భార‌త్‌లో ఎన్ఆర్ఐల‌కు పెట్టుబ‌డుల ఆప్ష‌న్స్‌

ఎన్ఆర్ఐలు దేశంలో పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ లేదా ఎన్‌సీఎన్ఆర్ ఖాతా క‌లిగి ఉండాలి

భార‌త్‌లో ఎన్ఆర్ఐల‌కు పెట్టుబ‌డుల ఆప్ష‌న్స్‌

దేశంలో ఎన్ఆర్ఐ పెట్టుబ‌డులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ రోజురోజుకు పుంజుకుంటోంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో పెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఎన్ఆర్ఐలు దేశంలో పెట్టుబ‌డుల‌కు వివిధ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. అయితే ఎన్ఆర్ఐలు దేశంలో ఏ విధంగా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చో తెలుసుకుందాం…

ఈ ప‌థ‌కాలో ఎన్ఆర్ఐలు గ‌రిష్ఠ ప‌రిమితి లేకుండా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు

 • మ్యూచువ‌ల్ ఫండ్లు
 • ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు జారీ చేసే బాండ్లు
 • ఈక్విటీ మార్కెట్లు- దేశీయ కంపెనీల షేర్లు, మార్పిడి స‌హిత డిబెంచ‌ర్లు
 • సెబీ ఆమోదం పొందిన ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు
 • బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
 • కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
 • కంపెనీల మార్పిడి ర‌హిత డిబెంచ‌ర్లు
 • స్థిరాస్తి ( వ్య‌వ‌సాయ భూములు కాకుండా)
 • ప్ర‌భుత్వ సెక్యూరిటీలు , ట్రెజ‌రీ బిల్లులు
 • జాతీయ పొదుపు స‌ర్టిఫికెట్లు
 • ఇండియ‌న్ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లు

పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎన్ఆర్ఐల‌కు ఉండాల్సిన ఖాతాలు…

 1. ఎన్ఆర్ఈ ఖాతా (నాన్-రెసిడెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ రూపీ ఖాతా)
  ఎన్ఆర్ఈ బ్యాంకు ఖాతాను ఫారిన్ క‌రెన్సీని డిపాజిట్ చేసేందుకు ప్రారంభిస్తారు. ఇందులో డ‌బ్బును రూపాయ‌ల్లోకి మార్చుకోవ‌చ్చు. ఎన్ఆర్ఈ ఖాతా లో డ‌బ్బు రూపాయ‌ల్లో ఉంటుంది. ఈ ఖాతాలో, విదేశాల్లో సంపాదించిన ఆదాయం లేదా ఇత‌ర ఎన్ఆర్ఈ ఖాతాలోనుంచి బ‌దిలీ చేసుకునేందుకు వీలుంటుంది.
 2. ఎన్ఆర్ఓ ఖాతా (నాన్‌-రెసిడెంట్ ఆర్డిన‌రీ రూపీ ఖాతా)
  ఎన్ఆర్ఓ ఖాతాను దేశ పౌరుడు విదేశాల‌కు వెళ్లి స్థిర‌ప‌డేందుకు ప్రారంభించే బ్యాంకు ఖాతా. భార‌త్‌లో సంపాదించిన అద్దె, డివిడెండు, పెన్ష‌న్‌, వ‌డ్డీ ద్వారా వ‌చ్చి ఆదాయాన్ని ఎన్ఆర్ఓ ఖాతాలో డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఈ ఖాతాపై ల‌భించే వ‌డ్డీపై ప‌న్ను ఉంటుంది.
 3. ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతా (ఫారిన్ క‌రెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్‌)
  ఇందులో భార‌త్ రూపాయ విలువ‌లోకి సులువుగా మార‌కం చేసుకోవ‌చ్చు. నిర్దేశించిన విదేశీ క‌రెన్సీతోనే ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల‌ను తెరిచేందుకు అవ‌కాశం ఉంటుంది. సింగ‌పూర్ డాల‌ర్‌, ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్‌, అమెరిక‌న్ డాల‌ర్‌, స్టెర్లింగ్ పౌండ్‌, కెన‌డియ‌న్ డాల‌ర్‌, జ‌ప‌నీస్ యెన్ త‌దిత‌ర విదేశీ క‌రెన్సీల‌ను ఈ ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల్లో అనుమ‌తిస్తారు. ఈ ఖాతాల్లో 6 నెల‌ల నుంచి 5 సంవ‌త్స‌రాల ట‌ర్మ్ డిపాజిట్ల‌ను కూడా నిర్వ‌హించ‌వ‌చ్చు.

ప‌న్ను ఎంత‌?

 • ఎన్ఆర్ఐలో భార‌త్‌లో సంపాదించే ఆదాయంపై ప‌న్నుప‌డుతుంది. ప్ర‌తి ఏడాది రిట‌ర్న‌లు స‌మ‌ర్పించ‌వ‌ల‌సి ఉంటుంది.
 • దీర్ఘ‌కాలిక, స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి, షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల ఉప‌సంహ‌ర‌ణ‌లు, స్థిరాస్తిపై ఒకే ర‌కంగా ప‌న్ను వ‌ర్తిస్తుంది
 • బ్యాంకు డిపాజిట్లు, షేర్ల పెట్టుబ‌డులు, మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ల‌పై దేశంలో సంప‌ద‌ ప‌న్ను(వెల్త్ ట్యాక్స్‌) మిన‌హాయింపు ఉంటుంది.
 • ఎన్ఆర్ఈ, ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల వ‌డ్డీ ఆదాయంపై పూర్తిగా ప‌న్న మిన‌హాయింపు ల‌భిస్తుంది.

దేశంలో ఎన్ఆర్ఐలు పెట్టుబ‌డులు పెడితే లావాదేవీలు చేసేంద‌కు, రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు పాన్ అవ‌స‌రం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly