బ్యాంకు లాక‌ర్‌ను తెర‌వాల‌నుకుంటున్నారా?

సాధారణంగా బ్యాంకులు మూడు సంవ‌త్స‌రాల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకుంటాయి

బ్యాంకు లాక‌ర్‌ను తెర‌వాల‌నుకుంటున్నారా?

విలువైన వ‌స్తువుల‌ను ఇంటిలో భ‌ద్ర‌ప‌ర‌చ‌డం కంటే బ్యాంకు లాక‌ర్ల‌లో ఉంచ‌డం సుర‌క్షిత‌మ‌ని మ‌న‌లో చాలా మంది న‌మ్మ‌కం. అయితే బ్యాంకు లాక‌ర్లు నిజంగా సుర‌క్షిత‌మేనా? ప‌్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా బ్యాంకు లాక‌ర్‌లోని విలువైన వ‌స్తువులు నాశ‌నం అయినా లేదా దొంగ‌త‌నం జ‌రిగినా దానికి బ్యాంకులు భాద్య‌త వ‌హించ‌న‌వ‌స‌రం లేదని 2017లో రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయిన‌ప్ప‌టికీ ఇత‌ర మార్గాల‌తో పోలిస్తే బ్యాంకు లాక‌ర్లు సుర‌క్షితమ‌ని చాలా మంది భావిస్తున్నారు. మీరు కూడా బ్యాంకు లాక‌ర్ తీసుకోవాల‌నుకుంటే ఈ కింది విష‌యాల‌ను గుర్తించుకోవాలి.

 1. ఛార్జీలు:
  బ్యాంకు లాక‌ర్‌ను అద్దెకు తీసుకోవ‌డం త‌క్కువ ఖ‌ర్చుతో కూడికున్న‌ది కాదు. మీరు తీసుకున్న లాక‌ర్ సైజు, బ్యాంకు శాఖ‌పై ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి, మెట్రో, అర్బ‌న్ ప్రాంతాల‌లో ఉన్న‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) బ్రాంచ్‌లో చిన్న సైజ్‌((125x175x492సెం.మీ) లాక‌ర్‌కు వార్షికంగా రూ.1500+జీఎస్‌టీ వ‌సూలు చేస్తుంది. అదే లాక‌ర్‌కు గ్రామీణ ప్రాంతాల‌లోని శాఖ‌లో అయితే వార్షికంగా రూ.1000+జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద సైజులో ఉన్న లాక‌ర్‌కు అయితే వార్షికంగా రూ.9వేల‌+జీఎస్‌టీ వ‌ర‌కు ఎస్‌బీఐ వ‌సూలు చేస్తుంది.
  అంతేకాకుండా లాక‌ర్ సైజు ఆధారంగా రిజిస్ట్రేష‌న్ చార్జీలు వ‌ర్తిస్తాయి. అయితే ఈ ఛార్జీలు ఒక‌సారి చెల్లిస్తే స‌రిపోతుంది. ఎస్‌బీఐ చిన్న‌, మ‌ధ్య స్థాయి లాక‌ర్ల‌కు రూ.500+జీఎస్‌టీ, పెద్ద సైజు లాక‌ర్ల‌కు రూ.1000+జీఎస్‌టీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ ఫీజు వ‌సూలు చేస్తుంది. ఒక‌వేళ అద్దె చెల్లించ‌డం ఆల‌స్యమ‌యితే వార్షిక అద్దెపై 40 శాతం పెనాల్టీ విధిస్తుంది. కొన్ని బ్యాంకుల‌లో ఎఫ్‌డీ ఖాతా లేదా యులిప్స్ వంటి ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టిన వారికి మాత్ర‌మే లాక‌ర్ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే ఇది ఆర్‌బీఐ నియ‌మ‌నిభంధ‌న‌ల‌కు విరుద్ధం.

 2. లాక‌ర్ కీ:
  ప్ర‌తీ బ్యాంకులోనూ లాక‌ర్‌కి రెండు తాళాలు ఉంటాయి. వినియోగ‌దారుని వ‌ద్ద ఒక కీ మాత్ర‌మే ఉంటుంది. మ‌రొక తాళం బ్యాంకు వ‌ద్ద ఉంటుంది. లాక‌ర్ కీ పొగొట్టుకుంటే బ్యాంక్ దాన్ని భ‌ర్తీ చేస్తుంది. అయితే దీనికి అయ్యే ఖ‌ర్చు భారీగా ఉంటుంది. సాధార‌ణంగా బ్యాంకులు స‌ర్వీసు ఛార్జీలు,లాక‌ర్‌ను ప‌గుల‌గొట్టి తెర‌వ‌డం లేదా మ‌రొక కీని త‌యారు చేయించ‌డం వంటి వాటికి అయ్యే ఖ‌ర్చుల‌తో క‌లిపి రూ.3 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తాయి.

 1. నామీని:
  లాక‌ర్ అద్దెకు తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, వారి లాక‌ర్‌లోని వ‌స్తువుల‌ను అప్ప‌గించేందుకు ఒక వ్య‌క్తిని నామినీగా ఉంచాల్సి ఉంటుంది. ఒక‌వేళ లాక‌ర్ తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణించే స‌మ‌యానికి నామినీ మైన‌ర్ అయితే లాక‌ర్‌ను తెరిచేందుకు అత‌ని మైన‌ర్ గార్డియ‌న్‌ను అనుమ‌తిస్తారు.

 2. చ‌ట్టబద్ధ‌మైన వార‌సులు:
  నామినీ లేని సంద‌ర్భాల‌లో, అద్దెకు తీసుకున్న వ్య‌క్తి రాసిన విల్లు ఉంటే దాని ఆధారంగా చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుడు లాక‌ర్‌ను తెర‌వ‌వ‌చ్చు. ఒక వేళ విల్లు కూడా లేక‌పోతే, నష్టపరిహారంతో కూడిన అఫిడవిట్ ఆధారంగా పరిష్కరించిన క్లెయిమ్‌ను స్వీకరించడానికి చట్టపరమైన వారసుడు బ్యాంకును సంప్రదించవచ్చు.

 3. జాయింటు హోల్డ‌ర్‌:
  ఒక లాక‌ర్‌ను ఒక‌టి కంటే ఎక్కువ మంది తీసుకుని, వారిలో ఒక వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, ఆ వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లు ధృవీక‌రించిన అనంత‌రం, మ‌ర‌ణించిన వ్య‌క్తి నామినీతో పాటు ఇత‌ర జాయింటు హోల్డ‌ర్లు లాక‌ర్‌ను తెర‌వ‌చ్చు. అయితే నామీని, మిగిలిన అద్దెదారులుతో పాటు లాక‌ర్‌ను తెరిచే ముందు బ్యాంకు ఒక సాక్షి స‌మ‌క్షంలో అందులోని వ‌స్తువుల జాబితాను త‌యారు చేస్తారు. ఒక‌వేళ జాయింటు హోల్డ‌ర్లు నామినీని నియ‌మించ‌కపోతే, అత‌ని స్థానంలో వారి చ‌ట్ట‌బ‌ద్ద‌మైన వార‌సుల‌ను లాక‌ర్‌ను తెరిచేందుకు అనుమ‌తిస్తారు.

 4. లాక‌ర్ ర‌ద్దు:
  బ్యాంకు లేదా అద్దెదారుడు లిఖిత పూర్వ‌కంగా ఏడు రోజుల ముందే నోటీసు ఇచ్చి లాక‌ర్ అద్దె ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ లాక‌ర్‌ను మూసివేస్తున్న‌ట్లు నోటీసు ఇవ్వ‌క‌పోతే లాక‌ర్ సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తారు. లీజు వ్యవధి ముగిసేలోపు లాకర్‌ను బ్యాంకు వారికి స్వాధీన‌ప‌రిచిన‌ట్ల‌యితే, మిగిలిన అద్దె మీకు తిరిగి చెల్లిస్తారు. మిగిలిన లీజు కాలం క‌నీసం ఒక సంవ‌త్స‌రం ఉన్న సంద‌ర్భాల‌లో ఈ విధంగా జరుగుతుంది. సాధారణంగా, బ్యాంకులు మూడు సంవ‌త్స‌రాల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకుంటాయి. ఒక‌వేళ మీరు ఎఫ్‌డీ చేసిన‌ప్పుడు లాక‌ర్ స‌దుపాయం ల‌భిస్తే, లీజు వ్య‌వ‌ధి కంటే ముందుగానే లాక‌ర్ స్వాధీన‌ప‌రిస్తే, బ్యాంకు ఎఫ్‌డీని కూడా ప్రీ మెచ్యూర్ ఎఫ్‌డీగా క్లోస్ చేసే అవ‌కాశం ఉంది.
  లాక‌ర్‌ను ఒక బ్రాంచ్ నుంచి మ‌రొక బ్రాంచ్‌కు బ‌దిలీ చేయ‌డం సాధ్యంకాదు. మీరు బ‌దిలీ చేయాల‌నుకుంటే ఇప్పుడు ఉన్న లాక‌ర్‌ను స్వాధీన ప‌రిచి, మ‌రొక బ్రాంచ్‌లో కొత్త లాక‌ర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly