గ‌డువు ముగుస్తోంది.. ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేశారా?

2018 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు మార్చి 31 లోపు దాఖ‌లు చేయ‌క‌పోతే జ‌రిమానాతో పాటు జైలు శిక్ష త‌ప్ప‌దు.

గ‌డువు ముగుస్తోంది.. ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేశారా?

మీరు ఇప్ప‌టివ‌ర‌కు 2018-19 మ‌దింపు సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌క‌పోతే ఇప్పుడు వెంట‌నే చేయండి. ఎందుకంటే మార్చి 31, 2019 నాటికి ఈ గ‌డువు ముగుస్తుంది. ఇంత‌కుముందు ఇది ఆగ‌స్ట్ 31, 2018 కే వ‌ర‌కే ఉండ‌గా ఆదాయ ప‌న్ను శాఖ ఈ గ‌డువును పెంచింది. ఇప్ప‌టికే ప‌న్ను చెల్లించాల్సిన వారికి ఈమెయిల్ లేదా మెసేజ్ ద్వారా స‌మాచారం అందించింది. అయితే ఇప్పుడు ఐటీఆర్ దాఖ‌లు చేస్తే అది ఆల‌స్యంగా చేసిన‌ట్లుగానే ప‌రిగ‌ణిస్తారు. అస‌లైన తేది జూన్ 31, 2018 కాగా ఆ త‌ర్వాత ఆగ‌స్ట్ 31 కి మార్చింది. మ‌ళ్లీ తిరిగి మార్చి 31 వ‌ర‌కు పెంచింది. ఇలా ఆల‌స్యంగా ఫైల్ చేయ‌డం కార‌ణంగా కొన్ని ప్ర‌యోజ‌నాలు పొంద‌క‌పోవ‌డమే కాకుండా ఆల‌స్య రుసుములు కూడా చెల్లించాల్సి రావొచ్చు. అయితే మార్చి 31 వ‌ర‌కు కూడా రిట‌ర్నులు దాఖలు చేయ‌క‌పోతే 2018-19 మ‌దింపు సంవ‌త్స‌రానికి సంబంధించిన ఐటీఆర్ దాఖ‌లు చేసేందుకు ఇక‌ వీలుండ‌దు.

ఎలా దాఖ‌లు చేయాలి ?

సాధార‌ణంగా ఐటీఆర్ దాఖ‌లు చేసిన‌ట్లుగానే బిలేటెడ్ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయాలి. యూజ‌ర్ ఐడీతో (పాన్‌) , పాస్‌వ‌ర్డ్‌, పుట్టిన‌తేది వంటి వివ‌రాల‌తో incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. మొద‌టి సారి దాఖ‌లు చేస్తున్న‌వారు ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఏ ఐటీఆర్ ఫారం అవ‌స‌రం అవుతుందో దానిని ఎంచుకొని స‌మాచారాన్ని పూరించాలి. మొత్తం ఏడు ఐటీఆర్ ఫారంలు అందుబాటులో ఉండ‌గా అందులో నాలుగు (ఐటీఆర్ 1,2,3,4) వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుల‌కు వ‌ర్తిస్తాయి. త‌ప్పుడు ఐటీఆర్ ఫారంల ద్వారా రిట‌ర్నులు దాఖ‌లు చేస్తే లెక్క‌లోకి రావు.

ఆల‌స్యంగా దాఖ‌లు చేస్తే పెనాల్టీ:

ప‌న్ను చెల్లింపుదారుడి ప్ర‌తిపాదిక‌న ఒక్కోక్క‌రికి ఒక్కో ర‌కంగా పెనాల్టీ ప‌డుతుంది. అయితే ప్ర‌స్తుత మ‌దింపు సంవ‌త్స‌రం నుంచి ఆల‌స్యంగా దాఖ‌లు చేసిన ప్ర‌తీ ఒక్క‌రు త‌ప్ప‌క చెల్లించ‌ల్సిన పెనాల్టీ కొంత ఉంది. ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం, సెక్ష‌న్ 234ఎఫ్ ప్ర‌కారం ఫైనాన్స్ యాక్ట్ 2017 ద్వారా 2018-19 మ‌దింపు సంవ‌త్స‌రం నుంచి దీనిని అమ‌ల్లోకి తీసుకొచ్చారు. గ‌డువు తేదీ ముగిసిన త‌ర్వాత డిసెంబ‌ర్ 31 లోపు చెల్లించిన‌వారికి రూ.5000, డిసెంబ‌ర్ 31 త‌ర్వాత చెల్లించిన‌వారికి రూ.10,000 పెనాల్టీ ప‌డుతుంది. అయితే వ్య‌క్తి మొత్తం ఆదాయం రూ.5 ల‌క్ష‌లు దాట‌క‌పోతే ఆల‌స్య రుసుము రూ.1000 మాత్ర‌మే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల‌స్యంగా దాఖ‌లు చేస్తున్న‌వారు రూ.1000 నుంచి రూ.10,000 వ‌ర‌కు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

ఆల‌స్య రుసుములు అన్న‌వి త‌ప్ప‌నిస‌రి. ఇంత‌కుముందు బ‌కాయిల‌తో సంబంధం ఉండ‌దు. అడ్వాన్స్ ట్యాక్స్ , టీడీఎస్ , వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లించిన త‌ర్వాత ఇంకా ప‌న్ను బ‌కాయిలు ఉంటే సెక్ష‌న్ 234A ప్ర‌కారం నెల‌కు 1 శాతం చొప్పున వ‌డ్డీ ప‌డుతుంది.

ఇత‌ర వైఫ‌ల్యాలు:

ఆల‌స్యంగా రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం వ‌ల‌న ట్యాక్స్ రీఫండ్‌పై వ‌చ్చే వ‌డ్డీని కోల్పోతారు. ఐటీఆర్ ఫైలింగ్ ఆల‌స్యం అనేది ప‌న్ను చెల్లింపుదారుడి తప్పుగా ప‌రిగ‌ణిస్తారు. అలాగే అస‌లైన గ‌డువు తేదిలోపు రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే వ్యాపారంలో గాని, మూల‌ధ‌న న‌ష్టాలు గాని ఎదురైతే ముందు సంవ‌త్స‌రాల‌కు దీనిని స‌ర్దుబాటు చేసేందుకు వీలుండ‌దు.

రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే…
మార్చి 31, 2019 లోపు మీరు రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే ప‌న్ను అధికారులు మీరు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన త‌ప్పుగా ప‌రిగ‌ణిస్తారు. దీంతో పాటు చెల్లించ‌ని మొత్తం రూ. 3 వేలు దాటితే (అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్ మిన‌హాయించిన త‌ర్వాత) దానిపై 50 శాతం పెనాల్టీ విధిస్తారు.

దీంతోపాటు స‌మ‌యానికి ఐటీఆర్ దాఖ‌లు చేయ‌క‌పోతే సెక్ష‌న్ 276CC కింద మూడు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశ‌ముంది. చెల్లించాల్సిన ప‌న్నుల బ‌కాయిలు రూ.25 ల‌క్ష‌లు దాటితే శిక్ష ఆరు నెల‌ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది. దీంతో పాటు జ‌రిమానా కూడా ప‌డుతుంది. అందుకే స‌మ‌యానికి ప‌న్ను చెల్లించి ఈ స‌మ‌స్య‌ల భారిన‌ ప‌డ‌కుండా ఉండ‌టం ఉత్తమం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly