నెల‌కు ఎంత పెట్టుబ‌డి పెట్టాలి?

అంటే మీకు నెల‌కు రూ. 50,000 జీతం వ‌స్తుంద‌నుకుంటే రూ.17,500 క‌చ్చితంగా పొదుపు లేదా పెట్టుబ‌డులకు ఉప‌యోగించాలి.

నెల‌కు ఎంత పెట్టుబ‌డి పెట్టాలి?

ఆర్థిక విష‌యాల‌లో సాధార‌ణంగా స్నేహితులు, బందువులు లేదా ఇత‌ర ఆర్థిక ప్ర‌ణాళికాదారుల స‌ల‌హాలు తీసుకుంటుంటారు. ఇది చాలా క‌ష్ట‌మైన విష‌యంగా భావిస్తారు. మంచి రాబ‌డిని పొందేందుకు పెట్టుబ‌డి మార్గాలేంటి రిస్క్ లేకుండా ఎలా పెట్టుబ‌డులు చేయాలి ఎటువంటి నియ‌మాల‌ను పాటించాలి అనే సందేహాలు ఉంటాయి.

పెట్టుబ‌డుల సూత్రం:

ఇవ‌న్నీ సందేహాల‌ను నివృత్తి చేసేందుకు పెట్టుబ‌డుల‌కు ఒక సుల‌భ‌మైన సూత్రం ఉంది. మీ ఆదాయాన్ని నాలుగు భాగాలుగా విభ‌జించండి. మొద‌ట 35 శాతం ఆదాయం పెట్టుబ‌డులకు కేటాయించండి. 30 శాతం ఇంటి ఖ‌ర్చుల‌కు, మ‌రో 30 శాతం ఈఎమ్ఐల‌కు కేటాయించండి. మిగ‌తా 5 శాతం రిస్క్ క‌వ‌రేజ్ కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు.

పెట్టుబడి:

అంటే మీకు నెల‌కు రూ. 50,000 జీతం వ‌స్తుంద‌నుకుంటే రూ.17,500 క‌చ్చితంగా పొదుపు లేదా పెట్టుబ‌డులకు ఉప‌యోగించాలి. వేత‌నం వ‌చ్చిన వెంట‌నే పెట్టుబ‌డుల‌కు కేటాయించ‌డం అల‌వాటు చేసుకోవాలి. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను పెంచుకోవ‌డం త‌గ్గించుకోవ‌డం చేస్తుండాలి. ప్ర‌తి నెల పెట్టుబ‌డులు పెట్ట‌డం కాకుండా ఆటోమేటిక్‌గా మీ ఖాతా నుంచి జ‌మ‌య్యే విధంగా పెట్టుకోవాలి. సిప్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించాలి. అదేవిధంగా ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు ప్రారంభించాలి. అలాగే కనీసం 6 నెలల ఇంటి ఖ‌ర్చుల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోండి.

ఖ‌ర్చులు ప‌రిమితం చేసుకోండి:

విభాగాల వారిగి ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించండి. మీ ఆదాయంలో ఖ‌ర్చుల‌న 30 శాతానికే ప‌రిమితం చేసుకోండి. ఖ‌ర్చుల‌న త‌గ్గించుకునేందుకు మంచి స‌ల‌హా ఏంటంటే అవ‌స‌రాల‌ను, కోరిక‌ల‌ను గుర్తించండి. ఏదైనా వ‌స్తువు కోసం ఖ‌ర్చు చేస్తున్న‌ప్పుడు ఈ వ‌స్తువు ఇప్పుడు ఖ‌చ్చితంగా అవ‌స‌ర‌మా లేదా అని విశ్లేషించుకోండి. ప్ర‌తి ఖ‌ర్చును లెక్కించుకోండి. అప్పుడు దేనికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నారో, ఎక్క‌డ త‌గ్గించే అవ‌కాశం ఉందో తెలుస్తుంది.

ఈఎమ్ఐల‌ను త‌గ్గించండి:

ఇప్పుడు బ్యాంకులు, రుణ సంస్థ‌లు రుణాల‌ను ఆదాయంలో 50-60 శాతం ఈఎమ్ఐల రూపంలో చెల్లించేందుకు అవ‌కాశం ఇస్తున్నాయి. గ‌తంలో రుణాలు తీసుకోవ‌డం మంచిది కాద‌ని చెప్పేవారు. అయితే ఇప్పుడు మారుతున్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అవ‌స‌రాలు పెరుగుతుండ‌టంతో రుణాల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. అయితే రుణాలు మీ నెల వేత‌నంలో 30 శాతానికి ప‌రిమిత‌మ‌య్యేలా చూసుకోవాలి. దీంతో రుణ ఊబిలో చిక్కుకోకుండా ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల కోసం పొదుపు చేసుకోవ‌చ్చు. డౌన్‌పేమెంట్ కోసం స‌రిప‌డా డ‌బ్బు లేక‌పోతే ఇల్లు కొనుగోలు చేయ‌డం వాయిదా వేసుకోవాలి. డౌన్‌పేమెంట్ ఏర్పాటు చేసుకున్న త‌ర్వాత‌నే కొనుగోలు చేయ‌డం మంచిది. అన్ని రుణాల ఈఎమ్ఐలు క‌లిపి ఆదాయంలో 30 శాతానికి మించి ఉండ‌కూడ‌ద‌ని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ వ‌డ్డీతో కూడిన రుణాల‌ను ఇప్ప‌టికే తీసుకున్న‌ట్ల‌యితే అంటే క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాల వంటివి వీలైనంత త్వర‌గా చెల్లించాలి.

బీమా కోసం 5 శాతం:

ఈ రోజుల్లో బీమా అనేది త‌ప్ప‌నిసరి అవ‌స‌రం. మీ ఆదాయంలో 5 శాతం బీమా కోసం కేటాయించాలి. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిపి ఉన్న పాల‌సీలు, ఆరోగ్య‌, జీవిత బీమా క‌లిపి ప్రీమియం 5 శాతానికి మించి ఉండ‌కూడ‌దు. ఎండోమెంట్, హోల్ లైప్, మ‌నీ బ్యాక్, యులిప్ పాల‌సీల‌కు ఎక్కువ‌గా ప్రీమియం ఉంటుంది. దీనికి బ‌దులుగా మీ వార్షిక ఆదాయానికి 10-12 రెట్ల ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవాలి. ఐసీఐసీఐ ప్రొడెన్షియ‌ల్‌, ఎస్‌బీఐ, మ్యాక్స్ లైఫ్ వంటి పాల‌సీల‌ను ఆన్‌లైన్‌లో పాల‌సీబ‌జార్, క‌వ‌ర్‌ఫాక్స్‌.కామ్ ద్వారా పోల్చిచూసుకొని మీకు అనుగుణంగా ఉన్న పాల‌సీని ఎంచుకోవాలి.
పెట్టుబ‌డుల కోసం ఈ సుల‌భ‌మైన స‌ల‌హాల‌ను పాటించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly