పీపీఎఫ్ ఎప్పుడు ప్రారంభిస్తే ఎంత లాభం?

5 వ తేదీ త‌ర్వాత పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా పెద్ద‌గా తేడా ఉండ‌ద‌ని మీరు అనుకోవ‌చ్చు. అయితే ఆ చిన్న మొత్తాలే దీర్ఘ‌కాలికంగా పెద్ద మొత్తంగా త‌యార‌వుతాయి.

పీపీఎఫ్ ఎప్పుడు ప్రారంభిస్తే ఎంత లాభం?

ఇప్పుడు చాలా మంది పీపీఎఫ్ పెట్టుబ‌డులు పెడుతున్నారు. అయితే పెట్టుబ‌డులు పెడుతున్నార‌నే కానీ ఎప్పుడు పెడితే ఎంత లాభం పొంద‌వ‌చ్చ‌న్న విష‌యంపై అంద‌రికీ అవ‌గాహ‌న ఉండ‌కపోవ‌చ్చు. పీపీఎఫ్‌లో న‌గ‌దు పొదుపు చేయాల‌నుకునే వారికి ప్ర‌తి నెలా 5 వ తేదీ చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు 5 వ తేదీ కంటే ముందు జ‌మ చేసిన న‌గ‌దుకు మాత్ర‌మే వ‌డ్డీ ల‌భిస్తుంది. ఆ త‌ర్వాత జ‌మ చేసినా దానికి వ‌డ్డీ వ‌ర్తించ‌దు. పీపీఎఫ్‌లో వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌తి నెలా చివ‌రి రోజు నుంచి వ‌చ్చే నెల 5 వ తేదీ వ‌ర‌కు ఉన్న న‌గ‌దును బ‌ట్టి వ‌డ్డీ రేట్ల‌ను లెక్కిస్తారు. ప్ర‌స్తుతం పీపీఎఫ్ వ‌డ్డీ రేట్లు 8 శాతంగా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు నెల ప్రారంభంలో రూ.10 వేలు పీపీఎఫ్ ఖాతాలో జ‌మ చేసార‌నుకుందాం. త‌ర్వాత 7 వ తేదీన మ‌రో రూ.5 వేలు దానికి జ‌త చేసినా, మీకు రూ.10 వేల‌కు మాత్రం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. రూ.15 వేల‌కు క‌లిపి వ‌డ్డీ రాదు. అందుకే ప్ర‌తి నెలా 5వ తేదీ కంటే ముందు పీపీఎఫ్ ఖాతాలో జ‌మ చేస్తే మంచిద‌ని ఆర్థిక నిపుణ‌లు సూచిస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు రామ్, శ్యామ్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు పీపీఎఫ్ ఖాతాను ఒకే రోజు ప్రారంభించార‌నుకుందాం. నెల‌కు రూ.8 వేలు డిపాజిట్ చేస్తున్నారు. అయితే రామ్ 5 వ తేదికి ముందే డిపాజిట్ చేయ‌గా, శ్యామ్ 5 వ తేదీ త‌ర్వాత ప్ర‌తినెల‌ ఖాతాలో జ‌మ చేస్తున్నారు. వారిద్ద‌రి రాబ‌డిలో ఎంత తేడా ఉందో చూడండి.

15 ఏళ్ల త‌ర్వాత రామ్ ఖాతాలో…
మొద‌ట ఏడాది డిపాజిట్లు నెల‌కు రూ.8,000
మొద‌టి నెల జ‌మ చేసిన మొత్తం రూ.8,000+ 664 (12 నెల‌ల‌కు వ‌డ్డీ) = 8,664
రెండో నెల డిపాజిట్ రూ.8,000+607 (11 నెల‌ల‌కు వ‌డ్డీ)= 8,607
మొద‌టి ఏడాది గ‌డిచేస‌రికి డిపాజిట్ చేస‌నిన మొత్తం (రూ.8,000*12)+(4,263)= రూ.1,00,263. మిగ‌తా 14 సంవ‌త్స‌రాల‌కు కూడా ఇదేవిధంగా పెట్టుబ‌డులు కొన‌సాగాయి. 15 ఏళ్లు పూర్త‌య్యేనాటికి మొత్తం రూ. 27,86,761

15 ఏళ్ల త‌ర్వాత శ్యామ్ పెట్టుబ‌డులు…
మొద‌టి ఏడాది డిపాజిట్లు నెల‌కు రూ.8,000 (5 వ తేదీ తర్వాత‌)
మొద‌టి నెల జ‌మ చేసిన డిపాజిట్ రూ.8,000+ రూ.607 (11 నెల‌ల‌కు వ‌డ్డీ)= రూ.8,607
రెండో నెల డిపాజిట్ రూ.8,000+ రూ.550 (10 నెల‌ల‌కు వ‌డ్డీ)= రూ.8,550.
మొద‌టి ఏడాది గ‌డిచేస‌రికి మొత్తం పెట్టుబ‌డులు( రూ.8,000*12)+(3,600)=99,600.
14 సంవ‌త్స‌రాల‌కు అంతే మొత్తం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే , 15 ఏళ్ల త‌ర్వాత ఖాతాలో మొత్తం రూ. 27,68,306

రామ్‌- శ్యామ్ ఇద్ద‌రి రాబ‌డుల మ‌ధ్య తేడా రూ.18,455.

15 సంవ‌త్స‌రాల‌కు రూ.18,455 అంత ఎక్కువ కాదు అని మీరు అనుకోవ‌చ్చు. 6 శాతం ద్ర‌వ్యోల్బ‌ణం అంచ‌నాతో ఆ మొత్తం ప్ర‌స్తుతం రూ.7,700. ఈ డ‌బ్బును ఇంట్లో ఖ‌ర్చుల‌కు లేదా అద్దె చెల్లించేందుకు ఉప‌యోగించుకోవ‌చ్చు. కొంతే క‌దా అని నిర్ల‌క్ష్యం చేయ‌కుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌గా పీపీఎఫ్ ఖాతాలో ప్ర‌తి నెల 5 వ తేదీకి ముందే జ‌మ‌చేస్తే ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly