ఆర్థిక చైత‌న్యంలో సూక్ష్మ రుణ సంస్థ‌ల పాత్ర

స‌మాజంలో ముఖ్యంగా గ్రామీణ వ్య‌వ‌స్థ‌లో సూక్ష్మ రుణ సంస్థ‌ల ప్రాముఖ్య‌త ఏ విధంగా తెలుసుకుందాం!

ఆర్థిక చైత‌న్యంలో సూక్ష్మ రుణ సంస్థ‌ల పాత్ర

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చైత‌న్యం చేయ‌డంలో బ్యాంకులతో పాటు బ్యాంకింగేతర సంస్థలు త‌మ తోడ్పాటునందిస్తున్నాయి. బ్యాంకుల ద్వారా రుణాలు అంద‌నివారికి స‌హ‌క‌రించ‌డం, గ్రామీణ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించ‌డం, బ్యాంకింగ్‌ వ్యవస్థ లేని ప్రాంతాల్లో త‌మ సేవ‌ల్ని ముమ్మ‌రం చేస్తున్నాయి బ్యాంకింగేతర సంస్థలు. అసంఘటిత రంగంలోని వారికి రుణాలు అందించ‌డంలో బ్యాంకింగేత‌ర సంస్థ‌ల కోవ‌కు చెందిన‌ సూక్ష్మ రుణ సంస్థలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి.

పూచీక‌త్తు లేకుండా రుణాలు

పూచీకత్తు సమర్పించ‌డం ద్వారానే వ్యక్తిగత రుణాల‌ను బ్యాంకులు మంజూరు చేస్తాయి. సూక్ష్మ రుణ సంస్థలు ఎలాంటి పూచీక‌త్తు లేకుండానే రుణాలు ఇస్తుంటాయి. కాక‌పోతే కాస్త వ‌డ్డీ ఎక్కువ‌. బ్యాంకు నిబంధ‌న‌ల్లో పేర్కొన్న‌ట్టు క‌చ్చితంగా ధ్రువ‌ప‌త్రాల‌ను ఇక్క‌డ సూక్ష్మ రుణ సంస్థ‌లు కోర‌వు. బ్యాంకు రుణాలకు నిర్ణీత కాలావధిలో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. అదే సూక్ష్మ రుణ సంస్థల విషయంలోకి వచ్చేసరికి వారం, నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. సూక్ష్మ రుణాల‌పై ఒక వాయిదా ఆలస్యమైనా పెనాల్టీ చెల్లించాలి. ఇది కొంచెం భారమైనా రోజువారీ సంపాదించేవారికి ఈ రుణాల ష‌ర‌తులు పెద్ద‌గా ఇబ్బందిగా అనిపించ‌దు. స్వయం సహాయక సంఘాలకు, ఉమ్మడి సహకార సంఘాలకు ఎక్కువగా సూక్ష్మ రుణ సంస్థలు రుణాలు అందించాలనేది ప్రధాన ఉద్దేశం.

విఫ‌ల‌మైన ఏపీ ప్ర‌భుత్వం

పూర్వ కాలంలో వ్య‌వ‌స్థ‌ల‌కు మాత్ర‌మే రుణాలు ఇచ్చేవారు. కాలం మారుతున్న కొద్దీ వ్యక్తులకు సైతం రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సూక్ష్మ రుణ సంస్థలు ఒక్కో కుటుంబానికి విరివిగా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. సులువుగా లభించడంతో ఎక్కువగా తీసుకున్న ప్రజలు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాగైనా రుణాలు వసూలు చేసుకునేందుకు సూక్ష్మ రుణ సంస్థలు పలు ఆగడాలకు పాల్పడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వీటిపై నిరసనలు మొదలుపెట్టి సూక్ష్మ రుణ సంస్థలపై వ్యతిరేక భావన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వం, నియంత్రణ సంస్థల జోక్యంతో పరిస్థితులు దారికొచ్చాయి.

పేద ప్ర‌జ‌ల‌కు తోడ్పాటునందించాలి

పేద ప్రజలకు రుణాలు అందించడం ద్వారా వారు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు సూక్ష్మ రుణ సంస్థలు తోడ్పడాలి. అత్య‌వ‌స‌రానికి రుణాలు తీసుకొని ప్రజలు వాటిని అన‌వ‌స‌ర వాటికి వాడుకున్న‌ట్లు చాలా సంద‌ర్భాల్లో తేలింది. దీనివల్ల ఉత్పాదకత ఉండకపోగా ఆదాయ సృష్టి జరగలేదు. అప్పు తీసుకున్నవారు చెల్లించేందుకు వీలుకాలేదు. రాను రాను సూక్ష్మ రుణ సంస్థల తీరు మారింది. రుణాలతోపాటు, పొదుపు, సూక్ష్మ బీమాల వైపు కూడా దృష్టి సారించాయి సూక్ష్మ రుణ సంస్థ‌లు. నియంత్రణ సంస్థలు అసంఘటిత రంగాన్ని చేరుకునేందుకు ఒక మార్గంగా ఎంచుకోవడంతో మారుమూల ప్రాంతాల్లో సైతం సూక్ష్మ రుణ సంస్థ‌ల‌ విస్తృతి పెరిగింది. గ్రామీణ ప్రజలకు సూక్ష్మ రుణాల ద్వారా ఆర్థిక చేయూతనందివ్వ‌డంతో జీవన ప్రమాణాల్లో మార్పు క‌నిపించింది. ముఖ్యంగా పిల్లలు చదువుకునేందుకు ఈ రుణ వ్య‌వ‌స్థ‌ ఉపయోగపడింది. పేదరికం కారణంగా బడికి దూరంగా ఉన్న పిల్లలను పనిలో పెట్టకుండా చదివించేందుకు ఈ ప్రక్రియ దారితీసింది. చదువు, ఆరోగ్యం పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన పెరిగి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం వ‌చ్చింది.

స్వీయ నియంత్ర‌ణ‌ను పాటించాలిః ఆర్‌బీఐ హిత‌వు

అన్నీ సవ్యంగా జరిగితే సమస్య ఉండదు. అభవృద్ధి అనుకున్నదాని కంటే ఎక్కువ జరుగుతుంది. ఒక మంచి ఉద్దేశంతో సంస్థను ప్రారంభించినా ఆచరణలో, ప్రజల అవసరాలు తెలుసుకోవడంలో విఫలమైనప్పుడు దాని ఆశయాలు నెరవేరవు. కొన్ని సంస్థలు పారదర్శకత లేకుండా వ్యాపారం నిర్వహించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత తలెత్తే ప్రమాదం ఉంది. ఆర్‌బీఐ ఒక స్వీయ నియంత్రణను పాటించాల్సిందిగా, అందుకోసం ఉమ్మడిగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని సూక్ష్మ రుణ సంస్థలకు సూచించింది. కొన్ని సంస్థలు రుణాలు ఇచ్చేటప్పుడు నిబంధనలను ప్రజలకు సరిగా తెలియకజేయకపోవడం వల్ల అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి.

పార‌ద‌ర్శ‌క‌త పాటించాలి

విచ్చలవిడిగా రుణాలు ఇచ్చి, దాని వసూలులో దారుణంగా వ్యవహరించిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణ సంస్థలపై ఒక కఠిన చట్టాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దీంతో చాలా సంస్థలు తమ కార్యకలాపాలన్నింటిని అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. నిబంధనలన్నింటినీ పాటిస్తూ, ప్రజలతో పారదర్శకంగా వ్యవహరించినంత వరకూ ఎలాంటి సమస్య ఉండదని ఎన్నో ఉదంతాలు వెల్లడించిన సత్యం. అటూ సూక్ష్మ రుణ సంస్థలే కాక ప్రజలు సైతం రుణాలు అందక ప్రైవేటు రుణదాతలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు రుణ దాతలను నియంత్రించే నిర్దిష్ట వ్యవస్థ ప్రభుత్వం వద్ద లేదనే చెప్పాలి. యాజమాన్యాలు ముందుచూపుతో వ్యవహరిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడే సూక్ష్మ రుణ సంస్థలు విజయం సాధిస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly