సోఫా, డైనింగ్ టేబుల్ కొంటున్నారా? అద్దెకు తీసుకుంటున్నారా?

స్థిరంగా ఒకే ద‌గ్గ‌ర‌ లేకుండా చ‌దువులు, ఉద్యోగాల కోసం ఇత‌ర ప్రాంతాల‌కు మారేవారికి ఇది ఒక మంచి ఆప్ష‌న్‌గా చెప్తున్నారు

సోఫా, డైనింగ్ టేబుల్ కొంటున్నారా? అద్దెకు తీసుకుంటున్నారా?

గృహోప‌క‌ర‌ణాలు కొనేందుకు ఒకేసారి మొత్తం డ‌బ్బు వెచ్చించ‌కుండా అద్దె రూపంలో తీసుకుంటే నెల‌వారిగా కొంత అద్దె చెల్లిస్తూ మిగ‌తా డ‌బ్బును ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగించుకోవ‌చ్చు, పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. అప్పుడు డ‌బ్బు పొదుపు చేసుకోవ‌డంతో పాటు, ఇంట్లో వ‌స్తువులు కూడా ఉన్న‌ట్లు ఉంటుంది… డెలాయిట్ 2019 నివేదిక ప్ర‌కారం, దేశంలో యువ‌త 34 శాతం ఉన్నారు. వారు ముఖ్యంగా చదువు, ఉద్యోగాల కోసం ఇంటి నుంచి వేరే ప్రాంతాల్లో నివ‌సించాల్సి వ‌స్తుంది. వారికోసం ఫ‌ర్నీచ‌ర్‌ను అద్దెకు ఇచ్చే విధానం బాగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఐకియా వంటి పెద్ద రిటైల‌ర్లు ఈ సేవ‌ల్ని అందిస్తున్నాయి. అయితే అద్ద‌కు తీసుకునే ముందు నియమ‌, నిబంధ‌న‌ల‌ను తెలుసుకోవ‌డం మంచిది

ఈ అద్దె విధానం ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌క‌రం?
ప్ర‌తి 17-18 నెల‌ల‌కు ఒక‌సారి, యువ‌త‌ చ‌దువు, ఉద్యోగం కోసం ప్రాంతాలు మారుతున్నారని ఫ‌ర్నీచ‌ర్‌ను అద్దెకు ఇచ్చే రెంటోమోజో సంస్థ నివేదిక‌ తెలిపింది. ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ఎంత దూరం అయినా వెళ్ల‌డానికి ఆలోచించ‌డం లేదు. దీంతో ఈ ఫ‌ర్నిచ‌ర్‌ను అద్దెకు ఇచ్చే రిటైల‌ర్ల‌కు సానుకూలంగా మారింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో నివ‌సించే యువ‌త మొద‌ట‌గా సౌక‌ర్యానికి ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఎక్క‌వ ఖ‌ర్చు చేసి వ‌స్తువుల‌ను కొనేందుకు వెనుకాడ‌టం లేదు. అయితే వారు గృహోప‌క‌ర‌ణాల‌ను కొన‌డం కంటే అద్దెకు తీసుకోవ‌డం మంచిద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.
క‌ప్‌బోర్డుల నుంచి బెడ్, వాషింగ్ మిష‌న్లు, రిఫ్రిజిరేట‌ర్లు వంటి అన్ని గృహోప‌క‌ర‌ణాల‌ను 48-72 గంట‌ల్లో ఫ‌ర్నీచ‌ర్ అద్దెకు ఇచ్చే సంస్థ‌లు ఉన్నాయి. డెలివ‌రీ ఛార్జీలు ఉచితం. చాలావ‌ర‌కు ఈ సంస్థ‌లు వేరే ప్రాంతాల‌కు మారినప్పుడు కూడా ఫ‌ర్నీచ‌ర్‌ను త‌ర‌లించేందుకు సహ‌క‌రిస్తాయి. దీనికోసం కొంత ఛార్జీల‌ను వ‌సూలు చేయ‌వ‌చ్చు. ఇక్క‌డ అద‌నంగా మ‌రో అవ‌కాశం కూడా క‌ల్పిస్తున్నాయి. 15 రోజుల నుంచి ఒక నెల వ‌ర‌కు ట్ర‌య‌ల్ పీరియ‌డ్‌లో భాగంగా వ‌స్తువుల‌ను వాడుకునేందుకు ఇస్తాయి. క్లీనింగ్, డ్యామేజ్ అయితే బీమా స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్నాయి.

ఖ‌ర్చు ఎంత‌?
మీరు తీసుకున్న సామాగ్రి, ఎంత‌కాలానికి తీసుకున్నార‌నే దాన్ని బ‌ట్టి అద్దె ఉంటుంది. అడ్వాన్స్ పేమెంట్ చేస్తే డిస్కౌంట్ కూడా లభించే అవ‌కాశం ఉంటుంది. ప‌న్ను, ఇన్‌స్టాలేష‌న్ ఛార్జీల‌తో క‌లిపి ధ‌ర‌లు ఉంటాయి. కొంత డిపాజిట్‌ను సెక్యూరిటీ డిపాజిట్‌గా ఫిక్స్ చేస్తారు. వ‌స్తువుల‌ను ఎలాంటి డ్యామేజ్ కాకుండా తిరిగి ఇచ్చేస్తే ఈ సెక్యూరిటీ డిపాజిట్ వెన‌క్కి ఇచ్చేస్తారు. సాధార‌ణంగా ఒక‌టి, రెండు నెల‌ల‌కు అద్దె దాదాపుగా ఒకేరకంగా ఉంటుంది.

వ‌స్తువుల‌ను తీసుకునేముందు డ్యామేజ్ ఖ‌ర్చులు వంటి నియ‌మ నిబంధ‌న‌ల‌ను తెలుసుకోవాలి. సాధార‌ణంగా వస్తువులు ముందు ఉప‌యోగించిన‌వే ఉంటాయి. కాబ‌ట్టి కొత్త వాటిలా ఉండ‌వు. రెంటోమోజో సాధార‌ణ‌ వాడకం వల్ల కలిగే డ్యామేజ్‌కి వసూలు చేయదు. ఏదేమైనా, ఫర్నిచర్ నిరుపయోగంగా మారితే నష్టం వసూలు చేస్తుంది.

త‌గిన శ్ర‌ద్ధ‌
ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టి వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం కంటే నెల‌కు రూ.1000 నుంచి రూ.2000 వ‌ర‌కు అద్దె చెల్లించి వ‌స్తువుల‌ను ఉప‌యోగించుకోవ‌డం మంచిద‌ని చాలావ‌ర‌కు భావిస్తున్నారు. అయితే వ‌స్తువుల‌ను అద్దెకు తీసుకునేముందు ముందుగా ఉప‌యోగించిన‌వారి అభిప్రాయాలు తీసుకోవ‌డం మంచిది.

చివ‌ర‌గా
స్థిరంగా ఒకే ప్రాంతంలో లేకుండా చ‌దువులు, ఉద్యోగాల కోసం ఇత‌ర ప్ర‌దేశాల‌కు మారేవారికి ఇది ఒక మంచి ఆప్ష‌న్‌గా చెప్తున్నారు. ఇంట్లోకి సోఫా, బెడ్‌, వాషింగ్ మిష‌న్‌, మైక్రోవేవ్ ఓవెన్, రిఫ్రిజ‌రేట‌ర్, డైనింగ్ టేబుల్‌ వంటి అన్ని వ‌స్తువుల‌ను ఒకేసారి కొనుగోలు చేసేందుకు వీలులేని వారు కూడా ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

అయితే అవ‌స‌రాల‌కు, కోరిక‌ల‌కు వ్య‌త్యాసం తెలుసుకోవాలి. ఉదాహ‌రణ‌కు డైనింగ్ టేబుల్‌, డిష్‌వాష‌ర్ వంటివి అత్య‌వ‌స‌రం కాదు. వాటిని త‌ర్వాత తీసుకోవ‌చ్చు. సోఫాల‌కు బదులుగా కుర్చీలు తీసుకుంటే ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఒక ప్రాంతంలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం ఉంటామ‌నుఉన్న‌ప్పుడే వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం మంచిది. ఈఎమ్ఐ విధానంలో తీసుకోవ‌డం సౌక‌ర్యంగా ఉంటుంది. యువ‌త, స్నేహితుల‌తో క‌లిసి కుటుంబానికి దూరంగా న‌గ‌రాల్లో ఉన్న‌ప్పుడు వ‌స్తువులు అద్దెకు తీసుకోవ‌డం మంచి ఆప్ష‌న్‌గా చెప్తున్నారు. ఉద్యోగాల్లో స్థిరప‌డిన‌వారు, కుటుంబంతో క‌లిసి ఉండేవారు నోకాస్ట్ ఈఎమ్ఐతో వ‌స్తువుల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

మీరు అద్దెకు తీసుకోవాల‌నుకుంటే నిబంధనలు, షరతులను అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి ఒప్పంద కాలం, డ్యామేజ్‌కి సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly