మ్యూచువల్ ఫండ్ కామన్‌ అకౌంట్‌ నెంబర్‌

అన్నిమ్యూచువల్ ఫండ్ సంస్థలలో ఒకే ఖాతా ద్వారా సులభతరంగా పెట్టుబడి పెట్టే మార్గమే కామన్ ఎకౌంటు.

మ్యూచువల్ ఫండ్ కామన్‌ అకౌంట్‌ నెంబర్‌

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పథకాల్లో మదుపు చేస్తుంటారు. ఇలాంటివారికి సాధారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఎన్నో రకాల మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తుండడంతో ఏ పథకానికి ఏ తేదీన చెల్లింపు జరపాలో గుర్తుంచుకోలేక గందరగోళానికి గురవుతుంటారు.

వివిధ రకాల మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ప్రతి ఒక్క పథకానికి విడిగా ఒక దరఖాస్తు ఫారం, దాంతో పాటు చెక్కును సమర్పించాల్సి ఉంటుంది.

పెట్టుబడిదారుల ఈ అసౌకర్యాన్ని గుర్తించిన అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఏఎమ్‌ఎఫ్‌ఐ) మ్యూచువల్‌ ఫండ్‌ యుటిలిటీస్‌ (ఎమ్‌ఎఫ్‌యూ) పేరిట ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ‘కామన్‌ అకౌంట్‌ నెంబర్‌’ను పొందవచ్చు. ఖాతా పొందాక పెట్టుబడిదారులు తమ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలన్నీ ఒకేచోట నుంచి నిర్వహించుకోవచ్చు. లావాదేవీలు, చిరునామా మార్పు లాంటివన్నీ ఒకే చోట చేసుకోవచ్చు. ప్రతి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు ఈ వివరాలు విడిగా పంపించే శ్రమ పెట్టుబడిదారుకు తప్పుతుంది.

కామన్‌ అకౌంట్‌ నెంబర్‌తో లాభాలు:

 • పెట్టుబడిదారులు తమ ఖాతా సంఖ్యతో అన్ని ఫండ్‌ వివరాలను ఒక చోటే తెలుసుకొనే వీలు కలగడం.
 • ఒకే ఖాతాలో ఖాతాదారుల సంఖ్య (ఉమ్మడి ఖాతాల విషయంలో), ఖాతాను కలిగి ఉన్న విధానంతో పాటు పెట్టుబడిదారుని సామాజిక హోదాను తెలియపరుస్తుంది.

అవసరమయ్యే వివరాలు :

 • పెట్టుబడిదారు పేరు
 • కేవైసీ
 • ఆదాయ వివరాలు
 • ఖాతా కలిగి ఉన్న విధానం (సింగిల్‌, జాయింట్‌…)
 • ప్రతిపాదిత నామినీలు
 • జాతీయత
 • పన్ను చెల్లింపు పరిధి
 • ప్రధాన ఖాతాదారుడిని సంప్రదించాల్సిన వివరాలు
 • కామన్‌ అకౌంట్‌ నెంబర్‌లో పేర్కొన్న బ్యాంకు ఖాతా వివరాలు
 • డిపాజిటరీ ఖాతా వివరాలు
 • పవర్‌ ఆఫ్‌ అటార్నీ, వివరాలు ఉంటే…
 • మైనర్ల పేరిట పథకాలుంటే సంరక్షకుల వివరాలు

పెట్టుబడిదారులు తమ వ్యక్తిగత వివరాలు, చిరునామాలో మార్పులు ఒకే చోట మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది.

కామన్‌ అకౌంట్‌ నెంబర్‌ పొందే విధానం :

 • ఎమ్‌ఎఫ్‌యూ వెబ్‌సైట్‌ నుంచి కామన్‌ అకౌంట్‌ నెంబర్‌ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకుని లేదా ఆన్ లైన్ లోనే నింపవచ్చు.

 • కామన్ ఎకౌంటు నెంబర్ రిజిస్ట్రేషన్ ఫారాలు నింపి సంబంధిత పత్రాలను జతచేసి ఏదైనా పాయింట్‌ ఆఫ్‌ సర్వీస్‌ కేంద్రాల్లో సమర్పించాలి.

 • వివరాలు పరిశీలించి ఒక విశిష్ట సంఖ్యను, పాస్‌వర్డ్‌ను కేటాయిస్తారు. దీని ఆధారంగా ఖాతాను నిర్వహించుకోవచ్చు.

 • కామన్ ఎకౌంటు నెంబర్ లావాదేవీ ఫారాలు ఉపయోగించి వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో లావాదేవీలను ఒకేసారి జరపవచ్చు.

 • ప్రతి సారీ కొత్త పథకంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొత్త దరఖాస్తు ఫారాన్ని నింపే పని పెట్టుబడిదారుకు తప్పుతుంది.

 • అంతే కాకుండా ఒకటి కంటే ఎక్కువ సిప్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఒకే బ్యాంకు ఖాతా నుంచి ఫలానా తేదీకి సిప్‌ సొమ్ము డెబిట్‌ అయ్యేలా చేసుకొనే వీలును కామన్‌ అకౌంట్‌ నెంబర్‌ కల్పిస్తుంది.

చెల్లింపులు :

 • అన్ని మ్యూచువల్‌ ఫండ్ల చెల్లింపులు, డివిడెండ్‌ పేమెంట్లు యథావిధిగా కొనసాగుతాయి.
 • రకరకాల మ్యూచువల్‌ ఫండ్‌ చెల్లింపులన్నీ కలిపి పెట్టుబడిదారుకు ఒకేసారి చెల్లించే వెసులుబాటు ప్రస్తుతం లేదు.

ఖాతా బదిలీ :

కామన్‌ అకౌంట్‌ నెంబర్‌ను మరొకరి పేరిట బదిలీ చేయలేం. ఉమ్మడి ఖాతాలో ఒక భాగస్వామి మృతిచెందితే దాన్ని మిగిలినవారు కొనసాగించాల్సి ఉంటుంది.

టోల్‌ ఫ్రీ నెంబరు

కామన్‌ అకౌంట్‌ నెంబరుపై మరింత సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా సంప్రదించవచ్చు. టోల్‌ ఫ్రీ నంబరు - 1800 266 1415

ఆన్లైన్ లో లావాదేవీలు

గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాన్ నెంబర్ వచ్చాక మీరు ఆన్లైన్ లో వెంటనే లావాదేవీలు జరపడానికి వీలు లేదు. మీరు ఆన్లైన్ లో మదుపు చేయదలుచుకుంటే క్యాన్ నెంబర్ ఆక్టివేట్ అయ్యాక clientservices@mfuindia.com కి ఈ విషయమై మీ క్యాన్ నంబరు తో ఈ-మెయిల్ చేయాల్సి ఉంటుంది. వారు మీకు తిరిగి ఇమెయిల్ పంపుతారు, ఇందులో ఎలా లాగిన్ తయారు చేసుకోవాలో వివరిస్తారు. తరువాత మీరు ఈ వివరాలతో లావాదేవీలు జరపచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly