ఎన్‌పీఎస్‌లో టైర్ 1, 2 ఖాతాల స‌మ‌గ్ర వివ‌రాలు

మ‌లి వ‌య‌సులో ఆర్థికంగా ప‌రిపుష్ఠంగా ఉండేలా కొత్త పింఛ‌ను ప‌థ‌కం ఆరంగ్రేటం చేసింది.

ఎన్‌పీఎస్‌లో టైర్ 1, 2 ఖాతాల స‌మ‌గ్ర వివ‌రాలు

జాతీయ పింఛ‌ను ప‌థ‌కాన్ని(ఎన్‌పీఎస్‌) ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు ఒకే ఖాతాను తెరిచే అవ‌కాశ‌ముండేది. అప్ప‌టికి దానికింకా టైర్ 1 అని నామ‌క‌ర‌ణం చేయ‌లేదు. అయితే ఎన్‌పీఎస్ చందాదార్ల‌కు అనుకూలంగా ఉంటుంద‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఆ త‌ర్వాతి కాలంలో అద‌నంగా మ‌రో ఖాతాను తెరిచేందుకు వెసులుబాటు క‌ల్పించింది. ఎన్‌పీఎస్ ప‌థ‌కం కింద ప్ర‌ధాన ఖాతాను టైర్ 1 ఖాతాగా పేర్కొంటున్నారు. ఆప్ష‌న‌ల్‌గా వాడే మ‌రో ఖాతాను టైర్ 2గా ప‌రిగ‌ణిస్తున్నారు.

రిక‌రింగ్ డిపాజిట్ మాదిరిగా

టైర్ 1 అకౌంట్‌ సాధార‌ణ ఎన్‌పీఎస్ ఖాతా. సెక్ష‌న్ 80 CCD ద్వారా ఈ ఖాతాలో జ‌మ‌చేసే సొమ్ముపై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. టైర్ 1 అకౌంట్ అంటే సాధార‌ణ రిక‌రింగ్ డిపాజిట్ మాదిరిగా అనుకోవ‌చ్చు. నిర్ణీత క్ర‌మ వ్య‌వ‌ధుల్లో కొంత సొమ్మును డిపాజిట్ చేసి మెచ్యూరిటీ స‌మ‌యానికి విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

ఎన్‌పీఎస్ టైర్ 1 ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకోవాలంటే ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు అయిన 60కి చేరేదాకా వేచిచూడాలి. ఇంకా కావాలంటే 70ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే దాకా కొన‌సాగించ‌వ‌చ్చు. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మాత్ర‌మే మెచ్యూరిటీ గ‌డువు తీర‌కుండానే సొమ్మును మ‌ధ్య‌లోనే విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

క‌నీసం ఏడాదికోసారైనా

రిక‌రింగ్ డిపాజిట్‌కు … టైర్ 1 ఖాతాకు ఓ చిన్న తేడాను గ‌మ‌నించ‌వ‌చ్చు. రికరింగ్ డిపాజిట్ అయితే నెల‌నెలా నిర్ణీత సొమ్మును జ‌మ‌చేయాలి. టైర్ 1లో ఇలాంటి నిబంధ‌న లేదు. క‌నీసం ఏడాదికోసారైనా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క‌సారికి క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాలి. అయితే ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీస డిపాజిట్ రూ.1000కి త‌క్కువ కాకుండా చూసుకోవాలి. ఒక వేళ క‌నీసం ఒక్క డిపాజిట్ చేయ‌డంలో విఫ‌ల‌మైతే నామ‌మాత్ర‌పు పెనాల్టీ చెల్లించాక‌ త‌దుప‌రి డిపాజిట్‌కు అనుమ‌తిస్తారు. క‌నీస డిపాజిట్ చేయ‌ని ప‌క్షంలో ఖాతా తాత్కాలికంగా నిలిచిపోతుంది. పెనాల్టీతో పాటు క‌నీస డిపాజిట్ చేశాకే ఖాతాను పున‌రుద్ధ‌రిస్తారు.

ఎన్‌పీఎస్ టైర్ 1 ఖాతాకు… సాధార‌ణ రిక‌రింగ్ డిపాజిట్ కు ఉన్న మ‌రో తేడా ఏమిటంటే … టైర్ 1 ఖాతాలో డ‌బ్బు జ‌మ‌చేసేందుకు నిర్ణీత తేదీ, స‌మ‌యం అంటూ లేదు. మ‌న‌కు అందుబాటులో ఉన్న వేళ సొమ్మును జ‌మ‌చేయ‌వ‌చ్చు. అయితే ఏడాదికి క‌నీస డిపాజిట్ రూ.1000 అన్న ష‌ర‌తును చందాదారులు గ‌మ‌నించాలి. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే గ‌రిష్ఠ పెట్టుబడుల‌కు ఎలాంటి ప‌రిమితి విధించ‌లేదు. అంటే ఎంత సొమ్ము అయినా డిపాజిట్ చేసుకోవ‌చ్చు. మీరు జ‌మ‌చేసే సొమ్ముతో పాటు మీ సంస్థ కూడా ఈ ఖాతాలో డిపాజిట్లు చేయ‌వ‌చ్చు.

భార‌తీయ పౌరులంద‌రికీ…

ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వాల్సి ఉంటుంద‌నే నిబంధ‌న ఉంది. అయితే ప్ర‌భుత్వేత‌ర సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగులు, లేదా స్వ‌యం ఉపాధి పొందేవారు త‌మ ఇష్టం మేర‌కు ఎన్‌పీఎస్ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. వాస్త‌వానికి భార‌త పౌరులంద‌రు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకునేందుకు ప్ర‌భుత్వం క‌ల్పించిన మంచి అవ‌కాశం ఎన్‌పీఎస్.

నిర్ణీత స‌మ‌యాల్లో జ‌మ‌చేస్తేనే లాభం

టైర్ 1 ఖాతాలో ఎన్ని సార్ల‌యినా డిపాజిట్ చేసేందుకు స్వేచ్ఛ ఉన్న‌ప్ప‌టికీ రూపీ కాస్ట్ యావ‌రేజింగ్ అనే ప్ర‌యోజ‌నాన్ని ద‌క్కించుకునేందుకు నిర్ణీత గ‌డువులో నిర్ణీత మొత్తాన్ని జ‌మ‌చేయ‌డం మంచిది. రూపీ కాస్ట్ యావ‌రేజింగ్ అనే సాంకేతిక ప‌దం మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో, క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల్లో వ‌స్తుంటుంది. ఇది ముఖ్యం ఎందుకంటే … ఎన్‌పీఎస్‌లో జ‌మ‌చేసే కొంత సొమ్మును ఈక్విటీల‌కు మ‌ళ్లిస్తారు. ఈ విష‌యాన్ని చందాదారులు గ‌మ‌నించాలి.

మ్యూచువ‌ల్ ఫండ్లలో ల‌భించే సిప్ విధానం మాదిరిగా ఎన్‌పీఎస్ ఖాతా ఉండ‌దు. టైర్ 1 ఖాతాకు నిర్ణీత తేదీల‌ను, నిర్ణీత గ‌డువును మ‌న‌మే ఎంచుకొని వాటికే ప‌రిమితం అవ్వాలి.

టైర్ 2 ఖాతా ప్ర‌ధాన విశేషాలు

 • టైర్ 2 ఖాతా పొదుపు ఖాతా లాంటిది. పొదుపు ఖాతాలో తాత్కాలికంగా సొమ్మును డిపాజిట్ చేసే మాదిరిగానే ఇందులోనూ జ‌మ‌ చేయ‌వ‌చ్చు.
 • ప‌ద‌వీ విర‌మ‌ణలోగా ఏవైనా అత్య‌వ‌స‌ర‌మైతే ఈ ఖాతాలో నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
 • టైర్ 2 ఖాతా తెర‌వ‌డం త‌ప్ప‌నిస‌రి కాదు. అయితే టైర్ 2 ఖాతా తెరిచేందుకు అంత‌కుముందే టైర్‌1 ఖాతా ఉండాలి.
 • టైర్ 2 ఖాతాలో చేసే డిపాజిట్ల‌పై ఎలాంటి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌వు. అలాగే విత్‌డ్రాయ‌ల్స్‌పై ఎలాంటి ప‌రిమితులు లేవు.
 • టైర్ 1, టైర్ 2 రెండు ఖాతాల‌ను ఒకేసారి తెర‌వ‌వ‌చ్చు. టైర్ 2 ఖాతా తెరిచేందుకు విడిగా కేవైసీ విధానాన్ని పాటించ‌న‌క్క‌ర్లేదు.
 • టైర్ 1 ఖాతాకు ఏదైతే ప్రాన్ సంఖ్య ఉందో అదే దీనికీ వ‌ర్తిస్తుంది.
 • టైర్ 2 ఖాతాలోని సొమ్మును టైర్ 1 ఖాతాకు మ‌ళ్లించ‌వ‌చ్చు. అయితే రివ‌ర్స్‌లో చేయ‌డం సాధ్య‌ప‌డ‌దు.
 • టైర్ 2 ఖాతా తెరిచేందుకు బ్యాంకు ఖాతా వివ‌రాలు ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ రెండు ఖాతాల్లో జ‌మ‌చేసే సొమ్మును యూనిట్లుగా చూపిస్తారు.
 • ఎన్ఏవీ ప్ర‌భావంతో యూనిట్ల సంఖ్య‌లో హెచ్చుత‌గ్గుల వ‌ల్ల‌ విత్‌డ్రాయ‌ల్ చేసే స‌మయానికి అందుకునే సొమ్ములో స్వ‌ల్ప తేడా ఉండ‌వ‌చ్చు.

రెండు ఖాతాల్లోనూ సామాన్య అంశాలు

 • టైర్ 1, టైర్ 2 రెండు ఖాతాల్లోనూ న‌గ‌దును ఎల‌క్ట్రానిక్ రూపంలో బ‌దిలీ చేయ‌వ‌చ్చు.
 • ఖాతాలో న‌గ‌దు జ‌మ అయ్యాక మీరు ఎంచుకునే పెన్ష‌న్‌ ఫండ్ మేనేజ‌ర్ యూనిట్ల‌ను కొనుగోలుచేస్తారు.
 • ఖాతాలో న‌గ‌దు జ‌మ‌కు, అవి యూనిట్లుగా మారేందుకు స్వ‌ల్ప వ్య‌వ‌ధి ఉంటుంది.
 • ఉద్యోగం మారినా, నివాస ప్రాంతం మారినా అక్క‌డికి ఈ ఖాతాల‌ను బ‌దిలీ చేసుకునే వీల‌వుతుంది.
 • ఇత‌ర ప్రావిడెంట్ ఫండ్ల మాదిరిగా ఎన్‌పీఎస్ ఖాతాలోని సొమ్మును బ‌దిలీ చేసేందుకు ఎలాంటి ప్ర‌త్యేక విజ్ఞప్తి చేయ‌న‌క్క‌ర్లేదు.

పైన వివ‌రించిన ప్రాథ‌మిక విష‌యాల‌తో జాతీయ పింఛ‌ను ప‌థ‌కాన్ని తెరిచేందుకు ఆస‌క్తి ఉంటే ముందుకు సాగ‌వ‌చ్చు అని సూచిస్తున్నాం.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly