జీవితంలోని వివిధ దశల్లో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు

మారుతున్న జీవిత ద‌శ‌ల‌కు అనుగుణంగా ఆర్థిక ప్ర‌ణాళిక‌లోనూ మార్పుల‌ను ఆహ్వానించ‌డం అల‌వ‌ర్చుకోవాలి.

జీవితంలోని వివిధ దశల్లో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు

వ్యక్తుల ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు జీవితంలోని వివిధ దశల్లో వేర్వేరుగా ఉంటుంది. కుటుంబ వ్య‌వ‌స్థ‌లో విశ్రాంత దంపతులు, కొడుకు, కోడలు, మనవళ్లు, మనవరాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ జీవితంలోని వివిధ దశల్లో ఉంటారు. వారి ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు సైతం భిన్నంగా ఉంటాయి. పిల్లల ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు… కొత్తగా పెళ్లైన వారికి వారి లక్ష్యాలకు, పదవీ విరమణ తర్వాత అవసరాలకు… ఇంకా విశ్రాంత దంపతులకు ఆర్థిక స్వేచ్ఛకోసం క్రమమైన ఆదాయం… ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఆర్థిక అవసరం ఉంటుంది.

వ్యక్తి జీవితంలోని వివిధ దశలను బట్టి ఎలాంటి పెట్టుబడి పథకాలు అవసరమో ఒకసారి పరిశీలిద్దాం…

ఆర్జించే తొలినాళ్లలో :

ఉద్యోగంలో చేరి సంపాదించే తొలినాళ్లలో పెద్దగా కుటుంబబాధ్యతలు ఉండవు. పెద్ద లక్ష్యాల కోసం మదుపుచేసేందుకు చాలా సమయమే ఉంటుంది. అందుకే ఈ దశలో ఉన్నవారు నష్టభయాన్ని తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి దీర్ఘకాలంపాటు పెట్టుబడులు పెట్టే దిశగా ఆలోచించాలి.
ఈ దశలోని వారికి సూచించే పోర్ట్‌ఫోలియో ఈక్విటీ ఫండ్లలో 75 నుంచి 80శాతం, డెట్ ఫండ్లలో 20 నుంచి 25శాతం. ఈక్విటీ ఫండ్లు, ప్రత్యేక రంగ ఫండ్లు, విదేశీ ఫండ్ల లాంటివాటిలో నష్టభయం ఉన్నా మంచి రాబడి వచ్చే అవకాశముంది.

అత్యవసర నిధిగా ఉపయోగపడేందుకు కొంత మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్లలో ఉంచడం మంచిది. యుక్తవయసులో సంపాదించేవారు పెద్దమొత్తంలో డబ్బు కూడబెట్టుకునేందుకు పొదుపును అలవాటు చేసుకోవాలి.

సంపాదన వృద్ధి చెందే దశ :

ఈ దశలో వ్యక్తుల ప్రాధాన్యతలు… కొత్త ఇల్లు, కొత్త కారు కొనడం, విదేశీ పర్యటన ప్రదేశాలను చూడడం, కెరీర్‌లో ఉన్నతి సాధించేందుకు పై చదువులకు వెళ్లడం లాంటి కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటారు. నేటి అవసరాలను, రేపటి లక్ష్యాల కోసం డబ్బు దాచుకోవడం రెండింటీని ఈ దశలో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ దశలోని వారికి సూచించే పోర్ట్‌ఫోలియో: ఈక్విటీల్లో 65 నుంచి 80శాతం, డెట్‌ ఫండ్స్‌లో 15నుంచి 30శాతం, లిక్విడ్‌ ఫండ్లలో 5శాతం మేర మదుపు చేయాలి.
సాధ్యమైనంత మేరకు నష్టభయం లేనివాటిలో మదుపుచేస్తే మంచిది. కాస్త నష్టభయం ఉన్న లార్జ్‌ క్యాప్‌, బ్యాలెన్స్‌డ్‌, బ్లూచిప్‌ ఫండ్లలో దీర్ఘకాల అవసరాలకు పెట్టుబడి పెట్టవచ్చు. సిప్‌ విధానంలో మదుపుచేస్తే మార్కెట్‌ నష్టాలను తట్టుకోగలం. అత్యవసర నిధి కోసం డెట్‌, లిక్విడ్‌ పథకాల్లో మదుపుచేయడం మంచిది.

ఉత్తమంగా సంపాదించే దశలో :

ఈ దశలో కెరీర్‌లో ఉన్నతంగా ఉండి చక్కగా సంపాదిస్తుంటారు. పిల్లల ఉన్నత చదువులు, వారి పెళ్లిళ్లు… మన పదవీ విరమణ కాలం సమీపిస్తుంటుంది. అన్ని పెద్ద ఆర్థిక లక్ష్యాల కోసం సొమ్ము కూడబెట్టుకున్నాక… పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం దాచుకోవాల్సిన అవసరం ఈ దశలో ఎంతైనా ఉంది.
ఈ దశలో ఉన్న వారు డైవర్సిఫైడ్‌ ఈక్విటీల్లో 40నుంచి 50శాతం, డెట్‌ ఫండ్లలో 25నుంచి 40శాతం, లిక్విడ్‌ ఫండ్లలో 5నుంచి10శాతం మేరకు పెట్టుబడులు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీల భాగం మంచి రాబడులను అందించేందుకు, డెట్‌ భాగం క్రమమైన ఆదాయానికి, లక్విడ్‌ ఫండ్లు అత్యవసర నిధిగా ఉపయోగపడతాయి.

పదవీ విరమణ దశలో :

పదవీ విరమణ తర్వాత హుందా జీవితాన్ని గడిపేందుకు క్రమమైన ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. దీంతోపాటు అత్యవసర వైద్య అవసరాలకు కొంతమొత్తం ఉండేలా జాగ్రత్తపడాలి. తమ తర్వాత తరాలకు కొంత మొత్తం ఆస్తిని అందించేందుకు ప్రణాళికలు రచించడం ఈ దశలో ఎంతో ముఖ్యం. సంప్రదాయ పెట్టుబడి మార్గాలలో మదుపుచేయడం ఈ కాలంలో సూచనీయం.
బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లలో 25నుంచి 35శాతం, ఇన్‌కమ్‌ ఫండ్లలో 55నుంచి 65శాతం, లిక్విడ్‌ ఫండ్లలో 10నుంచి 15శాతం పెడితే మంచిది. ఈ వయసులో నష్టభయం ఉన్నవాటిలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం కాదు. నెల నెలా ఆదాయం వచ్చేందుకు, మన పెట్టుబడులను సురక్షితంగా ఉంచేందుకు ఈ వయసులో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎవరికైనా పెట్టుబడి లక్ష్యాలు, నష్టాన్ని తట్టుకునే శక్తి వారి వయసుతోపాటు కుటుంబ బాధ్యతలను బట్టి మారుతుంటుంది. వారి వారి పరిస్థితులకు తగ్గట్టు పెట్టుబడి లక్ష్యాలను మార్చుకుంటూ వస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly