేస్తున్నారు. క్రెడిట్ కార్డులు వాడ‌కం పెరిగిన త‌రువాత బ‌డ్జెట్‌కి మించి ఖ‌ర్చుచేస్తూ, చాలా మంది రుణ ఉచ్చులో చిక్కుకు పోతున్నారు. ఈ ఖ‌ర్చుల‌ను అదుపులో పెట్టుకునేందుకు మీ క్రెడిట్, డెబిట్ కార్డులపై ప‌రిమితి ఏర్పాటు చేసుకునే వీలుంది. ఉదాహ‌ర‌ణ‌కి కార్డు వాడిన‌ ప్ర‌తీసారి రూ. 5 వేలు లేదా రూ.10 వేలు మించి ఖ‌ర్చుచేయ‌కూడ‌ ద‌నుకుంటున్నారా? అయితే దానికి అనుగుణంగా ప‌రిమితిని ఏర్పాటు చేసుకోండి. ఒక‌వేళ మీరు అంత‌కు మించిన‌ లావాదేవీలు చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ విఫ‌ల‌మ‌వుతాయి. ఈ కార్డుల‌పై అంత‌ర్జాతీయంగా జ‌రిపే లావాదేవీల‌పై కూడా ప‌రిమితిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

ఏవిధంగా సెట్ చేయాలి?
కార్డు ప‌రిమితిని ఏర్పాటు చేసుకునే ప్రాసెస్ అన్ని బ్యాంకుల‌కు ఒకే ర‌కంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బ‌ట‌న్‌ను స్విచ్ ఆన్ చేయ‌డం ద్వారా అనుమ‌తిస్తే, మ‌రికొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా ప‌రిమితిని ఏర్పాటు చేసుకునే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా, కార్డు ఆప్ష‌న్‌కు వెళ్ళి, ఏ కార్డుకు ప‌రిమితి సెట్ చేయాలో… ఆ కార్డు వివ‌రాల‌ను ఎంట‌ర్‌ చేయాలి. దేశీయ లావాదేవీల కోసం లేదా అంత‌ర్జాతీయ లావాదేవీల కోసం ప‌రిమితి మార్చుకోవాలా… లేదా ఇత‌ర మార్పులు ఏమైనా చేయాలా… అనే ఆప్ష‌న్ల‌ను ఇస్తుంది. ఇందులో మీకు కావ‌ల‌సిన ఆప్ష‌న్ ఎంచుకుని లిమిట్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్‌ను సెట్ చేసుకునే సౌక‌ర్యాన్ని కొన్ని బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. ఒకసారి ఆప్ష‌న్ ఎంపిక చేసుకున్న అనంత‌రం బ్యాంకు వారు ప‌రిమితి విధించి మీకు తెలియ‌జేస్తారు. త‌దుప‌రి లావాదేవీలు ప‌రిమితికి మించితే… బ్యాంకు వారు మీకు స‌మాచారం అందిస్తారు.

ప‌రిమితి ఎందుకు?

డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాల సంఖ్య రోజురోజుకు ఘ‌న‌నీయంగా పెరిగిపోతుంది. ఇలాంటి మోసాల‌ను నివారించేందుకు బ్యాంకులతో పాటు వినియోగదారులు కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప్ర‌త్యేకించి పాస్‌వ‌ర్డ్‌, పిన్ వంటి వివ‌రాల‌ను మీ స‌న్నిహితుల‌కు కూడా చెప్ప‌కూడ‌దు. మీ కార్డు విత్‌డ్రా లిమిట్‌ను ప‌రిమితం చేయండి. ఉదాహ‌ర‌ణ‌కి, మీ కార్డు అంత‌ర్జాతీయ లావాదేవీల‌ను రద్దు చేసి, దేశీయంగా ఒక‌సారి చేసే లావాదేవీల‌ను రూ.5 వేల‌కు ప‌రిమితం చేశార‌నుకుందాం. అంత‌ర్జాతీయంగా మోసాల‌కు పాల్ప‌డే వారు మీ కార్డు వివ‌రాల ద్వారా లావాదేవీలు నిర్వ‌హించ‌లేరు. అలాగే దేశీయంగా మోసాల‌కు పాల్ప‌డితే రూ.5 వేలకు మించి న‌ష్ట‌పోకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly