యువ‌త మెరుగైన క్రెడిట్ స్కోర్ ఎందుకు కోరుకుంటున్నారంటే..

మిలీనియ‌ల్స్ స్వ‌యంగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవ‌డ‌మే కాకుండా దానిని మెరుగుప‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు

యువ‌త మెరుగైన క్రెడిట్ స్కోర్ ఎందుకు కోరుకుంటున్నారంటే..

దేశంలో రుణం తీసుకునేవారిలో ప్ర‌స్తుతం మిలీన‌య‌ల్స్ ఎక్కువ‌గా ఉంటున్నారు. ఆన్‌లైన్ రుణ సంస్థ‌ క్యాష్ఈ నివేదిక ప్ర‌కారం, యువ‌త‌ రుణం తీసుకునేందుకు ముఖ్య కార‌ణాలు, ఈఎమ్ఐ చెల్లింపులు, వైద్య‌ చికిత్స అని వెల్ల‌డించింది. సుల‌భంగా ల‌భించే రుణాల వైపు చూస్తున్నారు. అయితే యువ‌త ఇప్పుడు రుణాల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా ఉంటున్నార‌ని చెప్ప‌డానికి వీల్లేదు. వారు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకొని స‌రిదిద్దుకుంటున్నారు. ఇత‌రుల‌తో పోలిస్తే వారు ఈ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. గ‌త ద‌శాబ్ద కాలం నుంచి క్రెడిట్ స్కోర్‌ను కీల‌కంగా చూస్తున్నారు.

క్రెడిట్ స్కోర్ ఎందుకంత ముఖ్యం?
క్రెడిట్ స్కోర్ అనేది భ‌విష్య‌త్తులో రుణాలు ల‌భించేందుకు , ఎంత రుణం ఇవ్వాలో నిర్ణ‌యించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. క్రెడిట్ బ్యూరోలు వేర్వేరు ప్ర‌మాణాలు క‌లిగి ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు సిబిల్ స్కోర్ క్రెడిట్ రిపోర్టులు క్రెడిట్ చ‌రిత్ర ఆధారంగా త‌యారు చేస్తాయి. ఇది సాధార‌ణంగా 300 నుంచి 900 వ‌ర‌కు ఉంటుంది. 700 కంటే ఎక్కువ‌గా ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా భావిస్తారు. యువ‌త ఎక్కువ‌గా స‌గ‌టుగా 740 అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటుంద‌ని నివేదిక తెలిపింది. నాన్‌-మిలీనియ‌ల్స్ స్కోరు స‌గ‌టుగా 734 గా ఉంది.

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఆర్థిక జీవ‌నం సాఫీగా సాగుతుంది. క్రెడిట్ కార్డులు సుల‌భంగా పొంద‌వ‌చ్చు, వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా పొంద‌వ‌చ్చు, క్రెడిట్ కార్డు ప‌రిమితులు ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చు, రుణం సుల‌భంగా ల‌భిస్తుంది. దీంతో పాటు క్రెడిట్ చ‌రిత్ర బాగుంటే ఉద్యోగాలు, విదేశీ ప‌ర్య‌ట‌న‌ల కోసం వీసా త్వ‌ర‌గా ల‌భిస్తుంది.

మారిన దృష్టి కోణం
పాత త‌రాల‌తో పోలిస్తే మిలీన‌య‌ల్స్ జీవ‌న శైలి, అల‌వాట్ల‌లో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. ఆర్థిక జీవ‌నం కూడా అంతే. 70 శాతం యువ‌త క్రెడిట్ స్కోర్ గురించి జాగ్ర‌త్త పాటిస్తున్నారు. మొద‌ట పొదుపు అనే సిద్ధాంతం నుంచి ఇప్పుడు మొద‌ట అవ‌స‌ర‌మైన‌వి కొనుగోలు చేసి నెమ్మ‌దిగా చెల్లింపులు చేస్తున్నారు. అదేవిధంగా మిలీనియ‌ల్స్ అప్పు తీసుకొని విలాసాల‌కు, వివాహాల‌కు, ప్ర‌యాణాల‌కు ఉప‌యోగించుకుంటున్నారు. క్రెడిట్ స్కోర్‌ను నిల‌బెట్టుకునే స‌మాచారాన్ని తెలుసుకుంటున్నారు. దానికి త‌గిన‌ట్లుగా ఖ‌ర్చు చేస్తున్నారు. అయితే విలాసాల కోసం ఖ‌ర్చు చేయ‌డం అప్పు తీసుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు అని నిపుణుల అభిప్రాయం. అప్పు తీసుకొని స‌మాయ‌నికి చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందేమో కానీ దాంతో పాటు ఖ‌ర్చు చేసే అల‌వాటు కూడా పెరుగుతుంది.

స్కోర్ పెంచుకోవ‌డం
సిబిల్ నివేదిక ప్ర‌కారం, మిలీనియ‌ల్స్ వారి స్కోర్‌ను స్వ‌యంగా ప‌రిశీలించుకోవ‌డ‌మే కాకుండా దానిని పెంచుకునే మార్గాల‌ను కూడా అన్వేషిస్తున్నారు. స్కోర్ చెక్ చేసుకున్న ఆరు నెల‌ల్లో 700 దిగువ ఉన్న‌ 51 శాతం మిలినియ‌ల్స్ వారి స్కోర్‌ను 65 పాయింట్ల మేర పెంచుకున్నారు.

మీ స్కోర్‌ను మెరుగుపరచడానికి, మీ క్రెడిట్ రిపోర్టులో కనిపించే వివాదాస్పద లావాదేవీలను పరిష్కరించే దిశగా పనిచేయడం ప్రారంభించండి. వినియోగదారుడు ఈఎమ్ఐ లు లేదా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను సకాలంలో కొనసాగించాలి. అలాగే, మీ క్రెడిట్ కార్డుపై గరిష్ట పరిమితిని ఉపయోగించకుండా ఉండంటం మంచిది. అప్పు తీసుకొని షాపింగ్ చేయవద్దు. మంచి క్రెడిట్ స్కోర్ కోసం తక్కువ వ్యవధిలో వేర్వేరు రుణాలు లేదా కార్డుల కోసం దరఖాస్తు చేసి నిర్వహించడం ద్వారా క్రెడిట్ చ‌రిత్ర‌ను నిర్మించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా రుణాలు తీసుకోవ‌ద్దు.

ఎక్కువ‌గా రుణాలు తీసుకొని, ఖ‌ర్చు చేసి స‌మాయ‌నికి చెల్లింపులు చేస్తే క్రెడిట్ చరిత్ర బాగున్న‌ప్ప‌టికీ అదే అల‌వాటుగా మారితే రుణాల ఊబిలో కూరుకుపోకే అవ‌కాశం లేక‌పోలేదు జాగ్ర‌త్త‌.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly