ఎన్‌పీఎస్ విత్‌డ్రాపై కూడా పూర్తి పన్ను మిన‌హాయింపు ల‌భిస్తుందా?

ఎన్‌పీఎస్‌పై ప‌న్ను లేక‌పోతే ఇందులో పెట్టుబ‌డులు పెరిగే అవ‌కాశం ఉంటుంది

ఎన్‌పీఎస్ విత్‌డ్రాపై కూడా పూర్తి పన్ను మిన‌హాయింపు ల‌భిస్తుందా?

గ‌తేడాది కేంద్ర కేబినెట్ ఎన్‌పీఎస్‌పై నుంచి న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ చేసుకుంటే ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది. అయితే దీనిని ఇప్ప‌టివ‌ర‌క ప‌న్ను చ‌ట్టంలో చేర్చచ‌క‌పోవ‌డం అమ‌ల్లోకి రాలేదు. అయితే ఈ ఏడాది బ‌డ్జెట్‌లో దీనిని అమ‌ల్లోకి తీసుకొస్తే ప్ర‌యోజ‌నం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఎన్‌పీఎస్ కూడా ఈపీఎఫ్, పీపీఎఫ్ (EEE) మాదిరిగానే పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తే పెట్టుబ‌డులు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్‌పీఎస్‌లో పాక్షికంగా ప‌న్ను వ‌ర్తిస్తుంది (EET) .

ఎన్‌పీఎస్‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపును ఇంకా నోటిఫై చేయ‌లేదు. ఈసారి శుక్ర‌వారం ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్‌లో దీనిని అమ‌ల్లోకి తీసుకొస్తుంద‌ని ఆర్థిక నిపుణులు ఆశిస్తున్నారు. డిసెంబ‌ర్, 2018 లో యూనియ‌న్ కేబినెట్ ఆమోదించిన‌ట్లుగా 60 శాతం ఎన్‌పీఎస్ విత్‌డ్రాపై ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి పెంచితే పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ల‌భించిన‌ట్లవుతుంది. ఎందుకంటే ఎన్‌పీఎస్ పెట్టుబ‌డుల్లో 40 శాతం యాన్యుటీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది, దీనిపై ప‌న్ను ఉండ‌దు. మిగ‌తా 60 శాతంలో, ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో విత్‌డ్రా చేసుకునేందుకు 40 శాతంపై ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌గా, 20 శాతంపై ప‌న్ను ప‌డుతుంది.

ఈపీఎఫ్‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌టంతో ప‌న్ను ఆదా చేసుకునేందుకు ఎక్కువ మంది ఈపీఎఫ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు ఎన్‌పీఎస్‌పై ప‌న్ను లేక‌పోతే ఇందులో పెట్టుబ‌డులు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఎన్‌పీఎస్‌ను మ‌రింత చేరువ చేసేందుక ప‌న్ను మిన‌హాయింపు స‌రైన మార్గ‌మ‌ని ఆర్థిక విశ్లేష‌కులు చెప్తున్నారు. సెక్ష‌న్ 80CCD(1B) కింద ఇప్పుడు ఉన్న రూ.50 వేల ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని ల‌క్ష రూపాయ‌ల‌కు పెంచాల‌ని ఆశిస్తున్నారు.

ఎన్‌పీఎస్ అనేది ప్ర‌తీ ఒక్క‌రికి ముఖ్య‌మైన‌ పెట్టుబ‌డి ప‌థ‌కంగా చెప్తున్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత సాఫీగా జీవ‌నం కొన‌సాగించేందుకు ఎన్‌పీఎస్ పెట్టుబ‌డులు అవ‌స‌రం అని సూచిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన‌ప్ప‌టినుంచే ఎన్‌పీఎస్ పెట్టుబ‌డులు ప్రారంభించాల‌ని చెప్తుంటారు. అందుకే దీనిపై పూర్తి పన్ను మిన‌హాయింపు ల‌భిస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌నేది వారి ఉద్దేశం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly