కార్వీ ట్రేడింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ

సెబీ నియ‌మాల‌ను పాటించ‌ని కారణంగా లైసెన్స్ స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఎస్ఎస్ఈ తెలిపింది

కార్వీ ట్రేడింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ

జాతీయ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఎన్ఎస్ఈ), కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను సోమ‌వారం స‌స్పెండ్ చేసింది. ఈ స‌స్పెన్ష‌న్‌ అన్ని విభాగాల‌కు వ‌ర్తిస్తుంది. సెక్యురిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నియ‌మాల‌ను పాటించ‌ని కారణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎక్స్‌ఛేంజ్ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఎన్ఎస్ఈతో పాటు బీఎస్ఈ, మల్టీ క‌మోడిటీ ఎక్స్‌ఛేంజ్‌(ఎమ్‌సీఎక్స్‌), ఎమ్ఎస్ఈఐలు కూడా ఈ బ్రోక‌రేజ్ సంస్థ లైసెన్స్‌ను ర‌ద్దు చేశాయి.

కార్వీ బ్రోక‌రేజ్ సంస్థ‌లో ఖాతాదారుల సెక్యూరిటీల‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు, క్లెయింట్ సెక్యూరిటీలు ఇత‌ర సంస్థ‌ల‌కు విక్ర‌యించ‌డంతో పాటు, కార్వీ రియాల్టీ లిమిటెడ్ వంటి అనుబంధ సంస్థ‌ల‌ను బ‌దిలీ చేస్తున్న‌ట్లు సెబీ ప్రాథ‌మిక ప‌రిశోధ‌న‌లో తేల‌డంతో ఇందుకు సంబంధించి న‌వంబ‌రు 22 ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో కొత్త ఖాతాదారుల‌ను తీసుకోకుండా సెబీ ఆంక్ష‌లు విధించ‌డంతో పాటు ప్ర‌స్తుతం ఉన్న ఖాతాదారుల‌కు సంబంధించిన ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీపై కూడా ఆంక్ష‌లు విధించింది. అంతేకాకుండా ఎక్స్‌ఛేంజ్‌లు ఈ సంస్థ‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.

నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఇటీవ‌ల నిర్వ‌హించిన త‌నిఖీలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రూ.1096 కోట్లు త‌న అనుబంధ సంస్థ కార్వీ రియాల్టీకి ఏప్రిల్ 2016 -అక్టోబ‌రు 2019 మ‌ధ్య బ‌దిలీ చేసింద‌ని తేలింది. అంతేకాకుండా క్ల‌యింట్ల‌కు చెందిన ప‌లు ఖాతాల్లో అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డిన‌ట్లు తేలింది. తొమ్మ‌ది మంది క్ల‌యింట్ల‌కు చెందిన రూ.485 కోట్ల అద‌న‌పు సెక్యూరిటీల‌ను విక్ర‌యించింది. అంతేకాకుండా మే 2019 వ‌ర‌కు ఈ తొమ్మిది మంది క్ల‌యింట్ల‌లో ఆరుగురికి చెందిన రూ.162 కోట్ల విలువైన అద‌న‌పు సెక్యూరిటీల‌ను బ‌దిలీ చేసింది.

న‌లుగురు క్లయింట్ల‌కు చెందిన రూ.257.08 కోట్ల సెక్యూరిటీల‌ను త‌న‌ఖా పెట్టారు. 2019లో జూన్‌-ఆగ‌ష్టు మధ్య‌ ఆ షేర్ల‌ను త‌న‌ఖా నుంచి విడిపించిన‌ప్ప‌టికీ అందులో 217.85 కోట్ల విలువైన షేర్ల‌ను కేఎస్‌బీఎల్ రిక‌వ‌రీ చేసుకుంది. 2019లో ఆ తొమ్మిది మంది క్ల‌యింట్ల‌కు చెందిన ఖాతాల్లో ఐదుగురి నుంచి రూ.228.07 కోట్ల విలువైన షేర్ల‌ను కేఎస్‌బీఎల్ కొనుగోలు చేసింది. 156 క్ల‌యింట్ల‌కు స‌బంధించి ఒక్క ట్రేడ్ కూడా నిర్వ‌హించ‌న‌ప్ప‌టికీ, వారి నుంచి రూ.27.8 కోట్ల విలువైన షేర్ల‌ను బ‌దిలీ చేసింది. జూన్ 2019 నుంచి కేఎస్‌బీఎల్‌తో ఎటువంటి ట్రేడింగ్ నిర్వ‌హించ‌న‌ప్ప‌టికీ, 291 క్లయింట్ల నుంచి రూ.116.3 కోట్ల షేర్ల‌ను బ‌దిలీ చేశారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly